‘మేలుకొలుపు’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, జేపీ, ఎంవీఆర్ శాస్త్రి, అజయ్ కల్లం
సాక్షి, హైదరాబాద్: వ్యవస్థలో మార్పు రావాలని లోక్‌సత్తా అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎన్.జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వ మాజీ ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లం రాసిన ‘మేలుకొలుపు’ పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. కులం, మతం, ప్రాంతం సమాజాన్ని నిట్ట నిలువునా చీలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ చాలాచోట్ల చట్టబద్ధ పాలన సాగడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేకుండా ఏ పనీ జరిగే అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటే అన్నింటికీ పరిష్కారమార్గమని చెప్పారు. చిత్తశుద్ధి, నిజాయితీకి మారుపేరైన అజయ్ కల్లం ప్రజలను మేలుకొలుపే విధంగా పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు.
జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ అవినీతిపై సమరానికి మేలుకొలుపు ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో అవినీతి పెరిగిపోయిందన్నా రు. సమస్యలపట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అజయ్ కల్లం మాట్లాడుతూ పాలనావ్యవస్థ నిలువెల్లా కుళ్లిపోయిం దని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ, రాజకీయ విలువలు హరించుకుపోతుం డటంతో చట్టసభలు, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ వంటి కీలక పాలనాయంత్రాంగాలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ సచివాలయాలు అవసరమన్నారు. సమాజంపట్ల బాధ్యతను గుర్తు చేసేందుకు జిల్లాలవారీగా ‘మన కోసం మనం’అనే అంశంపై చర్చావేదికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. అనంతపురం నుంచి చర్చావేదికలకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. మాజీ సంపాదకుడు ఎంవీఆర్ శాస్త్రి మాట్లాడుతూ సమాజ హితం కోసం పుస్తకాలు రావాలని ఆకాంక్షించారు. సమాజంలో మార్పు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment