సాక్షి, సత్తెనపల్లి(గుంటూరు) : టీడీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి, పార్టీ నాయకులు, కార్యకర్తలను గౌరవించకుండా కుటుంబ సభ్యులతో దోపిడీ పాలన సాగించారనే విమర్శలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన సార్వత్రిక సమరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి, అత్యధిక మెజార్టీతో విజయం అందించగా, టీడీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజకీయ పార్టీలకు గెలుపు, ఓటములు సహజం. అయితే పల్నాడు ముఖ ద్వారమైన సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇక్కడ టీడీపీ పద్ధతి ప్రకారం ఐదేళ్లుగా పతనమవుతూ వస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కోడెల శివప్రసాదరావు స్వల్ప మెజార్టీతో విజయం సాధించి అత్యున్నతమైన స్పీకర్ పదవిని పొందగలిగారు.
ఆ పదవిలో ఆయన మంచి పనులు చేసి ఉంటే మరొకరికి నియోజకవర్గంలో అవకాశం ఉండేది కాదనేది పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం కాకుండా కుటుంబ పాలన, అవినీతి, ప్రతి పనికి వసూళ్లు చేపట్టడంతో టీడీపీని 25 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కొంత కాలంగా నైరాశ్యంలో మునిగిన పార్టీ కేడర్‌లో తిరిగి ఉత్తేజాన్ని నింపడం కోసం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 28న నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ సమావేశంలో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, స్థానిక సంస్థలలో పోటీ తదితర వాటిపై చర్చిస్తామని తెలిపారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ నాయకుల్లో ఎప్పటి నుంచో ఉన్న లుకలుకలు బహిర్గతం అయ్యాయి.
సమావేశమైన అసమ్మతి వర్గం
కోడెల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ అసమ్మతి వర్గ నాయకులు గురువారం సమావేశం అయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద ఉన్న టీడీపీ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని కోడెల నాయకత్వాన్ని వ్యతిరేకించారు. శుక్రవారం నిర్వహించే టీడీపీ విస్తృత స్థాయి సమావేశం కోడెల కార్యాలయంలో ఏర్పాటు చేయడాన్ని స్థానిక టీడీపీ నాయకులు విభేదిస్తున్నారు. కోడెల జరిపే సమావేశానికి హాజరు కావద్దంటూ నాయకులు తీర్మానించారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని పాత బస్టాండ్‌లోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దీంతో కోడెలకు నియోజకవర్గంలోని ఓటర్లతో గాని, పార్టీ నాయకులు, కార్యకర్తలతో గాని సరైన సత్సంబంధాలు లేవనేది తేటతెల్లమైంది. బలం, బలగం ఉన్నా వాటిని నడిపించే సరైన నాయకుడు లేరని, ఇది టీడీపీకి ప్రధాన లోపంగా భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, గత ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలు పడిన ఇబ్బందులుఅన్నింటిని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించి నియోజకవర్గ బాధ్యతలను పార్టీకోసం శ్రమించేవారికి అప్పగించేలాచూడాలని కోరనున్నారు. టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు ఏర్పాటు చేసినసమావేశంతో టీడీపీలోని లుకలుకలపై నియోజకవర్గం అంతటా చర్చ నడుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment