ప్రజా భాగస్వామ్యంతోనే అభివృద్ధి
గవర్నర్ నరసింహన్ వ్యాఖ్య
ముగిసిన నరసరావుపేట పురపాలక శతాబ్ది ఉత్సవాలు
నరసరావుపేట వెస్ట్: ప్రభుత్వ పథకాల్లో ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడే అవి విజయవంతం అవుతాయని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చెప్పారు. ఆదివారం శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన నరసరావుపేట పురపాలక శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రభుత్వం కేవలం పథకాలను మాత్రమే రూపొందిస్తుందని, అవి సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులతోపాటు ప్రజలపై ఉందన్నారు. స్వచ్ఛభారత్‌ను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు వారిని బడికి పంపాలన్నారు.
మరుగుదొడ్లు లేక పిల్లలు బడి మానేసే పరిస్థితులను చూస్తున్నామన్నా రు.ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు ఏడాదిలోగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని ఆయన ఆదేశించారు. ఆరోగ్యం, విద్య, పర్యావరణం బాగుండాలని తెలిపారు. ఈ ప్రాంతానికి రాజధాని దగ్గరలోనే ఉందని, దాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందజేయాలన్నారు.
నా పేరులోనే సగం నరసరావుపేట ఉంది..!
తన పేరు నరసింహన్ అని, ఆ పేరులోనే సగం నరసరావుపేట ఉందని గవర్నర్ ఛలోక్తి విసిరారు. ఈ సంద ర్భంగా ఆయన రూ.41 కోట్ల రుణాల చెక్కును స్వయం సహాయ గ్రూపులకు అందజేశారు. గవర్నర్‌ను స్పీకర్ కోడెల, ఎంపీ రాయపాటి సాంబశివరావు, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఘనంగా సత్కరించారు.