లోటస్ పాండ్లో వైఎస్ జగన్ అధ్యక్షతన భేటీ
హైదరాబాద్: హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను శాసన సభలో అడుగుపెట్టనీయకపోవడంపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ సీఎల్పీ సమావేశమైంది. లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ ప్రారంభమైంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈరోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాలపై చర్చించారు. సభలో ప్రతిపక్షం లేకుండా సమావేశాలు జరపడంపై, స్పీకర్ తీరుపై కూడా చర్చిస్తున్నారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని, ఏవిధంగా ఈ అంశంపై ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. అయితే, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించిన అంశంపై న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినందున రేపు సభకు వెళ్లాలా లేక సోమవారం కోర్టులో తేల్చుకున్నాకే వెళ్లాలా అనే అంశంపై ముఖ్యనేతలతో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ గురించి సీనియర్ నేతలు చెప్పనున్నారు.