ఏడాది చివరిలోగా విచారణ ముగించండి
ఎమ్మెల్యే రోజా ఎన్నిక కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ : ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఎన్నిక చెల్లదంటూ వై.వి.రాయుడు అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఏడాది చివరికల్లా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఏపీ హైకోర్టుకు స్పష్టం చేసింది. అంతేకాక రెండు వారా ల్లో లిఖితపూర్వక వివరణ ఇచ్చే అవకాశం రోజాకు కల్పించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
2014 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి రోజా ఎన్నికను సవాలు చేస్తూ ఆమె ప్రత్యర్థి వై.వి.రాయుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణకు వచ్చినప్పుడు రాతపూర్వక వివరణ ఇచ్చేందుకు హైకోర్టు అవకాశం ఇవ్వలేదని, ఎన్నికల పిటిషన్‌కు విచారణ అర్హత లేదని రోజా హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు.హైకోర్టు ఆ పిటిషన్‌నూ రాయుడు ప్రధాన పిటిషన్‌తో కలిపి విచారిస్తామంది. దీనిపై రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.