నాకు చాలా సంతోషంగా ఉంది: ఎమ్మెల్యే రోజా
ఢిల్లీ : శాసనసభనుంచి ఏడాది పాటు తనను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టాలని ఉన్నత ధర్మాసనం మంగళవారం హైకోర్టు చీఫ్ జస్టిస్కు ఆదేశాలు ఇవ్వడంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు.
మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తన పిటిషన్ పై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. హైకోర్టులో కచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై అన్యాయంగా సస్పెన్షన్ వేటు వేశారని, ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతున్నాననే తనపై కక్ష సాధిస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు.
అలాగే ప్రస్తుతం జరుగుతున్న శాసనసబ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలనే దానిపైనా రేపు హైకోర్టులో నిర్ణయం వస్తుందని అన్నారు. నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తెచ్చేందుకు ప్రజలను తనను ఎన్నుకున్నారని, వారికి న్యాయం చేయాలంటే శాసనసభకు హాజరై వారి సమస్యలను వినిపించాల్సి ఉందన్నారు. న్యాయ వ్యవస్థను నమ్ముకుని వచ్చిన తనకు న్యాయం జరిగిందన్నారు. ఏపీలో రాక్షస పాలన నడుస్తోందని ఆమె ధ్వజమెత్తారు.