ఏడాది చివరిలోగా విచారణ ముగించండి: సుప్రీంకోర్టు | supreme court gives 2 weeks time for roja to give written explanation | Sakshi
Sakshi News home page

ఏడాది చివరిలోగా విచారణ ముగించండి: సుప్రీంకోర్టు

Published Mon, Jul 4 2016 6:26 PM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

ఏడాది చివరిలోగా విచారణ ముగించండి: సుప్రీంకోర్టు - Sakshi

ఏడాది చివరిలోగా విచారణ ముగించండి: సుప్రీంకోర్టు

ఎమ్మెల్యే ఆర్.కె.రోజా శాసనసభ్యత్వం చెల్లదంటూ వై.వి.రాయుడు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి రెండువారాల్లో లిఖితపూర్వక వివరణ ఇచ్చే అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. అలాగే ఈ ఏడాది చివరినాటికి విచారణ పూర్తిచేయాలని హైకోర్టుకు సూచించింది. నగరి నుంచి తన ఎన్నికకు సంబంధించి హైకోర్టులో జరుగుతున్న విచారణపై ఎమ్మెల్యే ఆర్.కె.రోజా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. రోజా ఎన్నిక రద్దు చేయాలంటూ రాయుడు అనే వ్యక్తి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

ఆ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు రాతపూర్వక వివరణ ఇచ్చేందుకు హైకోర్టు అవకాశం ఇవ్వలేదని, ఎన్నికల పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, తిరస్కరించాలంటూ రోజా హైకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు. అయితే రాయుడు దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌తో పాటు ఈ అప్లికేషన్‌ను విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. దీంతో రోజా హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాయుడి పిటిషన్‌ను తిరస్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను సోమవారం విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాదులు వి.గిరి, రమేశ్ అల్లంకి తమ వాదనలు వినిపిస్తూ హైకోర్టు తమ మధ్యంతర దరఖాస్తును పరిష్కరించకుండా ప్రధాన పిటిషన్‌కు జత చేయడం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. హైకోర్టు విచారణ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని చెబుతూ, రాయుడు సవాలు చేసిన పిటిషన్‌పై రెండు వారాల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చేందుకు అవకాశం ఇస్తున్నామని పేర్కొంది. అలాగే ఎన్నిక పిటిషన్‌పై విచారణను ఈ ఏడాది చివరిలోగా పూర్తిచేయాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement