సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘కన్నా లక్ష్మీనారాయణ జిల్లాలో ఎక్కడ పోటీచేసినా ఓడించడం గ్యారెంటీ. ఆయన్ని టీడీపీలోకి తీసుకోవడం చంద్రబాబుకు తప్ప ఎవరికీ ఇష్టంలేదు. కన్నాను టీడీపీలోకి తీసుకోవడం నాకే కాదు.. సీనియర్లందరూ సిగ్గేస్తుందని అంటున్నారు’ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలం పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజుకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
టీడీపీ, జనసేనలో చేరతారనే ఊహాగానాలకు తెరదించుతూ గురువారం ఆయన సైకిల్ ఎక్కనున్నారు. ఈ నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ‘నేను చాలా అసంతృప్తితో ఉన్నా. కన్నాను పార్టీలో చేర్చుకోవడం పెద్ద తెలివి తక్కువ పని. నన్ను, చంద్రబాబును కన్నా ఎన్నేసి మాటలు అన్నాడు. పందులు, కుక్కలు, నక్కలు అంటూ వ్యక్తిగతంగా, సామాజికవర్గాన్ని దుమ్మెత్తిపోశాడు.
అలాంటి వ్యక్తిని దగ్గరకు తీసుకోవడం ఏమిటి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి అవసరమని చంద్రబాబు చెబుతున్నారు. అయినా ఆయన్ను చూసి ఏమిటి భయపడేది? అతనికి ఎన్ని ఓట్లు వసా్తయి. నేను గుంటూరు లోక్‌సభ స్థానానికి, ఆయన పెదకూరపాడు అసెంబ్లీకి పోటీచేసినప్పుడు నాలుగైదు వేల ఓట్లు మెజార్టీ నాకే వచ్చేవి. నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఓట్లెన్ని వచ్చాయో అందరికీ తెలిసిందే’ అంటూ ఎద్దేవాచేశారు.
ఏమాత్రం మంచి పద్దతి కాదు
‘పార్టీలో ఉన్న వారిని చంద్రబాబు దెబ్బతీయడం ఏమాత్రం సరికాదు. అందరి ముడ్డి కిందకు తెస్తున్నారు. అలా చేయడం తప్పు, అన్యాయం. ఇలా చేసుకుంటూ పోతే పార్టీలో ఎవరు నిలబడతారు? ఇలాగైతే నేనిక చంద్రబాబు వద్దకు వెళ్లను. ఎందుకు వెళ్లాలి? పార్టీలో మాకు టికెట్ ఇస్తామంటే తప్ప వెళ్లి కలిసేది లేదు. పార్టీలో ఇన్నేళ్లు పనిచేశా. నాకేం చేశారు? ఏమి ఇచ్చారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
నన్ను మాట్లాడవద్దన్నారు
‘చంద్రబాబు ఫోన్ చేశారు. కన్నాను తీసుకుంటున్నాం. నీతో పర్సనల్‌గా మాట్లాడతానన్నారు. అదేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫోన్ చేసి సార్ హైదరాబాద్ వెళ్లారు. వచ్చాక మీతో మాట్లాడతారు. అప్పటివరకు కన్నా గురించి ఎవరితోనూ మాట్లాడవద్దు. స్టేట్‌మెంట్లు ఇవ్వవద్దు అని చెప్పారు. పార్టీలో కన్నా చేరుతున్నారని ఆఫీసు నుంచి ఎవరో ఫోన్‌చేశారు. నేను రావడంలేదన్నాను. నేను వెళ్లను కూడా’ అని రాయపాటి చెప్పారు.
12 ఏళ్లు కోర్టులో కేసు నడిపారు
‘కన్నా నాపై 2010లో పరువు నష్టం దావా వేశారు. 12 ఏళ్లు కోర్టులో కేసు నడిపారు. రెండుసార్లు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. గత ఏడాది నవంబరు రెండో తేదీ న్యాయమూర్తి ద్వారా రాజీ చేసుకున్నారు. టీడీపీలో చేరాలనుకునే రాజీ కుదుర్చుకున్నట్లు ఉంది. చంద్రబాబుపైనా అనేక కేసులు వేశారు. ఇవన్నీ అందరికీ తెలుసు. అయినా కన్నాను పార్టీలోకి తీసుకోవడమే విచిత్రం’ అని రాయపాటి ఆవేదన వ్యక్తంచేశారు.
కన్నాను ఓడించడం గ్యారెంటీ.. నన్ను, బాబును ఎన్ని మాటలు అన్నారో!
Published Thu, Feb 23 2023 5:12 AM | Last Updated on Thu, Feb 23 2023 11:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment