♦ కేంద్ర మంత్రి వెంకయ్యను కోరిన ఢిల్లీ సర్కార్
♦ ప్రైవేటుకు కేటాయించిన భూముల్ని రద్దు చేయాలి
♦ ప్రజలకు మెరుగైన వైద్యం అందడంలేదని ఆవేదన
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో ఆస్పత్రుల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడును ఢిల్లీ సర్కార్ కోరింది. గత 40 ఏళ్ల కాలంలో ఆస్పత్రులు నిర్మించడం కోసం వివిధ ప్రైవేటు కంపెనీలకు 18 ప్రాంతాల్లో కేటాయించిన స్థలాలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఢిల్లీ వైద్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇటీవల వెంకయ్యనాయుడుకు రెండు లేఖలు రాశారు.
ఢిల్లీ ప్రభుత్వమే ఆస్పత్రులు నిర్మించాలని యోచిస్తోందని లేఖలో వివరించారు. అందుకోసం స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ‘ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ)కి రెండు లేఖలు వచ్చిన మాట వాస్తవమే. విలువైన భూముల్ని ఆసక్తి లేని వ్యక్తులకు కట్టబెట్టారని లేఖలో వివరించారు. భూములు దక్కించుకున్న వారు వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నగర ప్రజలకు మెరుగైన వైద్యం అందడంలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు’ అని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.
‘ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ గత 40 ఏళ్ల కాలంలో ఆస్పత్రులు నిర్మించడానికి పలు ప్రైవేటు కంపెనీలకు 18 ప్లాట్లు కేటాయింది. ఆస్పత్రుల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్దేశించింది. అయినా ఇప్పటికీ నిర్మాణాలు పూర్తి చేయలేదు. నిర్దేశిత సమయంలో కట్టడాలు పూర్తి చేయకపోతే లీజు రద్దు చేస్తామని డీడీఏ హెచ్చరించిది’ అని ఒక అధికారి తెలిపారు.
ఆస్పత్రుల కోసం స్థలమివ్వండి
Published Thu, Apr 2 2015 11:19 PM | Last Updated on Sun, Sep 2 2018 3:26 PM
Advertisement