సుప్రీంకోర్టులో రోజాకు ఊరట
♦ ఎమ్మెల్యే లేఖను సభాపతి పరిగణనలోకి తీసుకోవాలన్న ధర్మాసనం
♦ శాసనసభ్యురాలిని అసెంబ్లీలోని పార్టీ కార్యాలయానికి అనుమతించాలి
♦ లేకుంటే తీవ్రంగా పరిగణిస్తాం: కోర్టు
♦ వ్యాఖ్యల ఉపసంహరణపై స్పీకర్‌కు రోజా లేఖ..
♦ తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గురువారం నాటి విచారణ సందర్భంగా తమ సూచనల మేరకు రోజా రాసిన లేఖను సభాపతి పరిగణనలోకి తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. సభా కార్యకలాపాల నిబంధనలను అనుసరించి నిర్ణయం తీసుకోవాలంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చడం ద్వారా నిర్ణయం తీసుకోవచ్చునని పేర్కొంది. సభాపతి పరిగణనలోకి తీసుకోనప్పుడు మళ్లీ న్యాయస్థానానికి రావొచ్చునని రోజాకు సూచించింది. రోజాను శాసనసభా ప్రాంగణంలో గల పార్టీ కార్యాలయంలోకి అనుమతించాలని కూడా శాసన వ్యవహారాల కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇరుపక్షాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాలంటూ జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం గురువారం నాటి విచారణ సందర్భంగా సూచించిన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యల్లోని ఉద్దేశం చెబుతూ రోజా వివరణ ఇవ్వాలని ధర్మాసనం సలహా ఇచ్చిన నేపథ్యంలో.. సభాపతిని సంబోధిస్తూ రోజా రాసిన లేఖను శుక్రవారం ఆమె తరఫు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ధర్మాసనానికి నివేదించారు. ఈ లేఖ ప్రతిని అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది పీపీ రావు లేఖలో విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ లేఖను పరిగణ నలోకి తీసుకోవాల్సింది సభాపతి అన్న ఇందిరా జైసింగ్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. సభాపతి నిర్ణయానికి సంబంధించి నిర్దిష్ట కాలపరిమితి విధించాలని ఇందిరా జైసింగ్ కోరగా.. తదుపరి శాసనసభా సమావేశాల్లో గానీ, షెడ్యూలు ప్రకారం వచ్చే ఆగస్టులో జరిగే సమావేశాల్లోగానీ సభాపతి దీనిని ఎజెండాలో చేర్చాలని సూచించింది. పీపీ రావు సభాపతికి ఈ విషయంలో సలహా ఇవ్వాలని పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
ఇబ్బందులు పెడితే తీవ్రంగా పరిగణిస్తాం
ఎమ్మెల్యేను కనీసం శాసనసభా ప్రాంగణంలోని పార్టీ కార్యాలయంలోనికి కూడా అనుమతించడం లేదని జైసింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జస్టిస్ గోపాలగౌడ స్పందిస్తూ.. ‘శాసనసభ్యురాలిని పార్టీ కార్యాలయానికి అనుమతించకపోతే మేం తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది.. చర్య తీసుకోవాల్సి వస్తుంది.. ’ అని స్పష్టం చేశారు. హైకోర్టులో ఏకసభ్య ధర్మాసనం వద్ద ఉన్న తమ ప్రధాన పిటిషన్‌పై కేవలం మధ్యంతర ఉత్తర్వులే వచ్చాయని, అక్కడ తమ పూర్తి స్థాయి వాదనలను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని జైసింగ్ ధర్మాసనాన్ని కోరారు. అలాగే హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు గానీ, సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు గానీ ఏకసభ్య ధర్మాసనం విచారణపై ప్రభావం చూపరాదని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.
రోజా లేఖ సారాంశం ఇదీ...
‘గౌరవనీయులైన సభాపతికి, చట్టసభలు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని తేదీ 21.04.2016న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో 18.12.2015 నాడు అసెంబ్లీలో జరిగిన సంఘటనలకు సంబంధించిన వివాదంపై నా వివరణ ఇదీ..
1. తేదీ 18.12.2015న రూల్ 340(2) ప్రకారం తీసుకున్న చర్యలకు సంబంధించిన విషయంలో.. నేను సభాపతిపై గానీ, సభా నాయకుడిపై గానీ ఎలాంటి అమర్యాదకరమైన లేదా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయలేదు. అలాగే సభా గౌరవాన్ని నేను ఎప్పుడూ తగ్గించలేదు. ఈ అంశానికి సంబంధించి.. ఒకవేళ నా చర్యలు సభను లేదా సభా నాయకుడిని కించపరిచినట్టు గానీ, అగౌరవ పరిచినట్టుగానీ అనిపిస్తే, అలాంటిదేదైనా ఉంటే అది ఉద్దేశపూరితం కాదు. అలాగే వాటిని నేను ఉపసంహరించుకుంటున్నా.
2. శాసనసభ్యురాలు వి.అనిత విషయంలో 24.02.2016న స్పీకర్ ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులకు సంబంధించి నేను మరోసారి పునరుద్ఘాటిస్తున్నా. ఆ సభ్యురాలి విషయంలో నేనెప్పుడూ అమర్యాదకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేయలేదు. నాకు చూపించిన వీడియోల్లో సైతం నేను నాపై వచ్చిన ఆరోపణలను స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్న దృశ్యాలే తప్ప సభ్యురాలిపై కామెంట్లు చేసినట్టు లేదు. ఏదేమైనప్పటికీ నేను సభాహక్కుల కమిటీకి పూర్తి వివరణ ఇచ్చాను. నాకు ఆమెతో వ్యక్తిగతంగా గానీ, వృత్తిపరంగా గానీ ఇబ్బందులేవీ లేవు. అయినప్పటికీ, నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ, ఆమె ఇప్పటికీ నేను అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశానని భావిస్తే నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా.
3. సభ్యులు కాల్వ శ్రీనివాసులు విషయంలో 24.02.2016న స్పీకర్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. సభా హక్కులను నేను ఏవిధంగా ఉల్లంఘించానో నాకైతే తెలియదు. ఎందుకంటే ఆ విషయంలో నాకెలాంటి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. అయినప్పటికీ, ఒకవేళ నా చర్యలు ఏవైనా ఆ సభ్యుడికి ఇబ్బంది కలిగించినట్లయితే లేదా అవమానపరిచినట్టుగా భావించిన ట్లైతే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా.
4. ఇదే సందర్భానికి సంబంధించి మరో ముఖ్యమైన విషయాన్ని గౌరవ న్యాయస్థానం దృష్టికి తెస్తున్నా. అధికార పార్టీ సభ్యులకు వ్యతిరేకంగా సభా హక్కుల తీర్మానాలు ఇచ్చినప్పుడు అవి ఎన్నడూ వెలుగులోకి రాలేదు. కానీ ప్రతిపక్ష సభ్యులకు మాత్రం వేధింపులు తప్పడం లేదు. ఎందుకంటే ప్రివిలేజ్ కమిటీలోని ఏడుగురు సభ్యుల్లో ఐదుగురు సభ్యులు అధికార పార్టీ వారే. అలాగే చైర్మన్ కూడా ఆ పార్టీ శాసనసభ్యుడే.