ఫిరాయింపులపై హైకోర్టుకు వెళ్లండి
- వైఎస్సార్‌సీపీకి సుప్రీంకోర్టు సూచన
- హైకోర్టు త్వరగా పరిష్కరిస్తుందని ఆశాభావం
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టుకు వెళ్లాలని వైఎస్సార్‌సీపీకి సుప్రీంకోర్టు సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లో శాసన సభ్యుల ఫిరాయింపులపై ఫిర్యాదు చేసినప్పటికీ శాసనసభాపతి పట్టించుకోవడం లేదని, వాటిని తక్షణం పరిష్కరించేలా సభాపతిని ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ తరఫున ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మే 13న దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.
జస్టిస్ అనిల్ ఆర్.దవే, జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం వద్ద వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్ న్యాయవాది సోలిసొరాబ్జీ, శంకర్‌నారాయణన్ వాదనలు వినిపించారు. స్పీకర్ వద్ద ఉన్న తమ పిటీషన్లు పరిష్కారానికి నోచుకునేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ అనిల్ దవే స్పందిస్తూ ‘మీరు హైకోర్టుకు వెళ్లొచ్చు కదా? ’ అని ప్రశ్నించారు. దీనికి సోలిసొరాబ్జీ వాదనలు వినిపిస్తూ ‘విషయం అంతా మీకు తెలిసిందే. త్వరగా నిర్ణయం తీసుకోమని మీరు ఆదేశాలు ఇవ్వండి. రెండు మూడు నెలల్లో నిర్ణయం తీసుకుని ఉంటే బావుండేది. కానీ చాలా జాప్యం జరిగింది..’ అని పేర్కొన్నారు. దీంతో జస్టిస్ లావు నాగేశ్వరరావు జోక్యం చేసుకుని ‘శంకర్‌నారాయణన్.. మీ పిటిషన్లు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయా? పరిష్కారమైనట్లు నేను పత్రికల్లో చదివాను..’ అని పేర్కొన్నారు. దీనికి న్యాయవాది స్పందిస్తూ ‘ఎమ్మెల్యేల ఫిరాయింపులపై దాఖలైన ఫిర్యాదులు ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి..’ అని వివరించారు.
ఈనేపథ్యంలో పిటిషనర్లను హైకోర్టుకు వెళ్లాలని ధర్మాసనం సూచించింది. ఇప్పటికే ఆలస్యమైందని, మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని సోలిసొరాబ్జీ ధర్మాసనం దృష్టికి తీసుకురాగా జస్టిస్ అనిల్ ఆర్. దవే స్పందిస్తూ ‘మాకంటే హైకోర్టుకు తక్కువ భారం ఉంది..’ అని పేర్కొన్నారు. దీంతో హైకోర్టుకు వెళతామని, ఇక్కడ పిటిషన్ ఉపసంహరించుకునే స్వేచ్ఛనివ్వాలని కోరగా అందుకు ధర్మాసనం సమ్మతించింది. ‘పిటిషనర్లకు పిటిషన్ ఉపసంహరించుకునే స్వేచ్ఛనిస్తూ హైకోర్టుకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నాం. హైకోర్టు ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తుందని మాకు నమ్మకం ఉంది..’ అని ఉత్తర్వులు జారీ చేశారు.