రోజా పిటిషన్‌పై 4న విచారణ
♦ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా: ఎమ్మెల్యే రోజా
♦ ఎన్నికల హామీలు ఒక్కటి కూడా బాబు నెరవేర్చలేదు
సాక్షి, న్యూఢిల్లీ: తాను అసెంబ్లీకి హాజరు కావచ్చునని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 4న విచారణ జరగనుంది. రోజా గత నెల 29న పిటిషన్ దాఖలు చేయగా శుక్రవారం విచారణ జరుపుతామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం నాటి విచారణ జాబితాలో రోజా పిటిషన్ ఉన్నప్పటికీ.. విచారణ సమయం మించిపోవడంతో రోజా తరఫు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఈ విషయం ప్రస్తావించారు. దీంతో ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తులు గోపాలగౌడ, అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.
అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. ‘ఏపీ అసెంబ్లీలో ప్రజల తరఫున గట్టిగా గొంతు వినిపిస్తే ఆ గొంతును నొక్కేయాలన్న అధికార పక్షం ఆలోచనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. నగరి నియోజకవర్గం ప్రజలకు న్యాయం చేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులను టీడీపీ ప్రభుత్వం, అసెంబ్లీ ధిక్కరించాయి. ఇలా చేయడం న్యాయస్థాన గౌరవాన్ని తగ్గించడమే. దీనిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నా. నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా..’ అని రోజా చెప్పారు. ‘స్పీకర్‌కు అన్ని అధికారాలూ ఉంటాయని అంటున్నారు.
అయితే ఆ అధికారాలను సభా కార్యకలాపాలు జరగడానికి ఉపయోగిస్తారు గానీ ఇలా కక్ష సాధింపు కోసం ఉపయోగించరు. సభకు అంతరాయం కలిగించారనుకుంటే ఆ సెషన్ వరకే సస్పెండ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ రోజా నచ్చలేదు కాబట్టి ఏడాది చేస్తామనడం దుష్ట సంప్రదాయం. దీనికి న్యాయస్థానం తెర దించుతుందుని ఆశిస్తున్నా..’ అని అన్నారు. కాగా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటీ నేరవేర్చలేదన్నారు. శివరాజ్‌సింగ్ చౌహాన్, మోదీ, నవీన్ పట్నాయక్‌లు ప్రజల మన్ననలు పొందారు కాబట్టి వారిని గెలిపిస్తున్నారని, మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారని చంద్రబాబును రోజా ప్రశ్నించారు.