
సాక్షి, హైదరాబాద్: తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా దాఖలు చేసిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తన ఫిర్యాదు ఆధారంగా బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ గత వారం రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గత నెల 9న బోడె ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే రోజాను ఇష్టమొచ్చినట్లు దూషిస్తూ మాట్లాడారన్నారు. దీనిపై గత నెల 14న పెనమూరు పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదును తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారన్నారు. దీంతో రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు పంపగా, ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యవహారానికి సంబంధించి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment