రాష్ట్రంలో సంస్కార హీనమైన రాజకీయం
జేపీ తూర్పారపట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంస్కార హీనమైన రాజకీయం, పరిపాలన మనం చూస్తున్నామంటూ లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ చేసిన వ్యాఖ్యల వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పేస్‌బుక్ వీడియో పోస్ట్‌కు వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలో జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌లో వదిలివేసిన సంఘటనపై జేపీ చేసిన కొన్ని వ్యాఖ్యల వీడియో అది. ‘రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన మాత్రమే కాదు.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న గూండాగిరి పరిపాలన మాత్రమే కాదు... ఒక సంస్కార హీనమైన పరిపాలనకు నిదర్శనం ఇది.
గతంలో తమిళనాడులో ఇలాంటివి వింటుండేవాడ్ని. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని తప్పులున్నా ఇలాంటి దుర్మార్గం లేదు. మన భావప్రకటన స్వేచ్ఛకు అడ్డుపడే పరిస్థితి లేదు’ అని జేపీ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. సమాజంలో అత్యధికులు అమాయకులు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పినా ఖామోస్ అనుకుంటారు కాబట్టి తమ మాట చెల్లుతుంది... తమకు పెద్ద బాకాలున్నాయని పాలకులు గడుసుగా మాట్లాడుతున్నారన్నారు.