'స్పీకరే కొమ్ముకాస్తుంటే ఏం చేయాలి?'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీని నడుపుతున్న తీరును చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే అనుమానం కలుగుతోందని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు రాజ్ భవన్ కు వెళ్లొచ్చిన తర్వాత ఆయన రాజ్ భవన్ వెలుపల మీడియాతో మాట్లాడారు. (గవర్నర్‌కు రాసిన లేఖ పూర్తి పాఠానికి ఇక్కడ క్లిక్ చేయండి)
స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి టీడీపీకి కొమ్ముకాస్తున్నారని, రూల్స్ పర్మిట్ చేయకున్నా అన్యాయంగా అప్పుడు రోజాను సస్పెండ్ చేశారని అన్నారు. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఏకంగా రూల్ 71ను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. అన్యాయంగా చంద్రబాబు ప్రభుత్వం శాసనసభను ఏరకంగా చేతుల్లో పెట్టుకుందో అందరూ చూస్తున్నారని అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
- రూల్ 340(2) ప్రకారం రోజాను సస్పెండ్ చేశామని చెబుతున్నారు. కానీ దాని ప్రకారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సెషన్ వరకు మాత్రమే చేయాలి. అయినా ఏడాది సస్పెండ్ చేశారు.
- 8 మంది ఎమ్మెల్యేలను వైఎస్ఆర్‌సీపీ గుర్తుమీద ప్రజలు గెలిపిస్తే, వాళ్లను చంద్రబాబు తనవద్ద ఉన్న అవినీతి సొమ్ముతో కొనుగోలు చేశాడు. వాళ్లు డిస్ క్వాలిఫై కాకుండా స్పీకర్, చంద్రబాబు కలిసి ఎలా కాపాడారో అందరం చూశాం.
- వాళ్లపై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు స్పీకర్ ఏకంగా రూల్ 71 అనేదాన్ని సస్పెండ్ చేశారు.
- రాజ్యాంగానికి లోబడే అసెంబ్లీలో రూల్స్ ఫ్రేమ్ చేయాలి.
- 179 సి నిబంధన ప్రకారం 14 రోజుల తర్వాతే మోషన్ చేపట్టాలి, విప్ జారీచేసే అవకాశం ఇవ్వాలి. కానీ, స్పీకర్ మాత్రం 14 రోజుల తర్వాత చేపట్టాల్సిన అంశాన్ని అదేరోజు చేపట్టేయడాన్ని మనం చూశాం.
- ఇంత దారుణంగా అసెంబ్లీలో అధికార పక్షం ప్రవర్తిస్తోంది. ప్రజా సమస్యలు వినిపించకూడదని, ప్రతిపక్షం గొంతును నొక్కుతోంది.
- ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంటే, ప్రలోభపెడుతుంటే కాపాడాల్సిన స్పీకర్ టీడీపీకి కొమ్ముకాస్తున్నారు
- మరీ దారుణం.. నేను అనని మాటలు వక్రీకరించి నాకు జ్యుడీషియరీ మీద గౌరవం లేదన్నారు
- రోజమ్మ సుప్రీంకోర్టుకు వెళ్లి, అక్కడి నుంచి హైకోర్టుకు వచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసుకుని వచ్చి స్పీకర్‌కు ఇచ్చిన తర్వాత కూడా ఆమెను అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వలేదు.
- మేం కోర్టుల కన్నా పెద్దవాళ్లం, కోర్టును బేఖాతరు చేస్తామంటూ స్పీకర్ తన పదవిని దుర్వినియోగం చేశారు
- రోజాను అసెంబ్లీలోకి రానివ్వకపోవడంతో ఏం జరుగుతోందో తెలుసుకుందామని 8.50కి అసెంబ్లీకి వెళ్లాను. అప్పటికే ఆమెను అడ్డుకున్నారు.
- నేను కూడా ఎమ్మెల్యేలతో అక్కడే ఆగి వారిని ప్రశ్నించా. గంటన్నరసేపు అక్కడ ధర్నాచేసినా వాళ్ల వైఖరిలో మార్పురాలేదు. చివరకు గాంధీ విగ్రహం వద్దకు కూడా వెళ్లి రోడ్డుమీద బైఠాయించాం.
- గవర్నర్ లేకపోవడంతో ఆయన సెక్రటరీకి కాపీ ఇచ్చి, గవర్నర్ గారికి చెప్పాలని కోరాం
- మధ్యంతర ఉత్తర్వులను పాటించని విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకుంది
- సోమవారం కోర్టు ధిక్కార పిటిషన్ వేయాలని సూచించింది. దాఖలు చేయబోతున్నాం
- ఆ రోజు వాదనలు జరుగుతాయి.. తర్వాత కోర్టు ఉత్తర్వులతో హుందాగా అసెంబ్లీలో అడుగుపెడతాం
- న్యాయవ్యవస్థకు లోబడి, మేమంతా రోజమ్మకు తోడుగా నిలబడుతున్నాం
- అక్కడ రోజాను ఒక్కరినీ రోడ్డు మీద విడిచిపెట్టలేక సభలోకి వెళ్లలేదు
- చంద్రబాబును ప్రశ్నిస్తేనే స్పీకర్ మైకివ్వరు.. ఇక ఆయన్నే ప్రశ్నించాలంటే మైకిస్తారా?
- రోడ్డు మీద బైఠాయించాం, ఆ తర్వాత గవర్నర్ వద్దకు వచ్చి మొరపెట్టుకున్నాం
- రేపు ఏం చేయబోతున్నాం, నిరసన ఎలా వ్యక్తం చేస్తాం అనే అంశంపై కలిసికట్టుగా పార్టీ కార్యాలయంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.