
సాక్షి, హైదరాబాద్: తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌పై తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా హైకోర్టును ఆశ్రయించారు. బోడే ప్రసాద్‌పై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అతనిపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజయవాడ పోలీస్ కమిషనర్, పెనమలూరు ఎస్‌హెచ్‌ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
అధికార పార్టీ నేతలు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా గత నెల 9న బోడే ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి, తనను ఇష్టమొచ్చినట్లు దూషిస్తూ మాట్లాడారని తెలిపారు. మహిళ అన్న కనీస మర్యాద, గౌరవం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడారన్నారు. ఈ నేపథ్యంలో తాను గత నెల 14న పెనమలూరు పోలీసులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌పై ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు ఆ ఫిర్యాదును తీసుకోలేదని ఆమె వివరించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment