telangana pradesh
-
రామక్కపేట నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
నంగునూరు: దుబ్బాక మండలం రామక్కపేటలో తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మండల అధ్యక్షుడు దేవర నర్సింలు, ప్రధాన కార్యదర్శి మానుపాటి రాజు, కోశాధికారి శీలసాగరం రవీందర్, గౌరవ సలహాదారు దేవర మల్లయ్య ఆరోపించారు. మంగళవారం నంగునూరు మండల కేంద్రంలో ప్రదేశ్ ఎరుకల సంఘం, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. దసరా పండుగనాడు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం దళితులకు న్యాయం చేసే విధంగా అధికారులకు, పోలీసులకు బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఆందోళన అనంతరం తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. వీరికి ఎంఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు లింగంపల్లి యాదగిరి, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరెపల్లి కనకయ్య, నంగునూరు మండల అధ్యక్షుడు దేవుపల్లి రాజమౌళి, జిల్లా నాయకుడు దేవులపల్లి కిష్టయ్య, బీసీ సంఘం నాయకులు కొమురయ్య, వడ్డెర సంఘం అధ్యక్షుడు యాదగిరి, మాల సంఘం అధ్యక్షుడు నర్సింలు సంఘీభావం ప్రకటించారు. నిందితులను అరెస్టు చేయాలి దుబ్బాక రూరల్: రామక్కపేటలోని తల్లీ కూతళ్లపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అఖిల భారత మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఆశలత డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె బాధితులను పరామర్శించారు. అనంతరం ఆశాలత మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 60 ఏళ్లు గడుస్తున్నా నేటికీ మహిళలపై అత్యాచారాలు జరగడం సిగ్గు చేటన్నారు. అత్యాచార ఘటనలో ఎనిమిది మంది నిందితులు పాల్గొన్నట్లు సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు ముగ్గురిని మాత్రమే అదుపులోకి తీసుకోవడం శోచనీయమన్నారు. అత్యాచార ఘటనకు కారకులైన నిందితులపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నేతలు నవీన, జమున, సీపీఎం డివిజన్ కార్యదర్శి గొడ్డుబర్ల భాస్కర్, నాయకులు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు’ రామక్కపేటలో తల్లీకూతుళ్లపై అత్యాచారం చేసిన నిందితులను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రశ్నించింది. మంగళవారం దుబ్బాకలో టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పల్లె చంద్రం, జిల్లా కార్యదర్శి జంగిటి నర్సింలు మాట్లాడుతూ దళిత, ఆదివాసీల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, హత్యలు సిగ్గుచేటన్నారు. అత్యాచార నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసి, మరో ముగ్గురిని కేసు నుంచి తప్పించే యత్నం జరుగుతోందని వారు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులందరిని అరెస్టు చేయకుంటే టీపీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నిందితులను తప్పించేందుకు కుట్ర దుబ్బాక: దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన గిరిజన మహిళలపై అత్యాచారం చేసిన నిందితులను తప్పించడానికి కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాచార సంఘటనలో నిందితులను నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో మెదక్ నియోజక వర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పెద్దగుండవెల్లి ఎంపీటీసీ సంజీవరెడ్డి, పోతారం మాజీ సర్పంచ్ సాందిరి బాలకిషన్, కాంగ్రెస్ నాయకులు కటికె బాల్‌రాజు, అనంతుల శ్రీనివాస్, సెంట్రింగ్ దుర్గయ్య, చెక్కపల్లి ప ద్మయ్య, కిష్టమ్మగారి కిష్టారెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి రామక్కపేటకు చెందిన తల్లీకూతుళ్లపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ఎరుకల ప్రజా సంఘం, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం దుబ్బాక తహశీల్దార్ కార్యాలయంలో విజ్ఞాపన పత్రం అందజేశారు. ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి కుమార్ మాట్లాడుతూ అత్యాచార నిందితులపై నిర్భయ చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఐదెకరాల వ్యవసాయ భూమి, నెలకు మూడు వేల రూపాయల పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బాధిత కుటుంబానికి రూ. 10 వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యరద్శి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎం. శ్యామల, నాయకులు వి. నాగార్జున, శేఖర్, నర్సింగారావు, వనం కనకయ్య, యాదగిరి, నిమ్మ పోశయ్య, నిమ్మ రాజు, నిమ్మ లచ్చయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నేతల అంతర్మథనం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పాటు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై జిల్లా కాంగ్రెస్ నేతలతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జరిపిన సమీక్ష వాడివేడిగా సాగింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గానికి 45 నిమిషాలకు పైగా జరిగిన ఈ సమీక్షలో సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఓటమిపై నియోజకవర్గాల వారీగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా గత ఎన్నికలలో కుదుర్చుకున్న పొత్తుల ప్రభావం, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడవడం, పార్టీకి దశాదిశ నిర్దేశించే నేతలు కరువు కావడం లాంటి అంశాలపై జిల్లా పార్టీ నేతలు తమ వాదనలు వినిపించారు. యథావిధిగానే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న జిల్లా నాయకులు భవిష్యత్తు గురించి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పిన మాటలను విని గంపెడాశతో వెనుదిరిగారు. పొత్తు పొడవలేదా? గత ఎన్నికలలో సీపీఐతో పొత్తు ప్రభావంపై ఈ సమీక్షలో చర్చ జరిగింది. సీపీఐతో కుదుర్చుకున్న పొత్తు నష్టం చేసిందనే భావనను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేసినట్టు సమాచారం. కచ్చితంగా గెలిచే స్థానాల్లో చివరి నిమిషంలో సీపీఐ అభ్యర్థులను ప్రకటించడం, మరోవైపు ఖమ్మం ఎంపీ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో నష్టం వాటిల్లిందని పలువురు నేతలు వాదించారు. ముఖ్యంగా కొత్తగూడెం వంటి బలమైన స్థానాన్ని సీపీఐకి అనివార్య పరిస్థితుల్లో ఇచ్చిన కారణంగా అక్కడ గెలవాల్సిన స్థానాన్ని కోల్పోయామని, సీపీఐతో పొత్తు లేకుంటే మెరుగైన ఫలితాలు సాధించి ఉండేవారమనే భావన సమీక్షలో వ్యక్తమయింది. ఆమె పెత్తనమేంటి? ఇక, పార్టీ గ్రూపు తగాదాలపై కూడా సమీక్షలో వాడివేడిగానే చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లా పార్టీపై ఎంపీ రేణుకాచౌదరి పెత్తనమేంటని పలువురు పార్టీ నేతలు టీపీసీసీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఆమె వైఖరి కారణంగా జిల్లాలో పార్టీ నష్టపోతోందని, ఆమెను జిల్లా పార్టీ విషయంలో పక్కన పెట్టాలని, ఆమె వల్లే జిల్లాలో పార్టీ గ్రూపులుగా విడిపోవాల్సి వస్తోందని ఫిర్యాదు చేశారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఓ అడుగు ముందుకేసి తన ఓటమికి రేణుక వ్యవహారశైలే కారణమని చెప్పినట్టు తెలిసింది. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో తెలంగాణవాదంతో టీఆర్ఎస్కు లబ్ధి చేకూరిందని, తెలంగాణ వాదం బలంగా లేని ఖమ్మం జిల్లాలో ఈ విషయంలో లాభపడాల్సిన కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గ్రూపు తగాదాలే కారణమని నేతలు అభిప్రాయపడ్డారు. డీసీసీ అధ్యక్షుడిని వెంటనే నియమించాలని, అన్ని వర్గాలను సమతుల్యంతో కలుపుకుని పోయే నేతను ఎంపిక చేయాలని వారు టీపీసీసీ దృష్టికి తీసుకువచ్చారు. తనకు ఎన్నికలలో సహకరించలేదన్న ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఫిర్యాదు మేరకు నియోజకవర్గంలోని 16 మంది నేతలను టీపీసీసీ సస్పెండ్ చేసింది. కాగా, స్థానిక నాయకత్వానికి తెలియకుండా ఢిల్లీ స్థాయిలో పార్టీలో చేరికలపైనా చర్చ జరిగినట్టు సమాచారం. స్థానిక నాయకత్వానికి తెలియకుండానే కొందరు నేతలు ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరుతున్నారని, కనీసం చేరేంతవరకు కూడా తమకు సమాచారం ఉండడం లేదని జిల్లా కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ దృష్టికి తీసుకొచ్చారు. భవిష్యత్తు మనదే... ఇక, ఎన్నికలలో ఓటమి పాలయినప్పటికీ పార్టీ సంస్థాగతంగా బలంగానే ఉందని, భవిష్యత్తు బాగుంటుందనే ఆశాభావాన్ని జిల్లా కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంపై అవసరమైతే న్యాయపోరాటానికి దిగాలని కోరారు. మరోవైపు, జిల్లాలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీనే కారణమనే వాదనను బలంగా తీసుకెళ్లేలా కృషి చేయాలని కోరారు. జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికలపై ఉన్న స్టేను వీలున్నంత త్వరగా ఎత్తివేయించి ఎన్నిక జరిపేలా కృషి చేయాలని కూడా కోరారు. కాగా, పార్టీ బలోపేతానికి గాను నియోజకవర్గాల వారీగా టీపీసీసీ నుంచి ఇన్చార్జులను నియమించనున్నామని, త్వరలోనే పొన్నాల కూడా జిల్లా పర్యటనలకు వస్తారని టీపీసీసీ వర్గాలు స్థానిక నాయకులకు తెలియజేశాయి. అయితే, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోగ్యం బాగాలేని కారణంగా ఈ నియోజకవర్గ సమావేశం వాయిదా పడగా, మిగిలిన అన్ని నియోజకవర్గాల సమీక్షలు జరిగాయి. ఈ సమీక్షలకు ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వగ్గేల మిత్రసేన, జిల్లా ఇన్చార్జి కుసుమకుమార్, జిల్లా పార్టీ కార్యాలయ ఇన్చార్జి శీలంశెట్టి వీరభద్రం, పార్టీ మండల, బ్లాక్ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు. -
తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నైజం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నైజమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విమర్శించింది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాటలు చెప్పి తీరా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్‌నే విమర్శించడం సిగ్గుచేటని పేర్కొంది. గాంధీభవన్‌లో ఆదివారం టీ-పీసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, ప్యాట రమేష్, సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు కాంగ్రెస్‌పై సంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కొన్ని ప్రధాన అంశాలివి. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాదే. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టినరోజు ఎంపీగా ఉండి కేసీఆర్ ఏం చేశారు? మత్తులో ఉన్నాడా? నిద్రపోయాడా? సచివాలయంలో ఏ మేరకు ఏ ప్రాంత ఉద్యోగులు ఉండాలనే విషయాన్ని కమల్‌నాథ్ కమిటీ పరిశీలిస్తోంది. తెలంగాణ ఖజానా నుంచి ఆంధ్రా ఉద్యోగులు, పెన్షన ర్లకు పెన్షన్లు, జీతాలు చెల్లించే అంశం పార్లమెంట్లో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? కేంద్ర కమిటీ తేల్చాల్సిన అంశాన్ని రాజకీయం చేసి మాట్లాడటమేంటి? ఆంధ్రా విద్యార్థులకు సీట్లు కేటాయించాలా? వద్దా? అనేది రాజ్యాంగం ఆధారంగా జరిగే ప్రక్రియ. ఇక్కడుండే విద్యార్థులను గుండెలో పెట్టుకొని చూసుకుంటామన్న కేసీఆర్ ఇప్పుడెందుకు రెచ్చగొడుతున్నారు? ఉద్యమకారులకు ఓటేయాలని చెబుతున్న కేసీఆర్.. తెలంగాణ వాదులపై రాళ్లు, తుపాకి దాడి చేసిన కొండా సురేఖ, మహేందర్‌రెడ్డి వంటి వారేనా ఉద్యమకారులు? -
కాంగ్రెస్ ‘అసెంబ్లీ’ తాజా జాబితా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కూడికలు, తీసివేతల అనంతరం ఎంపీ అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణలో సిట్టింగ్ ఎంపీలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వాలని భావించిన హైకమాండ్ నిర్ణయం మేరకు మళ్లీ పాత కాపుల పేర్లనే టీపీసీసీ సూచించింది. నిజామాబాద్,జహీరాబాద్ లోక్‌సభ స్థానాల కోసం వచ్చిన దరఖాస్తులను వారం రోజుల క్రితమే జిల్లా కాంగ్రెస్ కమి టీ యథాతథంగా టీపీసీసీకి పంపించింది. దీం తోపాటు అసెంబ్లీ టికెట్ల ఆశావహుల జాబితా ను సైతం అందజేసింది. వడపోత అనంతరం రెండు లోక్‌సభ స్థానాలకు మధుయాష్కీ, సురేశ్‌షెట్కార్ పేర్లను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి శనివారం రాత్రి అందజేశారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా మధుయాష్కీ పేరును టీపీసీసీతోపాటు ఏఐసీసీ సభ్యుడు వెంకట శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదించగా, జహీరాబాద్ అభ్యర్థిగా సురేశ్ షెట్కార్‌ను డీసీసీ, పీసీసీ సభ్యుడు ఎం. జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి సి ఫారసు చేశారు. కాగా, తొమ్మిది అసెంబ్లీ ని యోజకవర్గాలకు సంబంధించి ఒక్కో సెగ్మెంట్ నుంచి ఇద్దరు నుంచి ఐదుగురి పేర్లను డీసీసీ సిఫారసు చేసింది. ఈ జాబితాపైనా కసరత్తు చేసిన టీపీసీసీ తుది నిర్ణయం కోసం ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి అందజేసింది. నాలుగైదు రో జులలో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. మరోవైపు అసెంబ్లీ ఆశావహులలో టెన్షన్ మొదలైంది. ఎంపీ అభ్యర్థులలో ఆందోళన తెలంగాణ జిల్లాలకు సంబంధించి ‘సిట్టింగ్’లకు ఆయా నియోజకవర్గాలలో పరిస్థితులు అనుకూలమా? ప్రతికూలమా? అన్న అంశాల జోలి కి వెళ్లకుండా, సింగిల్ ఎజెండాతో కాంగ్రెస్ అధిష్టానం బెర్తులు ఖరారు చేసే దిశలో ఉంది. నిజామాబాద్ ఎంపీగా రెండుసార్లు గెలుపొందిన మధుయాష్కీకి ఈసారి గడ్డుపరిస్థితులు తప్పవ నే మాట వినిపిస్తోంది. 2004 ఎన్నికలలో టీ ఆర్ఎస్తో పొత్తులో భాగంగా కాంగ్రెస్ నుంచి మధుయాష్కీ పోటీచేసి గెలుపొందారు. 2009 ఎన్నికలలో తెలంగాణ అంశంలో దూకుడుగా వ్యవహరించిన ఆయనకు తెలంగాణవాదుల నుంచి మద్దతు లభించి విజయం సాధించారు. 2004లో టీడీపీ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్ అలీపై 1,37,981 ఓట్ల ఆధిక్యం సాధించారు. 2009 ఎన్నికలకు వచ్చేసరికి మహాకూటమి అభ్యర్థి (టీఆర్ఎస్) బిగాల గణేశ్గుప్తాపై 60,390 మెజార్టీ సాధించారు. 2004, 2009లో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే 2009 నాటికి టీఆర్ఎస్ అభ్యర్థి 60 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ తగింది. కవిత రంగప్రవేశంతో ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా కే సీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పోటీ చేయనున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిం చిన కవిత తెలంగాణవాదులు, ముఖ్యంగా మహిళలను అభిమానాలను చూరగొన్నా రు. కవితపై పోటీ మధుయాష్కీకి ఆషామాషీ కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ స్థానానికి వస్తే గత ఎన్నికలలో సురేశ్ షెట్కార్ టీఆర్ఎస్ అభ్యర్థి సయ్య ద్ యూసుఫ్ అలీపై కేవలం 17,407 ఓట్లతో గెలుపొందారు. సురేశ్‌కు 3,95,767 ఓట్లు వస్తే.. యూసుఫ్‌కు 3,78,360 వచ్చాయి. ఈసారి కూడ టీఆర్ఎస్ ఓ వ్యాపారవేత్తను, బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతుండగా జహీరాబాద్‌లో పోరు రసవత్తరంగా మారనుంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఖరారైనా విజయావకాశాలపైనా ఆందోళన చెందుతున్నారు. వీరిలో ఎవ్వరో? లోక్‌సభతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాల అ భ్యర్థుల జాబితాపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ పరిశీలన జరుపుతోంది. వారం రోజుల కిందట డీసీసీ ఆశావహుల జాబితాను టీపీసీసీకి అందజేయగా, శనివారం సాయంత్రం ఆ జాబితాను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు నుంచి ఐదుగురు వరకు టికెట్లు ఆశిస్తున్నారు. తొమ్మిది సెగ్మెంట్ల లో ఆశావహుల సంఖ్య మొత్తం 27కు చేరింది. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌తో పాటు ఆయన తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ డి. సంజయ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి పేర్లు రెండేసి నియోజకవర్గాలలో ఉండగా ఎవరెవరికి టికెట్లు వస్తాయనేది ‘ఢిల్లీ’ ప్రకటన తర్వాతే తేలుతుంది. ఏఐసీసీ స్క్రీనింగ్ పూర్తయిన వెంటనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబి తాలు వెలువడనున్నాయి. -
కావాలంటే తెలంగాణ ప్రదేశ్‌గా మార్చుదాం
సమైక్యదీక్షలో ఎంపీ రాయపాటి దీక్షకు సంఘీభావంగా పలువురు మంత్రులు, ఎంపీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌గా కాకుండా తెలంగాణ ప్రదేశ్‌గా మార్చుకుందాం... కావాలంటే ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్లు మీరే పాలించండి... అంతేకాని రాష్ట్ర విభజన మాత్రం వద్దని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో ఓటింగ్ ద్వారా తెలంగాణ బిల్లును ఓడించాలని సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, సబ్బం హరి, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, సాయి ప్రతాప్‌లు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో శుక్ర, శనివారాలు సంకల్ప దీక్షకు పూనుకున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ దీక్షకు ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్‌లు గైర్హాజరు కాగా, రాయపాటి సాంబశివరావు మాత్రం సాయంత్రం నాలుగు గంటలకు దీక్షకు హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత తాను రాజీనామాలు చేసినా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం తమ మొర ఆలకించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరిదాకా పోరాడుదాం. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణప్రదేశ్గా మారుద్దాం. రాబోయే 20 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ వాళ్లే ఏలండి’’ అని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో కూడా అధిక శాతం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సమైక్యం కోరుకుంటూ ఫోన్ ద్వారా తన సందేశం అందిస్తున్నాడని రాయపాటి అతనితో కాసేపు ఫోన్లో మాట్లాడారు. అవాస్తవాల పునాదులతో తెలంగాణ ఉద్యమం... తెలంగాణ ఉద్యమం అక్కడి ప్రజలలో అవాస్తవ పునాదులతో నిర్మాణమైందని, ఆ గోడలు బద్దలు కొట్టగలిగితేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణ కోసం పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకునేందుకు సిద్ధపడేలా ప్రేరేపించారని విమర్శించారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం, బిల్లుపై చర్చ జరగాలన్నారు. సంకల్ప దీక్షకు రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, ఏరాసు ప్రతాపరెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె వెంకటరెడ్డి, పాలడుగు వెంకట్రావు, జేసీ దివాకరరెడ్డి, యలమంచిలి రవి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సమైక్య రాష్ట్ర సమితి ఛైర్మన్ కుమార్ చౌదరి, నాయకులు శ్రీనివాస్, జేఏసీ నాయకులు లంకా దినకర్, విజయ్‌కుమార్, డాక్టర్ జేఏసీ నాయకులు కడియాల రాజేంద్ర, ఎమ్మార్పీఎస్ నాయకులు పేరిపోగు వెంకటేశ్వరరావు, సుబ్బయ్య మాదిగ, రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షులు కైకాల గోపాలరావు, రోడ్లు, భవనాల శాఖ జేఏసీ నాయకులు లక్ష్మీ కౌసల్య, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు గోపాలకృష్ణ తదితరులు సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర విద్యుత్ జేఏసీ (సేవ్ జాక్) వైస్‌చైర్మన్ గణేశ్, కన్వీనర్ పి. శ్రీనివాసరావులు కూడా తమ మద్దతు తెలిపారు.