
సుస్థిర పాలన వాజ్‌పేయి ఘనత
92వ జన్మదినం కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి, అమరావతి: దేశంలో అనేక మార్పులకు ఆద్యుడు మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కొనియాడారు. వాజ్‌పేయి జన్మదినం రోజు డిసెంబర్ 25ను కేంద్రం సుపరిపాలనదినంగా ప్రకటించిన నేథ్యంలో ఆదివారం విజయవాడలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పేదలకు దుప్పట్లు పంచిపెట్టారు. అనంతరం ఏలూరు రోడ్డులో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశాన్ని నెహ్రూ కుటుంబం తప్ప మరెవరూ ఐదేళ్ల పాటు సుస్థిరంగా పరిపాలించలేరని ఒక రకమైన వాదన ఉన్న రోజులలో 23 రాజకీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వంతో సుస్థిర పాలన అందించిన ఘనత వాజ్‌పేయిదేనని చెప్పారు. పీవీ నరసింహారావు ప్రధానిగా అర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టినప్పటికీ, వాటిని అమలులోకి తీసుకొచ్చింది మాత్రమే వాజ్‌పేయేనన్నారు.రేపు పోలవరంపై మంచివార్త వింటారు: రాష్ట్ర ప్రజలు పోలవరం ప్రాజెక్టు విషయంలో రేపు మంచివార్త వింటారని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ వేదిక నుంచి ఆ వివరాలు చెప్పడం మంచిది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తున్నాయని తెలిపారు.