ప్రజాసమస్యలపై ‘పీపుల్స్‌ పార్లమెంట్‌’ | 'People's Parliament' on Public issue | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యలపై ‘పీపుల్స్‌ పార్లమెంట్‌’

Published Thu, Jul 6 2017 3:50 AM | Last Updated on Sat, Mar 9 2019 4:13 PM

ప్రజాసమస్యలపై ‘పీపుల్స్‌ పార్లమెంట్‌’ - Sakshi

ప్రజాసమస్యలపై ‘పీపుల్స్‌ పార్లమెంట్‌’

సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో కడపలో సదస్సు
- ప్రజాసమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లటానికే...
పీపుల్స్‌ పార్లమెంట్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం
పాల్గొననున్న జాతీయ నేతలు
 
సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో చట్టసభలు కేవలం తిట్టుకోవటానికి, అవాకులు చవాకులు పేల్చుకోవటానికి తప్ప, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎక్కడా కూడా తావు ఇవ్వటం లేదని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ వాపోయారు. ఈ నేపథ్యంలో పీపుల్స్‌ పార్లమెంట్‌ పేరిట జాతీయ సదస్సు నిర్వహించటం గొప్ప విషయమన్నారు. బుధవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పీపుల్‌ అగనెస్ట్‌ కరప్షన్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా డారు. కడపలో సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో జరిగే ఈ పీపుల్స్‌ పార్లమెంటులో వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు, పౌర సేవా హక్కు చట్టం వంటి అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు.

అందరూ ఇందులో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సాక్షి ఈడీ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ పార్లమెంట్, శాసనసభల్లో రచ్చ తప్ప, ప్రజా సమస్యలపై, విధాన పరమైన అంశాలపై చర్చేలే లేవన్నారు. ఎత్తులు వేసి సభలు జరగకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. 1998 నుంచి రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని, అప్పటి నుంచి వ్యవసాయదారుని స్థితిగతులపై ప్రత్యేక సమావేశాలు జరగాలని తాము కోరుతూ వస్తున్నామని చెప్పారు. చట్టసభల్లో జరగాల్సిన చర్చలు జరగకపోవటం సిగ్గు చేటని పేర్కొన్నారు. కొంతమంది చదువుకున్న యువకులు ముందుకు వచ్చి మోడల్‌ పార్లమెంట్‌ అంటూ చర్చలు, సదస్సులు ఏర్పాటు చేయటం సంతోషకరమని అన్నారు. రైతుల ఆత్మహత్యలపై ఎన్నో పరిష్కార మార్గాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నామన్నారు. ఏ ప్రభుత్వమూ, పాలకులు సరైన రీతిలో స్పందించటం లేదని తెలిపారు. ఈ తరుణంలో రైతుల గురించి, వ్యవసాయ రంగ సమస్యల గురించి చర్చకు తీసుకురావటం ఆశాజనకంగా ఉందని చెప్పారు.
 
ప్రజల హక్కుల అణచివేత 
ఏపీ సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ పి. విజయబాబు మాట్లాడుతూ ప్రజల హక్కులను కాపాడాల్సిన పాలకులు వాటిని తుంగలో తొక్కి భవిష్యత్తు తరాలతో ఆడుకుంటున్నారన్నారు. క్లిష్ట సమయంలో జనరంజక అంశాలపై జరిగే ఈ సదస్సుకు అన్ని రకాల మీడియా సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల్లో యువత చురుగ్గా పాల్గొనటం చూస్తుంటే మార్పు మరెంతో దూరంలో లేదని అర్థం అవుతోందని చెప్పారు. ఉన్నత విద్యావంతులైన యువజన బృందం సమాజంలో మార్పు కోసం నిర్వహించే ఈ సదస్సులో భాగస్వాములు అయ్యేందుకు యువతీ, యువకులు వెబ్‌సైట్‌లో తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు.

సంస్థ వ్యవస్థాపకులు మారంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ సదస్సుకు జాతీయ స్థాయిలో ప్రముఖులు, మేధావులు, పార్లమెంట్‌ సభ్యులు, మాజీ పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేలు– ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు– మాజీ ఎమ్మెల్సీలు హాజరవుతాయని చెప్పారు. సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు – యువజనులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను సాక్షి ఈడీ రామచంద్రమూర్తి ఆవిష్కరించారు. కార్యక్రమ పోస్టర్‌ను పి.విజయబాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీపుల్స్‌ పార్లమెంట్‌ ముఖ్య నేతలు మనోజ్‌ చిట్టిమల్ల, గురు మల్లి, సంతోష్, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement