సాక్షి, కృష్ణా: పెనమలూరు టీడీపీలో సీటు పంచాయితీ ఇంకా కొనసాగుతోంది. అభ్యర్థితత్వం ఖరారు కాకపోవడంతో ఎవరికివారే ప్రచారంలోకి దిగిపోయారు. ఈ క్రమంలో.. సొంత మనుషులే తనను మోసం చేస్తున్నారంటూ ఆవేదన, అలాగే పార్టీ అధినేత తీరుపై అసహనం వ్యక్తం చేశారు బోడే ప్రసాద్.
పార్టీ కోసం పని చేయడం ఒక్కటే నాకు తెలుసు. పార్టీ కోసం ఎంతో కోల్పోయా. అయినా సొంత వాళ్లే నన్ను మోసం చేశారు. పని చేయడం రానివాళ్లు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. టికెట్ కోసం నాపై లేనిపోనివి అధిష్టానానికి చెబుతున్నారు. పోటీ చేయటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా ?. కొడాలి నాని వంశీలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా పిల్ల మీద ప్రమాణం చేసి చెబుతున్నా. వంశీతో ఒకటి , రెండుసార్లు ఆయనే ఫోన్ చేస్తే మాట్లాడా. కోడాలి నానితో ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు. అయినా వాళ్లతో సంబంధాలు ఉన్నట్లు టీడీపీవాళ్లే ప్రచారం చేస్తున్నారు అని బోడే ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు తీరును బోడే ప్రసాద్ ప్రశ్నించారు. ‘‘సర్వేలన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి. కానీ, రకరకాల పేర్లతో అధినేత చంద్రబాబు నాయుడు సర్వే చేయిస్తున్నారు’’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారాయన. అలాగే.. పెనమలూరులో తనకు టికెట్ లేదని స్వయంగా చంద్రబాబే ఫోన్ చేసి చెప్పేసినా ఇంకా టికెట్ పై ఆశలు ఉన్నాయని, టికెట్ తనకే వస్తుందన్న నమ్మకం ఉందని, అదిష్టానం తీసుకుబోయే నిర్ణయం బట్టి తాను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారాయన. ఇదిలా ఉంటే.. పెనమలూరు టికెట్ సీటు ఇవ్వకపోతే రెబల్ అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని బోడే ప్రసాద్ ఇదివరకే ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment