
గుంటూరు: సత్తెనపల్లిలో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద రావు వ్యతిరేక వర్గం కాక రేపుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గానికి పట్టిన పీడ పోవాలంటూ టీడీపీ కార్యకర్తలు పసుపునీటితో శుద్ధి చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. సత్తెనపల్లి పట్టణంలో టీడీపీ కార్యకర్తలు రోడ్లు ఊడుస్తూ పసుపు నీళ్లు చల్లి కోడెల మాకొద్దంటూ నినాదాలతో హోరెత్తించారు. గోబ్యాక్ కోడెల, కోడెల డౌన్ డౌన్ అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదే సీటు తన కుమారుడికి ఇప్పించుకోవాలని నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే చంద్రబాబు నుంచి సత్తెనపల్లి అసెంబ్లీ, నరసరావుపేట ఎంపీ సీట్లపై ఎలాంటి హామీ రాకపోవడంతో రాయపాటి సాంబశివరావు అగ్గిమీద గుగ్గిలం అవుతోన్నారు. సత్తెనపల్లి అసెంబ్లీ సీటు రాయపాటి సాంబశివరావు అడగటం భావ్యం కాదని ఆయన సీటు ఏదో ఆయన చూసుకోవాలి గానీ తన సీటు అడగటం ఏంటని కోడెల కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.