సమాజంలో మార్పు తెచ్చే నాయకత్వం అవసరం
లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్
సీతంపేట (విశాఖ ఉత్తర): మూడేళ్ల పాలన ముగిసినా ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదని, దీనిపై ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్ద నోట్లు రద్దు చేసినా దేశంలో ఎక్కడా అవినీతి తగ్గలేదని, మరింత పెరిగిందన్నారు. కనీసం వెయ్యిమంది అవినీతి అధికారులనైనా ఇంటికి పంపించాలని, ఆ అధికారం ప్రధానికి ఉందన్నారు. రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఆ పని చేయాలన్నారు. అపుడే లంచం తీసుకోవడానికి భయపడే వ్యవస్థ వస్తుందన్నారు. సమాజం మార్పు కోసం పనిచేసే నాయకత్వం రావాలన్నారు. సంప్రదాయ రాజకీయాల నుంచి ప్రజల వైపు గొంతువిప్పే నాయకులు పార్టీలోకి రావాలన్నారు. ఒక్క ఎమ్మెల్సీ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంత కష్టపడటం అవసరమా అని ప్రశ్నించారు.
విలాసాలు, దుబారా వల్లే ఆర్థిక సంక్షోభం
రాష్ట్రంలో విలాసాలు, దుబారా వ్యయం వల్ల ఆర్థిక సంక్షోభం మరింత పెరిగిందన్నారు. ఉపాధి అవకాశాలు పొందేలా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేలా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా మార్కెటింగ్ యార్డులు చొరవ చూపాలన్నారు. దేశంలో ఆరోగ్యం కోసం కేటాయిస్తున్న నిధులను రెట్టింపు చేయాల్సి ఉందన్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పాత్రికేయుడు వి.వి.రమణమూర్తికి మద్దతు తెలిపారు. మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి, నాయకులు నాయుడు వేణుగోపాల్, రావెల ఝాన్సీ, ఎం.ఎస్.ఎం మూర్తి, రాజవర్మ, రామానాయుడు,వడ్డి హరిగణేష్, ఎమ్మెల్సీ అభ్యర్థి వి.వి.రమణమూర్తి పాల్గొన్నారు.