తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నైజం
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నైజమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విమర్శించింది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాటలు చెప్పి తీరా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్‌నే విమర్శించడం సిగ్గుచేటని పేర్కొంది. గాంధీభవన్‌లో ఆదివారం టీ-పీసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, ప్యాట రమేష్, సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు కాంగ్రెస్‌పై సంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కొన్ని ప్రధాన అంశాలివి.
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాదే.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టినరోజు ఎంపీగా ఉండి కేసీఆర్ ఏం చేశారు? మత్తులో ఉన్నాడా? నిద్రపోయాడా?
సచివాలయంలో ఏ మేరకు ఏ ప్రాంత ఉద్యోగులు ఉండాలనే విషయాన్ని కమల్‌నాథ్ కమిటీ పరిశీలిస్తోంది.
తెలంగాణ ఖజానా నుంచి ఆంధ్రా ఉద్యోగులు, పెన్షన ర్లకు పెన్షన్లు, జీతాలు చెల్లించే అంశం పార్లమెంట్‌లో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? కేంద్ర కమిటీ తేల్చాల్సిన అంశాన్ని రాజకీయం చేసి మాట్లాడటమేంటి?
ఆంధ్రా విద్యార్థులకు సీట్లు కేటాయించాలా? వద్దా? అనేది రాజ్యాంగం ఆధారంగా జరిగే ప్రక్రియ. ఇక్కడుండే విద్యార్థులను గుండెలో పెట్టుకొని చూసుకుంటామన్న కేసీఆర్ ఇప్పుడెందుకు రెచ్చగొడుతున్నారు?
ఉద్యమకారులకు ఓటేయాలని చెబుతున్న కేసీఆర్.. తెలంగాణ వాదులపై రాళ్లు, తుపాకి దాడి చేసిన కొండా సురేఖ, మహేందర్‌రెడ్డి వంటి వారేనా ఉద్యమకారులు?