ఆర్థిక అసమానతలు మంచిది కాదు
నరసరావుపేట శతాబ్ది ఉత్సవాల్లో కేంద్రమంత్రి వెంకయ్య
నరసరావుపేట వెస్ట్: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు దేశ భవిష్యత్తుకు మంచిది కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. కొందరు నేతలు కులం, మతం పేరుతో దేశాన్ని చీల్చేందుకు యత్నిస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలక శతాబ్ది ఉత్సవాల రెండోరోజు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కొన్ని పార్టీలు తాత్కాలిక ప్రయోజనాల కోసం పాకులాడుతూ మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు యత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
వారు మైనార్టీల కోసం నిజంగా శ్రమించి ఉంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా మైనార్టీలు ఇంకా పేదవారిగానే ఎందుకున్నారని ప్రశ్నించారు. పట్టణాలతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఏపీకి జాతీయ రహదారుల కింద రూ.65 వేల కోట్ల నిధులు మంజూరు చేయనున్నామని తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల, మంత్రి కామినేని , ఎంపీ రాయపాటి ప్రసంగించారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.