
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం క్లిష్ట స్థితిలో ఉందని.. ఈ సమయంలో కొత్త ప్రభుత్వం వెంటనే ఎన్నికల హామీల జోలికి వెళ్తే రాష్ట్రం మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోవడం ఖాయమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో గొప్ప ప్రజాభిమానాన్ని పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంకటంలో ఉంది. నిరుద్యోగులు ఉపాధి కోసం చూస్తున్నారు. డబ్బుల్లేవు. అందరూ సంఘటితంగా తెలుగు ప్రజలకు న్యాయం చేయడం.. నిజమైన అభివృద్ధిని సాధించడం ఎలాగా.. అన్నవాటిపై దృష్టిపెట్టాలి.
ఢిల్లీ నుంచి రావాల్సిన వాటిని ఎలా రాబట్టుకోవాలో చూడాలి. మనం చెల్లించాల్సిన రుణాలను కేంద్రం మాఫీ చేయాలి.. అంతేకాక, ఏపీ అభివృద్ధి కోసం ప్రత్యేక బాండ్లను జారీచేసి, ఆ డబ్బులు రాష్ట్రానికిచ్చి, వాటిని తీర్చే బాధ్యత కేంద్రం తీసుకోవాలి. జగన్‌మోహన్‌రెడ్డిని అన్ని పక్షాలు కోరేది ఒక్కటే.. విభేదాలు వదిలి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకోండి. జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది. జాగ్రత్తగా చేసుకుంటే రాష్ట్రంలో చాలా అవకాశాలున్నాయి’.. అని జయప్రకాష్ నారాయణ అన్నారు.