కావాలంటే తెలంగాణ ప్రదేశ్‌గా మార్చుదాం
సమైక్యదీక్షలో ఎంపీ రాయపాటి
దీక్షకు సంఘీభావంగా పలువురు మంత్రులు, ఎంపీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌గా కాకుండా తెలంగాణ ప్రదేశ్‌గా మార్చుకుందాం... కావాలంటే ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్లు మీరే పాలించండి... అంతేకాని రాష్ట్ర విభజన మాత్రం వద్దని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో ఓటింగ్ ద్వారా తెలంగాణ బిల్లును ఓడించాలని సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, సబ్బం హరి, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, సాయి ప్రతాప్‌లు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో శుక్ర, శనివారాలు సంకల్ప దీక్షకు పూనుకున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ దీక్షకు ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్‌లు గైర్హాజరు కాగా, రాయపాటి సాంబశివరావు మాత్రం సాయంత్రం నాలుగు గంటలకు దీక్షకు హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత తాను రాజీనామాలు చేసినా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం తమ మొర ఆలకించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరిదాకా పోరాడుదాం. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణప్రదేశ్‌గా మారుద్దాం. రాబోయే 20 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ వాళ్లే ఏలండి’’ అని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో కూడా అధిక శాతం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సమైక్యం కోరుకుంటూ ఫోన్ ద్వారా తన సందేశం అందిస్తున్నాడని రాయపాటి అతనితో కాసేపు ఫోన్‌లో మాట్లాడారు.
అవాస్తవాల పునాదులతో తెలంగాణ ఉద్యమం...
తెలంగాణ ఉద్యమం అక్కడి ప్రజలలో అవాస్తవ పునాదులతో నిర్మాణమైందని, ఆ గోడలు బద్దలు కొట్టగలిగితేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణ కోసం పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకునేందుకు సిద్ధపడేలా ప్రేరేపించారని విమర్శించారు.
అసెంబ్లీలో సమైక్య తీర్మానం, బిల్లుపై చర్చ జరగాలన్నారు. సంకల్ప దీక్షకు రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, ఏరాసు ప్రతాపరెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె వెంకటరెడ్డి, పాలడుగు వెంకట్రావు, జేసీ దివాకరరెడ్డి, యలమంచిలి రవి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సమైక్య రాష్ట్ర సమితి ఛైర్మన్ కుమార్ చౌదరి, నాయకులు శ్రీనివాస్, జేఏసీ నాయకులు లంకా దినకర్, విజయ్‌కుమార్, డాక్టర్ జేఏసీ నాయకులు కడియాల రాజేంద్ర, ఎమ్మార్పీఎస్ నాయకులు పేరిపోగు వెంకటేశ్వరరావు, సుబ్బయ్య మాదిగ, రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షులు కైకాల గోపాలరావు, రోడ్లు, భవనాల శాఖ జేఏసీ నాయకులు లక్ష్మీ కౌసల్య, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు గోపాలకృష్ణ తదితరులు సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర విద్యుత్ జేఏసీ (సేవ్ జాక్) వైస్‌చైర్మన్ గణేశ్, కన్వీనర్ పి. శ్రీనివాసరావులు కూడా తమ మద్దతు తెలిపారు.