వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు
♦ అందుకే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయలేదు
♦ విచారణను 9కి వాయిదా వేయడం వల్ల పిటిషనర్‌కు నష్టం
♦ హైకోర్టులో రోజా తరఫు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి వ్యూ హాత్మకంగా వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. అందులో భాగంగానే కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోకుండా మరింత గడు వు కోరారని తెలిపారు. దీంతో సింగిల్ జడ్జి తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారని వివరించారు. ఈ నెల 5 నుంచి అసెం బ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, 9వ తేదీన విచారణ జరపడం వల్ల పిటిషనర్‌కు శాసనసభ చర్చల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోతుందన్నారు.
ఏపీ శాసనసభ నిబంధనల్లోని రూల్ 340 సబ్ రూల్ 2 ప్రకారం ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు వేసే అధికారం స్పీకర్‌కు ఉందని, అయితే, ఆ సస్పెన్షన్ ఆ సెషన్‌కు మాత్రమే పరిమితమని ఆమె కోర్టుకు నివేదించారు. ఏడాదిపాటు సస్పెన్షన్ వల్ల ఎమ్మెల్యేగా రోజా తన నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం కోల్పోతారని చెప్పారు. ఇప్పటివరకు ఆమెకు సస్పెన్షన్ తాలూకు ఉత్తర్వుల కాపీని కూడా అందచేయలేదని ఇందిరా జైసింగ్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను 9వ తేదీన కాకుండా ఇంకా ముందుగానే చేపట్టాలని సింగిల్ జడ్జిని కోరుతామని పేర్కొంది. తదుపరి వాదనల నిమిత్తం విచారణను ఈ నెల 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్
తనను శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సింగిల్ జడ్జి జస్టిస్ సంజయ్‌కుమార్ సోమవారం విచారించారు. ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు అసెంబ్లీ కార్యదర్శి, శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి మరింత గడువు కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారు. దీన్ని సవాలు చేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు రోజా అప్పీల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రోజా తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. ఈ అప్పీల్‌పై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. వాయిదా వేయడంపై అప్పీల్ దాఖలు చేయడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది.
న్యాయసమీక్ష చేయొచ్చని సుప్రీం చెప్పింది
ప్రత్యేక పరిస్థితుల్లో అప్పీల్ దాఖలు చేయవచ్చని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని జైసింగ్ సమాధానమిచ్చారు. సింగిల్ జడ్జి వద్ద గతనెల 15, 16, 17 తేదీల్లో విచారణ జరిగిందని, రోజా పిటిషన్ విచారణార్హతతోపాటు కేసు పూర్వాపరాలపై అదనపు అడ్వొకేట్ జనరల్ లోతుగా వాదనలు వినిపించారని చెప్పారు. స్పీకర్ నిర్ణయంపై న్యాయ సమీక్షకు వీల్లేదని చెప్పారని అన్నారు. అయితే, న్యాయ సమీక్ష చేయవచ్చని రాజారాంపాల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. 17న నోటీసులు జారీ చేసిన సింగిల్ జడ్జి తదుపరి విచారణను 29కి వాయిదా వేశారని, 29న తిరిగి విచారణకు రాగా అదనపు ఏజీ తాను అసెంబ్లీ కార్యదర్శి తరపున కూడా హాజరవుతున్నానని, కౌంటర్‌కు గడువు కావాలని కోరారని ఆమె ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక 4వ తేదీన సభా హక్కుల కమిటీ సమావేశం ఉందని, ఆ వివరాలను కౌంటర్‌లో పొందుపరుస్తానని చెప్పారని తెలిపారు. ఇదంతా వ్యూహాత్మకంగానే చేశారన్నారు.
పిటిషనర్‌కు ఆ హక్కుంది
రోజా సస్పెన్షన్ నిర్ణయం స్పీకర్‌ది మాత్రమే కాదని, మొత్తం శాసనసభది అని అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వివరించారు. రూల్ 340 సబ్ రూల్ 2 ప్రకారం ఎమ్మెల్యేను ఆ సెషన్ వరకే సస్పెండ్ చేసే అవకాశం ఉంది కదా! అని ధర్మాసనం ప్రశ్నిం చింది. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే హక్కు పిటిషనర్‌కు ఉందని స్పష్టం చేసింది. దమ్మాలపాటి శ్రీని వాస్ స్పందిస్తూ... స్పీకర్‌కు అధికరణ 194(3) కింద విస్తృత అధికారాలున్నాయని చెప్పారు. 5వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున 9వ తేదీ కంటే ముందుగానే కేసు విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జిని కోరుతామని ధర్మాసనం పేర్కొంది. న్యాయస్థానంలో వాదనలు వినేందుకు ఎమ్మెల్యే రోజా మంగళవారం స్వయంగా హైకోర్టుకు వచ్చారు.