rayapati samba sivarao
-
కన్నాను ఓడించడం గ్యారెంటీ.. నన్ను, బాబును ఎన్ని మాటలు అన్నారో!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘కన్నా లక్ష్మీనారాయణ జిల్లాలో ఎక్కడ పోటీచేసినా ఓడించడం గ్యారెంటీ. ఆయన్ని టీడీపీలోకి తీసుకోవడం చంద్రబాబుకు తప్ప ఎవరికీ ఇష్టంలేదు. కన్నాను టీడీపీలోకి తీసుకోవడం నాకే కాదు.. సీనియర్లందరూ సిగ్గేస్తుందని అంటున్నారు’ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలం పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజుకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేనలో చేరతారనే ఊహాగానాలకు తెరదించుతూ గురువారం ఆయన సైకిల్ ఎక్కనున్నారు. ఈ నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ‘నేను చాలా అసంతృప్తితో ఉన్నా. కన్నాను పార్టీలో చేర్చుకోవడం పెద్ద తెలివి తక్కువ పని. నన్ను, చంద్రబాబును కన్నా ఎన్నేసి మాటలు అన్నాడు. పందులు, కుక్కలు, నక్కలు అంటూ వ్యక్తిగతంగా, సామాజికవర్గాన్ని దుమ్మెత్తిపోశాడు. అలాంటి వ్యక్తిని దగ్గరకు తీసుకోవడం ఏమిటి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి అవసరమని చంద్రబాబు చెబుతున్నారు. అయినా ఆయన్ను చూసి ఏమిటి భయపడేది? అతనికి ఎన్ని ఓట్లు వసా్తయి. నేను గుంటూరు లోక్‌సభ స్థానానికి, ఆయన పెదకూరపాడు అసెంబ్లీకి పోటీచేసినప్పుడు నాలుగైదు వేల ఓట్లు మెజార్టీ నాకే వచ్చేవి. నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఓట్లెన్ని వచ్చాయో అందరికీ తెలిసిందే’ అంటూ ఎద్దేవాచేశారు. ఏమాత్రం మంచి పద్దతి కాదు ‘పార్టీలో ఉన్న వారిని చంద్రబాబు దెబ్బతీయడం ఏమాత్రం సరికాదు. అందరి ముడ్డి కిందకు తెస్తున్నారు. అలా చేయడం తప్పు, అన్యాయం. ఇలా చేసుకుంటూ పోతే పార్టీలో ఎవరు నిలబడతారు? ఇలాగైతే నేనిక చంద్రబాబు వద్దకు వెళ్లను. ఎందుకు వెళ్లాలి? పార్టీలో మాకు టికెట్ ఇస్తామంటే తప్ప వెళ్లి కలిసేది లేదు. పార్టీలో ఇన్నేళ్లు పనిచేశా. నాకేం చేశారు? ఏమి ఇచ్చారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. నన్ను మాట్లాడవద్దన్నారు ‘చంద్రబాబు ఫోన్ చేశారు. కన్నాను తీసుకుంటున్నాం. నీతో పర్సనల్‌గా మాట్లాడతానన్నారు. అదేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫోన్ చేసి సార్ హైదరాబాద్ వెళ్లారు. వచ్చాక మీతో మాట్లాడతారు. అప్పటివరకు కన్నా గురించి ఎవరితోనూ మాట్లాడవద్దు. స్టేట్మెంట్లు ఇవ్వవద్దు అని చెప్పారు. పార్టీలో కన్నా చేరుతున్నారని ఆఫీసు నుంచి ఎవరో ఫోన్‌చేశారు. నేను రావడంలేదన్నాను. నేను వెళ్లను కూడా’ అని రాయపాటి చెప్పారు. 12 ఏళ్లు కోర్టులో కేసు నడిపారు ‘కన్నా నాపై 2010లో పరువు నష్టం దావా వేశారు. 12 ఏళ్లు కోర్టులో కేసు నడిపారు. రెండుసార్లు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. గత ఏడాది నవంబరు రెండో తేదీ న్యాయమూర్తి ద్వారా రాజీ చేసుకున్నారు. టీడీపీలో చేరాలనుకునే రాజీ కుదుర్చుకున్నట్లు ఉంది. చంద్రబాబుపైనా అనేక కేసులు వేశారు. ఇవన్నీ అందరికీ తెలుసు. అయినా కన్నాను పార్టీలోకి తీసుకోవడమే విచిత్రం’ అని రాయపాటి ఆవేదన వ్యక్తంచేశారు. -
రాయపాటి ఆస్తుల వేలం
-
రాయపాటి మెడకు ఈడీ ఉచ్చు!
సాక్షి, అమరావతి, సాక్షి హైదరాబాద్: టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రమోటర్, చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ట్రాన్స్ట్రాయ్ 18 బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.8,836.45 కోట్ల రుణంలో రూ.3,822 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించడంపై ఈడీ శుక్రవారం కేసు నమోదు చేసింది. సంస్థ ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాసబాబ్జీలపై కూడా కేసులు నమోదు చేసింది. ఫెమా (విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం)కు విరుద్ధంగా సింగపూర్, రష్యా, ఉక్రెయిన్, మలేíసియాలకు రాయపాటి అక్రమంగా భారీగా నిధులు మళ్లించడంపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ట్రాన్స్ట్రాయ్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణం తీసుకుని ఎగ్గొట్టడంపై యూనియన్ బ్యాంకు ఫిర్యాదు మేరకు డిసెంబర్ 30న రాయపాటి తదితరులపై సీబీఐ కేసులు నమోదు చేయడం తెలిసిందే. దీనిపై సీబీఐ, ఈడీ సమాంతరంగా విచారణ చేపట్టాయి. రికార్డులు ఇవ్వకుండా ఎస్ఈపై ఒత్తిడి? పోలవరం హెడ్‌వర్క్స్ పనులను ట్రాన్స్ట్రాయ్ చేస్తున్న సమయంలో 2017 మార్చి 31 నుంచి డిసెంబర్ 31 మధ్య తాము ఆడిటింగ్ నిర్వహించగా ఎస్ఈ రికార్డులివ్వకుండా సహాయ నిరాకరణ చేశారంటూ యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ ఎస్కే భార్గవ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలకు, రాయపాటికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. రికార్డులివ్వకుండా ఎస్ఈని నాటి ప్రభుత్వమే ప్రభావితం చేసిందని సీబీఐ నిర్ధారణకొచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ నిర్ణయాన్ని తుంగలో తొక్కి ఎస్క్రో అకౌంట్ ద్వారా కాకుండా ట్రాన్స్‌ట్రాయ్‌కి నేరుగా రూ.2,267.22 కోట్ల బిల్లులు చెల్లించడం, సింహభాగాన్ని సింగపూర్, రష్యా, మలేíసియాకు మళ్లించడంలో లోగుట్టుపై పరిశోధిస్తున్నాయి. దొడ్డిదారిన బిల్లుల చెల్లింపు!: ట్రాన్స్ట్రాయ్ రుణాలను తిరిగి చెల్లించడం లేదని ఈ నేపథ్యంలో పోలవరం బిల్లులు చెల్లించే సమయంలో తమ బకాయిల వసూలుకు సహకరించాలంటూ 2015 జూలై 31న అప్పటి సీఎం చంద్రబాబును జాతీయ బ్యాంకుల కన్సార్షియం కోరింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అప్పులు ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియం ద్వారా కాక గత సర్కారు ఇతర బ్యాంకుల ద్వారా ట్రాన్స్‌ట్రాయ్‌కి దొడ్డిదారిన బిల్లులివ్వడంపై సీబీఐ దృష్టి సారించింది. ‘ఎస్క్రో’ అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నాడు టీడీపీ సర్కార్ హామీ ఇస్తేనే రూ.300 కోట్ల రుణమిచ్చామని బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. విభేదాలతో వెలుగులోకి?: కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా జరగడానికి, స్వల్పకాలంలో కీలక ఆధారాలు లభించడానికి రాయపాటి కుటుంబంతో చెరుకూరి శ్రీధర్‌కి తలెత్తిన విభేదాలే కారణమని తెలుస్తోంది. తన తండ్రికి తెలియకుండా శ్రీధర్ అక్రమాలకు పాల్పడినట్లు రాయపాటి రంగారావు ఇటీవల సీబీఐ, ఈడీ, ప్రధానికి కొన్ని ఆధారాలతో లేఖలు రాసినట్లు సమాచారం. సింగపూర్‌కు తరలిన నిధులు..? సింగపూర్‌లోని ట్రాన్స్ట్రాయ్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రూ.15.34 కోట్లను మళ్లించినట్లు వెలుగులోకి వస్తోంది. ఇందులో డైరెక్టర్లు ఎవరు? వారికి రాయపాటితో ఉన్న సంబంధాలు ఏమిటి? అనే అంశంపై సీబీఐ, ఈడీ వేర్వేరుగా విచారణ చేస్తున్నాయి. టీడీపీ ముఖ్యనేత సన్నిహితులు ఈ సంస్థల డైరెక్టర్లుగా ఉన్నట్లు ఈడీ గుర్తించింది. శ్రీజయలక్ష్మి పవర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు రూ.36.50 కోట్లను ట్రాన్స్ట్రాయ్ మళ్లించడంపైనా ఈడీ కూపీ లాగుతోంది. -
రాయపాటి ఇల్లు,ఆఫీసులో సీబీఐ తనిఖీలు
-
రాయపాటి ఇంటిపై సీబీఐ దాడులు
సాక్షి, హైదరాబాద్ : మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో మంగళవారం సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగుళూరులో రాయపాటికి చెందిన నివాసాల్లో, ఆఫీసుల్లో ఉదయం నుంచి ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీ రూ. 300కోట్ల మేర బ్యాంకు రుణాలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ట్రాన్స్ట్రాయ్ కంపెనీపై కేసు నమోదు చేసిన అధికారులు అక్కడ కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. -
రెండు వర్గాలుగా చీలిపోయిన టీడీపీ!
సాక్షి, గుంటూరు: సత్తెనపల్లిలోని టీడీపీ నాయకుల్లో వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనుచరులు ఒక వర్గంగా, రాయపాటి రంగబాబు అనుచరులు మరో వర్గంగా చీలిపోయి ఆందోళనలు చేపడుతున్నారు. రంగబాబు ఆధ్వర్యంలోని వర్గం అన్నా క్యాంటీన్ వద్ద ధర్నాకి దిగిన కాసేపటికి.. కోడెల వర్గం ఇసుకను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల మధ్య కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయన్న విషయం స్పష్టమవుతోంది. కాగా కే ట్యాక్స్ పేరిట కోడెల కుటుంబం చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శివప్రసాదరావు సహా ఆయన కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మిపై పలు కేసులు నమోదైన విషయం విదితమే. -
టీడీపీలో వేరుకుంపట్లు
సార్వత్రిక ఎన్నికల ముందు నుంచే సత్తెనపల్లి టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. అప్పట్లోనే కోడెల మాకొద్దంటూ స్థానిక నేతలు రోడ్డెక్కారు. ఇవేమీ పట్టించుకోని చంద్రబాబు కోడెలకు టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో కోడెల ఘోర పరాజయం పాలవడం.. కే ట్యాక్స్ బాధితులు పోలీసుస్టేషన్ మెట్లెక్కడంతో పార్టీ పరువు బజారున పడింది. ఇక కోడెల ఇన్చార్జిగా వద్దంటూ అసమ్మతి నేతలు అధినేత బాబును మళ్లీ కలిశారు. ఇదే సమయంలో రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబు ప్రవేశం చేయడంతో సత్తెనపల్లిలో టీడీపీ రెండు ముక్కలైంది. ఇప్పుడు కోడెల వర్సెస్ రాయపాటి వర్గాల మధ్యపోరు సాగుతోంది. సాక్షి, గుంటూరు: సార్వత్రిక ఎన్నికల అనంతరం జిల్లా టీడీపీ పరిస్థితి అయోమయంగా మారింది. ఇంటి పోరుతో ఆ పార్టీ సీనియర్, ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారు. సత్తెనపల్లి టీడీపీలో కుమ్ములాటలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. నరసరావుపేట మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలోకి రంగప్రవేశం చేశారు. ఆయన కోడెల అసమ్మతి వర్గానికి అండగా నిలిచినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రంగబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఇప్పించడం కోసం రాయపాటి సాంబశివరావు ప్రయత్నాలు చేశారన్న విషయం తెలిసిందే. కోడెల అసమ్మతి నాయకులు సైతం ఆయనవైపే అప్పట్లో మొగ్గు చూపారు. అయితే అధినేత చంద్రబాబు మాత్రం కోడెల శివప్రసాదరావుకే ఆ టికెట్ కట్టబెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో కోడెల ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ఐదేళ్లలో కోడెల కుటుంబం అక్రమాలు, అరాచకాలతో విసిగి వేసారిన సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కోడెలను నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తొలగించాలని బుధవారం రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో చంద్రబాబును కలిసి కోరారు. క్విట్ కోడెల.. సేవ్ సత్తెనపల్లి.. కార్యాలయం ఆవరణలో నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. బయట ఆందోళన జరుగుతున్న సమయంలో కోడెల సైతం కార్యాలయంలోనే ఉన్నారు. కొత్త ఇన్చార్జిని నియమించాలని కోడెల వ్యతిరేక వర్గ నాయకులు డిమాండ్ చేస్తున్న తరుణంలో రాయపాటి రంగబాబు పేరు తెరపైకి వచ్చింది. అసమ్మతి నాయకులతో భేటీ.. సత్తెనపల్లి పట్టణంలోని పాత నియోజకవర్గ టీడీపీ కార్యాలయంగలో రాయపాటి రంబాబు గురువారం కోడెల అసమ్మతి నేతలతో సమావేశం నిర్వహించారు. మరో వైపు తన మద్దతుదారులతో సొంత పార్టీ కార్యాలయంలో కోడెల సమావేశమయ్యారు. ప్రస్తుత ఈ వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. కోడెలను పార్టీ ఇన్చార్జిగా తొలగించాలని అధినేతకు ఫిర్యాదులు అందిన వెంటనే రంగబాబు రావడం.. కోడెల వ్యతిరేకవర్గ నాయకులతో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు పథకం ప్రకారం రంగబాబే కోడెల అసమ్మతి నేతల వెనకుండి ఆందోళనలు చేయించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల మద్దతుదారులు సైతం రంగబాబే ఇదంతా చేయిస్తున్నారని కోపంతో ఊగిపోతున్నట్టు తెలుస్తోంది. ఎటువెళ్లాలో తెలియని పరిస్థితి.. రాయపాటి, కోడెల ఇలా రెండు వర్గాలుగా సత్తెనపల్లి టీడీపీ చీలిపోవడంతో ఎటువెళ్లాలో తేల్చుకోలేని స్థితిలో ఆ పార్టీకి చెందిన తటస్థ శ్రేణులు ఉన్నాయి. మరో వైపు కొత్త ఇన్చార్జిని నియమించాలని చంద్రబాబును కోరినా సీరియస్‌గా తీసుకోకపోవడంపై కోడెల అసమ్మతి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బు, మద్యంతో ఓటర్లకు టీడీపీ ఎర
సాక్షి, అమరావతి : సార్వత్రికల ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. రెండు రోజుల గడువు మాత్రమే ఉండటంతో, నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో ప్రచారం చేసేందుకు రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. రాత్రివేళ కుల సంఘాలతో అత్మీయ సమావేశాలు, చోటామోటా నాయకులతో బేరసారాలు కొనసాగిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని పలు జాతీయ సర్వేలు తేల్చి చెప్పడంతో పాటు, ప్రజల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కానుండటంతో , చివరి ఆస్త్రంగా ఓటర్లలను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులకు ఎదురుగాలి జిల్లాలో గుంటూరు, నరసరావుపేట, బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఎదురీదుతున్నారు. గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా జయదేవ్‌కు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రధానంగా ఎంపీగా గెలిచినప్పటి నుంచి మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో, ఓట్లు అడిగేందుకు వెళితే పలుచోట్ల సొంత పార్టీ నేతనే నిలదీస్తున్నట్లు సమాచారం. సామాన్య ప్రజలు ఆయన్ను కలుసుకోవాలంటే ఇప్పటికి కుదరని పరిస్థితి ఉంది. ప్రభుత్వ అధికారిక సమావేశాలకు సైతం హాజరుకాకపోవడం, పార్లమెంటు పరిధిలోని సమస్యల గురించి ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల సమయంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీ నెరవేరలేదు. పదవీ కాలంలో ఆయన వ్యాపారాలు చక్కదిద్దుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. కనీసం ఎంపీ నిధుల్ని అభివృద్ధి పనులకు ఖర్చు చేయక పోవడంతో , అవి మురిగిపోయే దుస్థితి నెలకొంది. దీంతో ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు కేవలం గల్లా జయదేవ్ గల్లా పెట్టేనే నమ్ముకున్నారు. ఓటర్లకు డబ్బులు పంచి మరొసారి మాయ చేయాలని చూస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి లోకల్ కావడం కలిసొచ్చే అంశం. దీనికితోడు మాస్ లీడర్‌గా పేరున్న ఆయన తనదైన శైలిలో పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఓటర్ల మనస్సు దోచుకుంటున్నారు. గెలుపుపై ధీమాతో ప్రచారంతో దూసుకపోతున్నారు. రాయపాటికి తప్పని తిప్పలు నరసరావుపేట తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి రాయపాటి సాంబశివరావు ప్రచారంలో వెనకంజలో ఉన్నారు. వయోభారానికి తోడు, అనారోగ్యం నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన లేకపోతున్నారు. అతికష్టం మీద టీడీపీ అధినేతల సభలకు, అక్కడక్కడా నాయకులను మాత్రమే కలుస్తున్నారు. దీనికితోడు నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో స్పీకర్ వర్గం రాయపాటికి సహకరించపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీగా గెలిచినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. కనీసం నరసరావుపేటలో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేక పోయారు. దీంతో ఆయనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. టిక్కెట్టు చివరి నిమిషంలో ఖరారు కావడంతో , ప్రచారంలో బాగా వెనుకబడి ఉన్నారు. నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలును ఏడు నెలల ముందుగానే పార్టీ సమన్వయకర్తగా ప్రకటించింది. దీంతో ఆయన ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పార్లమెంటు పరిధిలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నవరత్నాలను వివరించటంతో పాటు, ప్రజలకు చేరువయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశాక, రెండో సారీ అన్ని పట్టణాలు, పల్లెల్ని చుట్టేసి, ప్రచారంలో దూసుక పోతున్నారు. యువకుడు, విద్యావేత్త, కష్టపడేతత్వం కల వ్యక్తి అని ప్రజల్లో ముద్ర వేసుకున్నారు. పల్నాడుకు ప్రత్యేకంగా మేనిఫెస్టో ప్రకటించారు. పార్లమెంటు అభివృద్ధికి ప్రత్యేక విజన్‌తో ముందుకు పోతుండటంతో, ప్రజల్లో ఆయనపై నమ్మకం ఏర్పడింది. మాల్యాద్రి టిక్కెట్టు పైనే ఊగిసలాట బాపట్ల తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి శ్రీరాం మాల్యాద్రి టిక్కెట్టు చివరి వరకు అధిష్టానం ప్రకటించ లేదు. ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, పదవీ కాలంలో నియోజకవర్గానికి చేసింది లేకపోవడంతో టిక్కెట్టు ఇచ్చే విషయంలోనే టీడీపీ అధిష్టానం అలోచన చేసింది. తాడికొండ అసెంబ్లీ అభ్యర్థిగా మార్చాలని చూసినా, సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ టిక్కెట్టుపై గట్టి పట్టు పట్టడంతో చివరకు అధిష్టానం, పెద్దల ఆశీస్సులతో టిక్కెట్టు సాధించినా నియోజకవర్గంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బాపట్ల పార్లమెంటు స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాన్యునికి పట్టం కట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్ ఇప్పటికే నియోజక వర్గ పరిధిలో విస్తృతంగా తిరిగి ప్రజలను కలుసుకున్నారు. యువకుడు, సామాన్యుడుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందలం ఎక్కించింది. దీంతో ఓటర్లు నందిగం సురేష్‌ను ప్రత్యేకంగా అక్కున చేర్చుకుంటున్నారు. ప్రచారంలో సైతం తన దైన శైలిలో దూసుకుపోతున్నారు.మొత్తం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులు ప్రచారంలో దూసుక పోతుండగా, టీడీపీ అభ్యర్థులు ఎదురీదుతున్నారు. చివరి అస్త్రంగా టీడీపీ అభ్యర్థులు ఓటర్లలను ప్రలోభ పెడుతూ, డబ్బుల పంపకాలకు తెరలేపారు. -
నాయక్ నహీ..ఓ చోర్ హై..
సాక్షి, గుంటూరు : టీడీపీ అభ్యర్థుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. నరసరావు పేట పార్లమెంట్ అభ్యర్థితోపాటు ముగ్గురు అసెంబ్లీ టిక్కెట్లు పొందినవారికీ నేర చరిత్ర ఉంది. ఎంపీ అభ్యర్థి రాయపాటిపై పొగాకు బేళ్లలో చెత్త నింపి విదేశాలకు ఎగుమతి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, చిలకలూరిపేట, పొన్నూరు, పెదకూరపాడు, బాపట్ల అభ్యర్థులు కోడెల, యరపతినేని, జీవీ, ప్రత్తిపాటి, ధూళిపాళ్ల, కొమ్మాలపాటి, అన్నం సతీష్‌పై ఆరోపణలు ఉన్నాయి. ‘ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం’ అన్న నినాదంతో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ నాయకులు ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను అడ్డగోలుగా దోచుకుం టున్నారు. ఎంతటి నేరచరిత్ర ఉన్నా, ఎన్ని అక్రమాలకు తెగబడినా రూ.కోట్లకు పడగలెత్తి, పార్టీకి సూట్‌కేసుల్లో రూ.కోట్లు ముట్టజెబితేచాలు టిక్కెట్లు ఖాయమన్న తీరులో ఆ పార్టీ రాజకీయాలు సాగుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులే ఇందుకు నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హత్య కేసులో జైలుకెళ్లిన యరపతినేని గురజాల సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు 1992లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి గుంటూరు, నల్గొండ జిల్లాల డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. అయితే డిపాజిట్ డబ్బు చెల్లించకుండా భూములు తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకున్నారు. రూ.60 లక్షలు వారికి చెల్లించకుండా ఎగనామం పెట్టారు. దీంతో వారు హైదరాబాద్ సిటీ సివిల్‌కోర్టులో దావా వేయగా రూ.1.70 కోట్లకు కోర్టు డిక్రీ ఇచ్చింది. అనంతరం 1999లో యరపతి నేని టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన భూములను జప్తు చేయకుండా తప్పించుకున్నారు. ఇప్పటికీ ఏపీఎస్ఎస్డీసీ ఆ భూములను జప్తు చేసుకోలేకపోయింది. గుంటూరులో స్నేహ చరిత చిట్‌ఫండ్ కంపెనీ స్థాపించి, కస్టమర్లకు కుచ్చు టోపీపెట్టి ఐపీ దాఖలు చేయడంతో అప్పట్లో బాధితులు నరసరావుపేట కోర్టును ఆశ్రయించారు. 2012లో పిడుగురాళ్లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉన్నం నరేంద్ర హత్యకు గురయ్యారు. ఆ కేసులో యరపతినేని మూడో నిందితుడు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన అప్పట్లో అజ్ఞాతంలోకి వెళ్లగా రూరల్ ఎస్పీ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యరపతినేని హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్‌కు సైతం పంపారు. 2014 సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక యరపతినేని అక్రమాలకు లైసెన్స్ ఇచ్చినట్లయింది. నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ తెరలేపి అడ్డగోలుగా రూ.వేల కోట్ల విలువజేసే సహజ సంపదను దోచుకున్నారు. పిడుగురాళ్ల మండలం సీతారాంపురం, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి ప్రాంతాల్లో ఎమ్మెల్యే కనుసన్నల్లో నడిచిన మైనింగ్ మాఫియా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) రిపోర్ట్ ప్రకారం 2017 జనవరి నాటికి 68.53 లక్షల టన్నుల తెల్లరాయిని అమ్ముకుంది. 2017 జనవరి నుంచి 2018 జూలై 25వ తేదీ హైకోర్టు అక్రమ మైనింగ్ నిలిపివేసే నాటి వరకూ మరో 30 లక్షల టన్నుల సున్నపు రాయిని దోచేశారని నిపుణులు లెక్కతేల్చారు. డెయిరీ ఆస్తులు కబ్జా చేసిన ధూళిపాళ్ల పొన్నూరు నుంచి టీడీపీ తరఫున బరిలో నిలుస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర రూ.వేల కోట్ల విలువ చేసే సంఘం డెయిరీ ఆస్తులను హస్తగతం చేసుకుని, ఏకంగా డెయిరీ స్థలంలో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరున ఆసుపత్రి నిర్మించారనే ఆరోపణలున్నాయి. పెదకాకాని, ఇతర ప్రాంతాల్లో పోరంబోకు భూములను కాజేసిన చరిత్ర ఆయన సొంతం. నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తూ, రాజధాని ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేపట్టి రూ.కోట్లతో జేబులు నింపుకొన్నారని, భూకబ్జాలకు సైతం పాల్పడ్డారనే విమర్శలున్నాయి ఆయన అవినీతి అక్రమాలను ప్రశ్నించినవారిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీల్లో పెట్టించి నరేంద్ర వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో నివసిస్తున్న చేబ్రోలుకు చెందిన పెమ్మసాని శ్రీధర్‌కు స్వగ్రామంలో 2014లో వాసిరెడ్డి రాజశేఖర్ నుంచి 803 గజాల స్థలం కొన్నారు. వాసిరెడ్డి రాజశేఖర్ బాబాయ్ వాసిరెడ్డి శంకర్రావు, అతని కుమారుడు వాసిరెడ్డి వంశీ ఆ స్థలంలోకి వెళ్లకుండా శ్రీధర్‌ను అడ్డుకుంటున్నారు. ఈ విషయమై శ్రీధర్ చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. ఇటీవల శ్రీధర్‌పై శంకర్రావు కుటుంబ సభ్యులు కత్తితో దాడి చేసి గాయపరిచారు. అయినా కేసు నమోదు చేసి శంకర్రావు కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోలేదు. ఇందుకు కారణం శంకర్రావు సమీప బంధువు ధూళిపాళ్ల నరేంద్ర వద్ద న్యాయవాదిగా పనిచేయడమే. ఆయనకు తన స్థలాన్ని కట్టబెట్టాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని శ్రీధర్ ఆరోపిస్తున్నారు. న్యాయం చేయమని పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా చేబ్రోలు సీఐ తనపైనే దాడికి పాల్పడ్డాని శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయమై బాధితుడు ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశాడు. రాయపాటిపై ఎన్ని ఆరోపణలో.. తాజామాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఆరోపణలు అన్నీ ఇన్నికావు. గతంలో పొగాకు రైతులకు డబ్బు ఎగ్గొ ట్టారని, పొగాకు బేళ్లలో చెత్తను కుక్కి ఇతరదేశాలకు ఎగుమతి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఇరుక్కున్న రాయపాటిని అప్పట్లో ఇందిరాగాంధీ కాపాడారనే పుకార్లు ఇప్పటికీ షికార్లు చేస్తున్నాయి. చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశారంటూ ఓ బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా కోర్టు రాయపాటికి మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌పార్టీ పూర్తిగా దెబ్బతిన్నదని గ్రహించి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న మోదుగుల వేణుగోపాలరెడ్డిని పక్కనపెట్టి రాయపాటికి నరసరావుపేట పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచిన రాయపాటి నియోజకవర్గంలోని ప్రజలకు ఎన్నడూ అందుబాటులో ఉన్న దాఖలాలు లేవు. నాగార్జున సాగర్‌కు పక్కనే ఉన్న భూములకు సైతం చుక్క నీరందక రైతులు విలవిల్లాడుతున్నా రాయపాటి అటువైపు తొంగి చూడలేదు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన రాయపాటికి రెండో సారి టీడీపీ టిక్కెట్ కేటాయించడంపై ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కోడెల హయాంలో అరాచకాలు సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు హోంమంత్రిగా ఉన్న సమయంలో దివంగత కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ హత్య జరిగింది. ఆ హత్యలో మంత్రి కోడెల హస్తం ఉందని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు. 1999 ఎన్నికల సమయంలో కోడెల ఇంటిలో బాంబులు పేలి అతని అనుచరులు నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మంత్రి పదవి కోసం తాను వెళ్తున్న దారిలో తానే బాంబులు పెట్టించుని, వాటిని దూరంగా పేల్చడం వంటివి కూడా చేశారనే విమర్శలూ ఉన్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుటుంబ సభ్యులు చెలరేగిపోయారు. భూ కబ్జాలు, కే ట్యాక్స్ పేరుతో కాంట్రాక్టర్లు నుంచి సామాన్యుడి వరకూ ప్రతి ఒక్కరి రక్తాన్ని జలగాల్లా తాగారు. మరో సారి సత్తెనపల్లి సీటు కోడెలకు ప్రకటించడంతో ఆయన గెలుపొందితే మా మనుగడ కష్టాంగా మారుతుందని ఆ పార్టీ నాయకులే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంటో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకులను బురిడీ కొట్టించిన అన్నం సతీష్ బాపట్ల టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్‌పై ప్రభుత్వ భూములు తనఖా పెట్టి లోన్లు తీసుకుని బ్యాంకులను బురిడీ కొట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం యాజిలి గ్రామంలోని ప్రభుత్వ భూములను తనఖా పెట్టి ఎస్బీఐ నుంచి సతీష్‌ప్రభాకర్ తన కంపెనీ అయిన సతీష్ మెరైన్ ఎగ్గిమ్ ప్రైవేటు లిమిటెడ్ పేరున లోను తీసుకున్నారు. యాజిలి గ్రామంలో 11.66 ఎకరాల ప్రభుత్వ భూమికి 1బీ భూ యాజమాన్య హక్కు నిర్ధారించే పత్రం తయారు చేసుకుని ఆయన బ్యాంకులను బురిడీ కొట్టించారు. హత్య కేసులో ముందస్తు బెయిల్ పొందిన జీవీ ఆంజనేయులు వినుకొండ తాజామాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు సైతం 2004లో ఓ హత్య కేసులో నిందితునిగా ఉండి అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ పొందారు. ఆ తరువాత రాజీ కుదుర్చుకుని కేసు కొట్టివేయించుకున్నారని చెబుతుంటారు. ఈ హత్య కేసులో మరో నిందితుడు కామేశ్వరరావును ఆ తరువాత పోలీసులు ఎన్కౌంటర్ కూడా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఐదేళ్ల టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రేషన్ మాఫియాను పెంచి పోషించారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. నకిలీ బయో ఉత్పత్తుల్లో జీవీ కంపెనీలపై రెండు తెలుగురాష్ట్రాలు సహా, ఇతర రాష్ట్రాల్లో సైతం కేసులు నమోదయ్యాయి. అమాయకులైన గుమాస్తాలు కేసుల్లో ఇరుక్కున్ని నేటికీ అవస్థలు పడుతున్నారు. దోచుకోవడంలో ఘనాపాటి.. ప్రత్తిపాటి అడ్డోగోలుగా దోచుకోవడంలో తాజా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘనాపాటి అన్న ఆరోపణలు ఉన్నాయి. 2014–15 కాలంలో ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ యార్డుల ద్వారా చిలకలూరిపేట మండలంలోని యడవల్లి భూ కుంభకోణానికి పాల్పడి భారీగా దోచుకున్నారనే ఆరోపణలున్నాయి. పత్తి కుంభకోణంలో దాదాపు రూ.450 కోట్లు వెనకేసుకున్నారనే విమర్శలు విచారణలో వెలుగుచూశాయి. నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా వంటి అనేక కార్యకలాపాలు ప్రత్తిపాటి కనుసన్నల్లో కొనసాగి రూ.వేల కోట్లు దోచుకున్నారని విమర్శలున్నాయి. చిలకలూరిపేట పట్టణానికి చెందిన విలేకరి ఎం.వి.ఎన్.శంకర్ పై 2014 నవంబర్ 25వ తేదీన ప్రత్తిపాటి అనుచరుడైన వెంగళరాయుడు, తెలుగుయువత పట్టణ మాజీ అధ్యక్షుడు మరో ఇద్దరు దాడి చేసి తీవ్రంగా గాయపరి చారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి శంకర్ మృతి చెందాడు. యడ్లపాడుకు చెందిన మానుకొండ సురేంద్రనాథ్ ఆత్మహత్య వెనుక ప్రత్తిపాటి హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. -
గుంటూరు టీడీపీలో కుమ్ములాటల పర్వం
-
రగిలిపోతున్న ‘రాయపాటి’
సాక్షి, అమరావతి బ్యూరో: ఎంపీ రాయపాటి సాంబశివరావుకు టీడీపీ నాయకులే టిక్కెట్ రాకుండా తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాయపాటికి బదులుగా మరో అభ్యర్థిని అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే లగడపాటి రాజగోపాల్ పేరును తెరపైకి తెచ్చినట్లు టీడీపీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ఈ పరిణామం రాయపాటి సోదరులను కలవరపరుస్తోంది. అవసరం లేదనుకుంటే ఎంతకైనా చంద్రబాబు తెగిస్తారనే వాస్తవం రాయపాటి విషయంలో మరోసారి రుజువైందని తెలుగుదేశం పార్టీ నేతలే అంటున్నారు. రాయపాటి సోదరునికి మొండిచెయ్యి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని రాయపాటి శ్రీనివాస్ భావించారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసినా టీడీపీ గెలవదని జిల్లాకు చెందిన ఓ మంత్రి అధిష్టానానికి చెప్పడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని రాయపాటి వర్గీయులు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను చేర్పించడంతోపాటు, పార్టీ తరఫున ప్రచారం చేయడంలో కీలక భూమిక పోషించిన రాయపాటి శ్రీనివాస్‌ను ఈ పరిణామం తీవ్ర మనస్తాపానికి గురి చేసినట్లు సమాచారం సాంబశివరావు పోటీ చేస్తానని ప్రకటించినా... నరసరావుపేట ఎంపీగా రాయపాటి సాంబశివరావు పోటీ చేస్తానని చెప్పారు. కానీ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను కొంత మంది టీడీపీ నాయకులు తెరపైకి తీసుకురావటం రాయపాటి వర్గంలో అసహనం పెరిగేలా చేసింది. ఎంపీగా గెలిచినప్పటికీ సాంబశివరావు నరసరావుపేటలో కనీసం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోలేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి, ఆయన కుమారుడు అడ్డుకోవటంతోనే ఈ పరిస్థితి దాపురించిందని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాయపాటి వారసునికీ చుక్కెదురు ? రాయపాటి వారసుడు రంగారావుకు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కుతుందో ? లేదో ? అనే అభద్రతభావం ఆ వర్గాన్ని వెంటాడుతోంది. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఓ దశలో పరిశీలించినా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ అడ్డుతగినట్లు పార్టీ వర్గాలే చర్చించుకొంటున్నాయి. ప్రస్తుత పరిణామాలతో రాయపాటి సోదరులు తెలుగుదేశం పార్టీ తీరుపై రగిలిపోత్నుట్లు తెలిసింది. -
సీఎంతో భేటీ అనంతరం నిర్ణయం: రాయపాటి
గుంటూరు : బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరగిందని,కేంద్ర ప్రభుత్వంపై యుద్ధంలో మూడంచెల వ్యూహాన్ని సిద్ధం చేశామని సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌కు ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా జత కలిశారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ..ఏపీకి జరిగిన అన్యాయంపై తాను రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆదివారం సమావేశం అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ ఏది చెబితే కేంద్రం అదే చేసే పరిస్థితిలో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీలకు ఎంతో విలువ ఉండేదని, కానీ బీజేపీ ప్రభుత్వంలో ఢిల్లీలో ఎంపీలను హీనంగా చూస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేస్తే కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి కూడా పడుతుందని శాపనార్ధాలు పెట్టారు. బీజేపీపై ప్రజలలో తీవ్ర ఆగ్రహం ఉందని, బీజేపితో కలసి ఉండాలా, వద్దా అనేది ఆదివారం సీఎంతో భేటీ తర్వాత తేలుతుందని వ్యాఖ్యానించారు. రాజీనామాల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఓ పక్కన చెబుతూ ఉంటే టీడీపీ ఎంపీలు మాత్రం పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ పొగరు దించుతామని, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి చంద్రబాబు నాయకత్వం వహిస్తారని, శుక్రవారం అమరావతిలో టీడీపీ సమన్వయ సమావేశం జరుగుతున్న సమయంలోనే టీడీపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్ ఈ రోజు ఉదయమే ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. -
కావాలంటే తెలంగాణ ప్రదేశ్‌గా మార్చుదాం
సమైక్యదీక్షలో ఎంపీ రాయపాటి దీక్షకు సంఘీభావంగా పలువురు మంత్రులు, ఎంపీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌గా కాకుండా తెలంగాణ ప్రదేశ్‌గా మార్చుకుందాం... కావాలంటే ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్లు మీరే పాలించండి... అంతేకాని రాష్ట్ర విభజన మాత్రం వద్దని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో ఓటింగ్ ద్వారా తెలంగాణ బిల్లును ఓడించాలని సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, సబ్బం హరి, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, సాయి ప్రతాప్‌లు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో శుక్ర, శనివారాలు సంకల్ప దీక్షకు పూనుకున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ దీక్షకు ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్‌లు గైర్హాజరు కాగా, రాయపాటి సాంబశివరావు మాత్రం సాయంత్రం నాలుగు గంటలకు దీక్షకు హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత తాను రాజీనామాలు చేసినా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం తమ మొర ఆలకించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరిదాకా పోరాడుదాం. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణప్రదేశ్గా మారుద్దాం. రాబోయే 20 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ వాళ్లే ఏలండి’’ అని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో కూడా అధిక శాతం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సమైక్యం కోరుకుంటూ ఫోన్ ద్వారా తన సందేశం అందిస్తున్నాడని రాయపాటి అతనితో కాసేపు ఫోన్లో మాట్లాడారు. అవాస్తవాల పునాదులతో తెలంగాణ ఉద్యమం... తెలంగాణ ఉద్యమం అక్కడి ప్రజలలో అవాస్తవ పునాదులతో నిర్మాణమైందని, ఆ గోడలు బద్దలు కొట్టగలిగితేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణ కోసం పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకునేందుకు సిద్ధపడేలా ప్రేరేపించారని విమర్శించారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం, బిల్లుపై చర్చ జరగాలన్నారు. సంకల్ప దీక్షకు రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, ఏరాసు ప్రతాపరెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె వెంకటరెడ్డి, పాలడుగు వెంకట్రావు, జేసీ దివాకరరెడ్డి, యలమంచిలి రవి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సమైక్య రాష్ట్ర సమితి ఛైర్మన్ కుమార్ చౌదరి, నాయకులు శ్రీనివాస్, జేఏసీ నాయకులు లంకా దినకర్, విజయ్‌కుమార్, డాక్టర్ జేఏసీ నాయకులు కడియాల రాజేంద్ర, ఎమ్మార్పీఎస్ నాయకులు పేరిపోగు వెంకటేశ్వరరావు, సుబ్బయ్య మాదిగ, రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షులు కైకాల గోపాలరావు, రోడ్లు, భవనాల శాఖ జేఏసీ నాయకులు లక్ష్మీ కౌసల్య, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు గోపాలకృష్ణ తదితరులు సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర విద్యుత్ జేఏసీ (సేవ్ జాక్) వైస్‌చైర్మన్ గణేశ్, కన్వీనర్ పి. శ్రీనివాసరావులు కూడా తమ మద్దతు తెలిపారు.