సాక్షి, గుంటూరు : పోలింగ్ సందర్భంగా రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సృష్టించిన అరాచకాలపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్ సీపీ నేతలు చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. ఈ ఘటనలో కోడెల సహా మరో 22 మందిపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 131, 132, 188, 143, 341, 448, 506, ఆర్/డబ్ల్యూ 149 తదితర ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తన చొక్కా తానే చించుకుని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కొట్టారంటూ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు సహా మరో ఇద్దరిపై కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు సృష్టించిన అరాచకాలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
చదవండి : కోడెల అరాచకం; స్పందించకపోతే నిరాహార దీక్ష!
కాగా పోలింగ్ జరుగుతున్న సమయంలో కోడెల రాజుపాలెంలోని ఇనిమెట్ల గ్రామంలో 160 నెంబర్ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. గంటన్నరకు పైగా అక్కడే కూర్చొని ఉన్నారు. దీంతో కోడెలను బయటకు పంపాలంటూ ఓటర్లు ఆందోళకు దిగారు. నేను ఇక్కడే ఉంటాను ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఓటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఓటర్లు కోడెలపై తిరుగుబాటు చేశారు. స్వయంగా ఒక అభ్యర్థి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తలుపులేసుకొని ఉండడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఓటర్ల తిరుగుబాటుతో కంగుతిన్న కోడెల.. సొమ్మసిల్లి పడిపోయినట్లు నటించారు. ఈ క్రమంలో కోడెలపై దాడి పేరుతో వైఎస్సార్ సీపీ నాయకులు అంబటి రాంబాబు, నిమ్మకాయల రాజనారాయణ, బాసు లింగారెడ్డిపై కేసులు బనాయించిన సంగతి తెలిసిందే.
చదవండి: కోడెల అరాచకం.. వెలుగులోకి వీడియోలు!
Comments
Please login to add a commentAdd a comment