రోజా సస్పెన్షన్: మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టు స్టే
ఎమ్మెల్యే రోజా విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ సర్కారు తరఫున దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సస్పెన్షన్ చెల్లదంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే మంజూరు చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం తన నిర్ణయం వెలువరించింది. సింగిల్ బెంచ్ ఎదుట కౌంటర్ దాఖలు చేయాలని రోజాకు సూచించారు.
వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ శాసనసభ చేసిన తీర్మానం చెల్లదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి అప్పీల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం నాడు హైకోర్టులో రోజా తరఫు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, శాసన వ్యవహారాలశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి.పి.రావు 6 గంటల పాటు తమ వాదనలు వినిపించారు.