
సాక్షి, గుంటూరు : ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో రాజుపాలెం మండలం ఇనిమెట్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై దాడి కేసులో నిందితుల గుర్తింపు కోసం సోదాలు నిర్వహించారు. వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌తో ఇనిమెట్లలో అలజడి చెలరేగింది. మొత్తం 30 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. నేరుగా 160 నెంబర్ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఆయన తలుపులు వేసుకున్నారు. గంటన్నరకు పైగా అక్కడే కూర్చొని ఉన్నారు. దీంతో కోడెలను బయటకు పంపాలంటూ ఓటర్లు ఆందోళకు దిగారు. నేను ఇక్కడే ఉంటాను ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఓటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఓటర్లు కోడెలపై తిరుగుబాటు చేశారు. స్వయంగా ఒక అభ్యర్థి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తలుపులేసుకొని ఉండడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఓటర్ల తిరుగుబాటుతో కంగుతిన్న కోడెల.. సొమ్మసిల్లి పడిపోయారు.
ఈ క్రమంలో కోడెలపై దాడి పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు అంబటి రాంబాబు, నిమ్మకాయల రాజనారాయణ, బాసు లింగారెడ్డిపై కేసులు బనాయించారు. 147,148, 452, 342, 427, 307,188ఆర్/డబ్ల్యూ,120బీ,132,135(ఏ)ఆర్‌పీఏ తదితర సెక్షన్లతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేసి.. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment