శ్మశానం అంటే దేవాలయంతో సమానం
శతాబ్ది ఉత్సవాల ధ్యేయం.. సంక్షేమం
♦ ‘శత’ పండుగ కంటే ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళతాం
♦ ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్
♦ శుక్రవారం నుంచి నరసరావుపేట శత వసంతోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: పల్నాడు రాజకీయాల్లో తనదైన ప్రాభవాన్ని చాటుతున్న గుంటూరు జిల్లాలోని నరసరావుపేట శత వసంత వేడుకలకు ముస్తాబైంది. నరసరావుపేట మున్సిపాలిటీగా ఆవిర్భవించి వందేళ్లయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనుంది. ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఈ సందర్భంగా బుధవారం నరసరావుపేటలో మీడియాతో ముచ్చటించారు. పల్నాడు వాసులు శత వసంతాల పండుగ కంటే ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లనున్నట్లు చెప్పారు. మూడు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళతామని, అభివృద్ధి, సంక్షేమం, ప్రజల ఆలోచనల్లో మార్పే ఈ ఉత్సవాల ధ్యేయమన్నారు.
ఉత్సవాల్లో 310 కోట్లతో కార్యక్రమాలు
శతాబ్ది ఉత్సవాలు ప్రజలందరి ఉమ్మడి పండుగని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా రూ. 310 కోట్లతో 36 అభివృద్ధి పనులకు 3రోజుల పాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్టు వివరించారు. తొలి రోజు సీఎం చంద్రబాబు, రెండో రోజు కేంద్ర మంత్రులు, మూడో రోజు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ వేడుకలకు హాజరవుతునట్ట తెలిపారు. తాను సమాజానికి బాకీ ఉన్నానని, మరీ ముఖ్యంగా నరసరావుపేటకు ఇంకా ఎంతో బాకీ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. నాగార్జున సాగర్ ఆయుకట్టు కింద ఉన్నామని సంతోషం ఉన్నా.. రాబోయే రోజు ల్లో గడ్డు పరిస్థితులు వస్తాయన్నారు. జేఎన్‌టీయూ కచ్చితంగా నరసరావుపేటకే వస్తుం దన్న నమ్మకం ఉందని, ఇందుకు గాను 70 ఎకరాల భూమి అప్పగించామని వివరించారు.
శ్మశానం అంటే దేవాలయంతో సమానం
శ్మశానం అంటే దేవాలయంతో సమానం. ‘నరసరావుపేటలో 5 శ్మశానవాటికలను పెద్ద ఎత్తున ఆధునికీకరిస్తున్నాం. హిందూ, క్రైస్తవ, ముస్లింలకు ఈ శ్మశానవాటికలు అందుబాటులోకి తెచ్చి వారి వారి మతాచారాల ప్రకారం తీర్చిదిద్దుతున్నాం. రూ. 4.5 కోట్ల ఖర్చుతో ఇవి చేపట్టాం’ అని కోడెల పేర్కొన్నారు.