
జేపీ నిర్ణయం అభినందనీయం: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీః ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ నిర్ణయించడాన్ని వ్యక్తిగతంగా అభినందిస్తున్నట్టు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ ప్రారంభ సందర్భంలో ఇష్టాగోష్టిగా చర్చించినప్పుడు కొత్త పార్టీ స్థాపించి దానిని విజయపథంలోకి తీసుకెళ్లడం అంత సులభం కాదనీ, ఎన్నికల రాజకీయాలకు అతీతంగా ముందుకెళితే మరింత ప్రభావం ఉంటుందని తాను సూచించినట్టు వివరించారు.
రాజకీయం ద్వారానే మార్పు వస్తుందని ఆనాడు భావించారని, ఇప్పుడు ఆ అభిప్రాయం వేరుగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా చైతన్యం కలిగించి సంబంధిత వ్యవస్థలపై మార్పు కోసం ఒత్తిడి తేవడం ఆహ్వానించదగిన పరిణామమని, జేపీ నిర్ణయం ప్రజాస్వామ్య పటిష్టతకు ఉపయోగపడగలదని భావిస్తున్నానని చెప్పారు.