నాయక్‌ నహీ..ఓ చోర్‌ హై.. | TDP Candidates Are Being With Full Of Criminal Records | Sakshi
Sakshi News home page

నాయక్‌ నహీ..ఓ చోర్‌ హై..

Published Thu, Mar 21 2019 11:44 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

TDP  Candidates Are Being With Full Of Criminal Records - Sakshi

సాక్షి, గుంటూరు : టీడీపీ అభ్యర్థుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. నరసరావు పేట పార్లమెంట్‌ అభ్యర్థితోపాటు ముగ్గురు అసెంబ్లీ టిక్కెట్లు పొందినవారికీ నేర చరిత్ర ఉంది. ఎంపీ అభ్యర్థి రాయపాటిపై పొగాకు బేళ్లలో చెత్త నింపి విదేశాలకు ఎగుమతి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, చిలకలూరిపేట, పొన్నూరు, పెదకూరపాడు, బాపట్ల అభ్యర్థులు కోడెల, యరపతినేని, జీవీ, ప్రత్తిపాటి, ధూళిపాళ్ల, కొమ్మాలపాటి, అన్నం సతీష్‌పై ఆరోపణలు ఉన్నాయి. 

‘ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం’ అన్న నినాదంతో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ నాయకులు ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను అడ్డగోలుగా దోచుకుం టున్నారు. ఎంతటి నేరచరిత్ర ఉన్నా, ఎన్ని అక్రమాలకు తెగబడినా రూ.కోట్లకు పడగలెత్తి, పార్టీకి సూట్‌కేసుల్లో రూ.కోట్లు ముట్టజెబితేచాలు టిక్కెట్లు ఖాయమన్న తీరులో ఆ పార్టీ రాజకీయాలు సాగుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులే ఇందుకు నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  

హత్య కేసులో జైలుకెళ్లిన యరపతినేని
గురజాల సిట్టింగ్‌ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు 1992లో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు సంబంధించి గుంటూరు, నల్గొండ జిల్లాల డిస్ట్రిబ్యూషన్‌ తీసుకున్నారు. అయితే డిపాజిట్‌ డబ్బు చెల్లించకుండా భూములు తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకున్నారు. రూ.60 లక్షలు వారికి చెల్లించకుండా ఎగనామం పెట్టారు. దీంతో వారు హైదరాబాద్‌ సిటీ సివిల్‌కోర్టులో దావా వేయగా రూ.1.70 కోట్లకు కోర్టు డిక్రీ ఇచ్చింది.

అనంతరం 1999లో యరపతి నేని టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన భూములను జప్తు చేయకుండా తప్పించుకున్నారు. ఇప్పటికీ ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆ భూములను జప్తు చేసుకోలేకపోయింది. గుంటూరులో స్నేహ చరిత చిట్‌ఫండ్‌ కంపెనీ స్థాపించి, కస్టమర్లకు కుచ్చు టోపీపెట్టి ఐపీ దాఖలు చేయడంతో అప్పట్లో బాధితులు నరసరావుపేట కోర్టును ఆశ్రయించారు. 2012లో పిడుగురాళ్లలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఉన్నం నరేంద్ర హత్యకు గురయ్యారు.

ఆ కేసులో యరపతినేని మూడో నిందితుడు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన అప్పట్లో అజ్ఞాతంలోకి వెళ్లగా రూరల్‌ ఎస్పీ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యరపతినేని హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్‌కు సైతం పంపారు. 2014 సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక యరపతినేని అక్రమాలకు లైసెన్స్‌ ఇచ్చినట్లయింది. నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌ తెరలేపి అడ్డగోలుగా రూ.వేల కోట్ల విలువజేసే సహజ సంపదను దోచుకున్నారు.

పిడుగురాళ్ల మండలం సీతారాంపురం, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి ప్రాంతాల్లో ఎమ్మెల్యే కనుసన్నల్లో నడిచిన మైనింగ్‌ మాఫియా నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) రిపోర్ట్‌ ప్రకారం 2017 జనవరి నాటికి 68.53 లక్షల టన్నుల తెల్లరాయిని అమ్ముకుంది. 2017 జనవరి నుంచి 2018 జూలై 25వ తేదీ హైకోర్టు అక్రమ మైనింగ్‌ నిలిపివేసే నాటి వరకూ మరో 30 లక్షల టన్నుల సున్నపు రాయిని దోచేశారని నిపుణులు లెక్కతేల్చారు.  

డెయిరీ ఆస్తులు కబ్జా చేసిన ధూళిపాళ్ల
పొన్నూరు నుంచి టీడీపీ తరఫున బరిలో నిలుస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర  రూ.వేల కోట్ల విలువ చేసే సంఘం డెయిరీ ఆస్తులను హస్తగతం చేసుకుని, ఏకంగా డెయిరీ స్థలంలో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరున ఆసుపత్రి నిర్మించారనే ఆరోపణలున్నాయి. పెదకాకాని, ఇతర ప్రాంతాల్లో పోరంబోకు భూములను కాజేసిన చరిత్ర ఆయన సొంతం. నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌ నిర్వహిస్తూ, రాజధాని ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేపట్టి రూ.కోట్లతో జేబులు నింపుకొన్నారని, భూకబ్జాలకు సైతం పాల్పడ్డారనే విమర్శలున్నాయి

ఆయన అవినీతి అక్రమాలను ప్రశ్నించినవారిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీల్లో పెట్టించి నరేంద్ర వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో నివసిస్తున్న చేబ్రోలుకు చెందిన పెమ్మసాని శ్రీధర్‌కు స్వగ్రామంలో 2014లో వాసిరెడ్డి రాజశేఖర్‌ నుంచి 803 గజాల స్థలం కొన్నారు. వాసిరెడ్డి రాజశేఖర్‌ బాబాయ్‌ వాసిరెడ్డి శంకర్‌రావు, అతని కుమారుడు వాసిరెడ్డి వంశీ ఆ స్థలంలోకి వెళ్లకుండా శ్రీధర్‌ను అడ్డుకుంటున్నారు. ఈ విషయమై శ్రీధర్‌ చేబ్రోలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు.

ఇటీవల శ్రీధర్‌పై శంకర్‌రావు కుటుంబ సభ్యులు కత్తితో దాడి చేసి గాయపరిచారు. అయినా కేసు నమోదు చేసి శంకర్‌రావు కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోలేదు. ఇందుకు కారణం శంకర్‌రావు సమీప బంధువు ధూళిపాళ్ల నరేంద్ర వద్ద న్యాయవాదిగా పనిచేయడమే. ఆయనకు తన స్థలాన్ని కట్టబెట్టాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని శ్రీధర్‌ ఆరోపిస్తున్నారు. న్యాయం చేయమని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా చేబ్రోలు సీఐ తనపైనే దాడికి పాల్పడ్డాని శ్రీధర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయమై బాధితుడు ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశాడు. 

రాయపాటిపై ఎన్ని ఆరోపణలో..
తాజామాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఆరోపణలు అన్నీ ఇన్నికావు. గతంలో పొగాకు రైతులకు డబ్బు ఎగ్గొ ట్టారని, పొగాకు బేళ్లలో చెత్తను కుక్కి ఇతరదేశాలకు ఎగుమతి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఇరుక్కున్న రాయపాటిని అప్పట్లో ఇందిరాగాంధీ కాపాడారనే పుకార్లు ఇప్పటికీ షికార్లు చేస్తున్నాయి. చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశారంటూ ఓ బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా కోర్టు రాయపాటికి మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే.

2014లో రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌పార్టీ పూర్తిగా దెబ్బతిన్నదని గ్రహించి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న మోదుగుల వేణుగోపాలరెడ్డిని పక్కనపెట్టి రాయపాటికి నరసరావుపేట పార్లమెంట్‌ టిక్కెట్‌ ఇచ్చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచిన రాయపాటి నియోజకవర్గంలోని ప్రజలకు ఎన్నడూ అందుబాటులో ఉన్న దాఖలాలు లేవు.

నాగార్జున సాగర్‌కు పక్కనే ఉన్న భూములకు సైతం చుక్క నీరందక రైతులు విలవిల్లాడుతున్నా రాయపాటి అటువైపు తొంగి చూడలేదు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన రాయపాటికి రెండో సారి టీడీపీ టిక్కెట్‌ కేటాయించడంపై ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.

కోడెల హయాంలో అరాచకాలు
 సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు హోంమంత్రిగా ఉన్న సమయంలో దివంగత కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ హత్య జరిగింది. ఆ హత్యలో మంత్రి కోడెల హస్తం ఉందని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు. 1999 ఎన్నికల సమయంలో కోడెల ఇంటిలో బాంబులు పేలి అతని అనుచరులు నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

మంత్రి పదవి కోసం తాను వెళ్తున్న దారిలో తానే బాంబులు పెట్టించుని, వాటిని దూరంగా పేల్చడం వంటివి కూడా చేశారనే విమర్శలూ ఉన్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుటుంబ సభ్యులు చెలరేగిపోయారు. భూ కబ్జాలు, కే ట్యాక్స్‌ పేరుతో కాంట్రాక్టర్లు నుంచి సామాన్యుడి వరకూ ప్రతి ఒక్కరి రక్తాన్ని జలగాల్లా తాగారు. మరో సారి సత్తెనపల్లి సీటు కోడెలకు ప్రకటించడంతో ఆయన గెలుపొందితే మా మనుగడ కష్టాంగా మారుతుందని ఆ పార్టీ నాయకులే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంటో అర్థం చేసుకోవచ్చు. 

బ్యాంకులను బురిడీ కొట్టించిన అన్నం సతీష్‌
బాపట్ల టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్‌ ప్రభాకర్‌పై ప్రభుత్వ భూములు తనఖా పెట్టి లోన్లు తీసుకుని బ్యాంకులను బురిడీ కొట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం యాజిలి గ్రామంలోని ప్రభుత్వ భూములను తనఖా పెట్టి ఎస్‌బీఐ నుంచి సతీష్‌ప్రభాకర్‌ తన కంపెనీ అయిన సతీష్‌ మెరైన్‌ ఎగ్గిమ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరున లోను తీసుకున్నారు. యాజిలి గ్రామంలో 11.66 ఎకరాల ప్రభుత్వ భూమికి 1బీ భూ యాజమాన్య హక్కు నిర్ధారించే పత్రం తయారు చేసుకుని ఆయన బ్యాంకులను బురిడీ కొట్టించారు.   

హత్య కేసులో ముందస్తు బెయిల్‌ పొందిన జీవీ ఆంజనేయులు 
వినుకొండ తాజామాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు సైతం 2004లో ఓ హత్య కేసులో నిందితునిగా ఉండి అరెస్ట్‌ కాకుండా ముందస్తు బెయిల్‌ పొందారు. ఆ తరువాత రాజీ కుదుర్చుకుని కేసు కొట్టివేయించుకున్నారని చెబుతుంటారు. ఈ హత్య కేసులో మరో నిందితుడు కామేశ్వరరావును ఆ తరువాత పోలీసులు ఎన్‌కౌంటర్‌ కూడా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

 ఐదేళ్ల టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రేషన్‌ మాఫియాను పెంచి పోషించారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. నకిలీ బయో ఉత్పత్తుల్లో జీవీ కంపెనీలపై రెండు తెలుగురాష్ట్రాలు సహా, ఇతర రాష్ట్రాల్లో సైతం కేసులు నమోదయ్యాయి. అమాయకులైన గుమాస్తాలు  కేసుల్లో ఇరుక్కున్ని నేటికీ అవస్థలు పడుతున్నారు. 

దోచుకోవడంలో ఘనాపాటి.. ప్రత్తిపాటి
అడ్డోగోలుగా దోచుకోవడంలో తాజా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘనాపాటి అన్న ఆరోపణలు ఉన్నాయి. 2014–15 కాలంలో ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్‌ యార్డుల ద్వారా చిలకలూరిపేట మండలంలోని యడవల్లి భూ కుంభకోణానికి పాల్పడి భారీగా దోచుకున్నారనే ఆరోపణలున్నాయి. పత్తి కుంభకోణంలో దాదాపు రూ.450 కోట్లు వెనకేసుకున్నారనే విమర్శలు విచారణలో వెలుగుచూశాయి.

నియోజకవర్గంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, అగ్రిగోల్డ్‌ భూముల కొనుగోలు, రేషన్‌ బియ్యం అక్రమ రవాణా వంటి అనేక కార్యకలాపాలు ప్రత్తిపాటి కనుసన్నల్లో కొనసాగి రూ.వేల కోట్లు దోచుకున్నారని విమర్శలున్నాయి. చిలకలూరిపేట పట్టణానికి చెందిన విలేకరి ఎం.వి.ఎన్‌.శంకర్‌ పై 2014 నవంబర్‌ 25వ తేదీన ప్రత్తిపాటి అనుచరుడైన వెంగళరాయుడు, తెలుగుయువత పట్టణ మాజీ అధ్యక్షుడు మరో ఇద్దరు దాడి చేసి తీవ్రంగా గాయపరి చారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి శంకర్‌ మృతి చెందాడు. యడ్లపాడుకు చెందిన మానుకొండ సురేంద్రనాథ్‌ ఆత్మహత్య వెనుక ప్రత్తిపాటి హస్తం ఉందనే ఆరోపణలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement