సాక్షి, అమరావతి బ్యూరో: ఎంపీ రాయపాటి సాంబశివరావుకు టీడీపీ నాయకులే టిక్కెట్ రాకుండా తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాయపాటికి బదులుగా మరో అభ్యర్థిని అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే లగడపాటి రాజగోపాల్ పేరును తెరపైకి తెచ్చినట్లు టీడీపీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ఈ పరిణామం రాయపాటి సోదరులను కలవరపరుస్తోంది. అవసరం లేదనుకుంటే ఎంతకైనా చంద్రబాబు తెగిస్తారనే వాస్తవం రాయపాటి విషయంలో మరోసారి రుజువైందని తెలుగుదేశం పార్టీ నేతలే అంటున్నారు.
రాయపాటి సోదరునికి మొండిచెయ్యి
కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని రాయపాటి శ్రీనివాస్ భావించారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసినా టీడీపీ గెలవదని జిల్లాకు చెందిన ఓ మంత్రి అధిష్టానానికి చెప్పడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని రాయపాటి వర్గీయులు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను చేర్పించడంతోపాటు, పార్టీ తరఫున ప్రచారం చేయడంలో కీలక భూమిక పోషించిన రాయపాటి శ్రీనివాస్‌ను ఈ పరిణామం తీవ్ర మనస్తాపానికి గురి చేసినట్లు సమాచారం
సాంబశివరావు పోటీ చేస్తానని ప్రకటించినా...
నరసరావుపేట ఎంపీగా రాయపాటి సాంబశివరావు పోటీ చేస్తానని చెప్పారు. కానీ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను కొంత మంది టీడీపీ నాయకులు తెరపైకి తీసుకురావటం రాయపాటి వర్గంలో అసహనం పెరిగేలా చేసింది. ఎంపీగా గెలిచినప్పటికీ సాంబశివరావు నరసరావుపేటలో కనీసం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోలేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి, ఆయన కుమారుడు అడ్డుకోవటంతోనే ఈ పరిస్థితి దాపురించిందని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
రాయపాటి వారసునికీ చుక్కెదురు ?
రాయపాటి వారసుడు రంగారావుకు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కుతుందో ? లేదో ? అనే అభద్రతభావం ఆ వర్గాన్ని వెంటాడుతోంది. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఓ దశలో పరిశీలించినా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ అడ్డుతగినట్లు పార్టీ వర్గాలే చర్చించుకొంటున్నాయి. ప్రస్తుత పరిణామాలతో రాయపాటి సోదరులు తెలుగుదేశం పార్టీ తీరుపై రగిలిపోత్నుట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment