ఇది కోర్టు ధిక్కారమే!
♦ ఐదేళ్ల శాసన సభ్యత్వాన్ని అసెంబ్లీ హరించజాలదు
♦ రోజాను సభలోకి రానివ్వకుండా అడ్డుకోవడమంటే కోర్టు ఉల్లంఘనే
♦ కోర్టుల ప్రమేయం లేదనుకుంటే డివిజన్ బెంచ్‌కు ఎందుకు వెళ్లారు?
♦ రోజా ఘటనపై సూటిగా ప్రశ్నించిన న్యాయవాదులు
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను శాసనసభలోకి అనుమతించకుండా అడ్డుకోవడంపై న్యాయవర్గాలు మండిపడుతున్నాయి. ఇది పూర్తిగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పలువురు ప్రముఖ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. - సాక్షి, హైదరాబాద్
ఐదేళ్ల శాసన సభ్యత్వాన్ని అసెంబ్లీ హరించలేదు
ప్రజల ద్వారా ఎన్నికైన శాసనసభ్యుల హక్కులను అసెంబ్లీ హరించజాలదు. 1964లో యూపీలో ఎమ్మెల్యే కేశవ్‌సింగ్ కు స్పీకర్ 7 రోజుల జైలు శిక్ష విధించారు. దాన్ని సవాల్ చేస్తూ సభ్యుడు లక్నో బెంచ్‌ను ఆశ్రయించారు. దీంతో లక్నో కోర్టు జైలుశిక్ష నిలిపివేసింది. ఈ కేసులో వాదిస్తున్న న్యాయవాది, జడ్జీలు సభాహక్కులు ఉల్లంఘించారంటూ స్పీకర్ చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత దీనిపై ఫుల్‌బెంచ్ విచారణ చేసి ఇది చెల్లదని చెప్పింది. అప్పట్లో ఈ అంశం రాష్ట్రపతి న్యాయ సలహాకు పంపారు. రాష్ట్రపతి న్యాయసలహా మీదట.. సుప్రీం కోర్టులో జడ్జిలు ఈ అంశాన్ని వివరించి రాజ్యాంగంలోని 212అధికరణాన్ని పూర్తిస్థాయిలో నిర్వచించారు. అసెంబ్లీ ప్రొసీజరల్ అంశాల్లో జోక్యం చేసుకోకూడదని అప్పటి తీర్పు స్పష్టం చేసింది. కానీ చట్ట విరుద్ధంగా వ్యవహరించినప్పుడు వాటిని సమీక్షించే బాధ్యత కోర్టులకుంటుంది. ఇందులో భాగంగా అప్పటి యూపీ స్పీకర్ ఇచ్చిన శిక్షను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. యూపీ హైకోర్టు ఆదేశాలను సమర్థించింది. రోజా కేసులో ప్రభుత్వం చేసుకున్న అప్పీల్‌ను కోర్టులు కొట్టివేస్తాయని నా భావన. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు మధ్యంత ఉత్తర్వులను సమర్థిస్తుంది. ప్రజాప్రతినిధులను ఇష్టారాజ్యంగా సస్పెండ్ చేయొద్దని గతంలో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బిజినెస్ రూల్సు కింద స్పీకర్‌కు ఉన్న అధికారాలు పరిమితం.
- ఎస్.రామచంద్రరావు, మాజీ అడ్వకేట్ జనరల్
హైకోర్టు తీర్పును ఉల్లంఘించడమే
ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీలోకి రానివ్వకపోవడం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధిక్కరించడమే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకమునుపే ఈ కేసుపై సుప్రీంకోర్టు రివ్యూ చేసింది. అసలు ఈ దేశంలో ఏం జరుగుతోందని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వీకరించకుండా, ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించకపోవడం న్యాయాన్ని గౌరవించే ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనికాదు. భవిష్యత్తు తరాల వారు నేర్చుకునే విధంగా ప్రవర్తించాలి గానీ ఇలా కాదు. ప్రభుత్వం తరఫున న్యాయవాదే కోర్టుకు అన్ని అధికారాలు ఉన్నాయని చెప్పి, ఇప్పుడు అసెంబ్లీ విషయాల్లో కోర్టు జోక్యం వద్దని చెబుతున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించే హక్కు ఎవరికీ లేదు. అధికార పార్టీకి అనుకూలంగా తీర్పు వస్తే స్వీకరించడం, వ్యతిరేకంగా వస్తే ధిక్కరించడమా? శాసనసభ చేసిన చట్టాలను న్యాయవ్యవస్థ సమీక్షించిన దాఖలాలు గతంలో చాలా ఉన్నాయి. - రవిచంద్ర, సీనియర్ న్యాయవాది
ఆ ఉత్తర్వులను అమలు చేసి తీరాల్సిందే
రోజా విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను శాసనసభ అమలు చేసి తీరాల్సిందే. న్యాయమూర్తి వివరంగా ఆర్డర్ రాసినప్పుడు.. శాసనసభ గొప్పది, అందులో జోక్యానికి న్యాయస్థానానికి హక్కు లేదన్నట్టు వ్యవహరించడం సరికాదు. ఒక వ్యక్తి శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగుపెట్టినప్పుడు ఐదేళ్లు సస్పెండ్ చేస్తే, కోర్టునే ఆశ్రయిస్తాడు. కోర్టులే న్యాయం చేయగలవు. కోర్టులకు ఆ హక్కుంది. రాజ్యాంగానికి, మౌలిక సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదు. న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులు తమకు వర్తించవు అన్నప్పుడు ఎందుకు అప్పీలుకు వెళ్లారు? కోర్టులకు అధికారం ఉందనే కదా మీరు డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. న్యాయపరంగా చూస్తే ఆమెను సభలోకి అనుమతించాలి ఆ తర్వాత కావాలంటే అప్పీలుకు వెళ్లచ్చు. మీకే సర్వాధికారాలు ఉన్నాయనుకున్నప్పుడు కోర్టు ఉత్తర్వులను సస్పెండ్ చేయండి. ఏది ఏమైనా కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తే జైలు శిక్షకు గురవుతారు. ఇదంతా చేయించిన వారు బయటకు కనిపించరు కాబట్టి చివరకు అసెంబ్లీ కార్యదర్శులు, మార్షల్స్ మాత్రమే జైలు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది.
- జంధ్యాల రవిశంకర్, న్యాయవాది