తాడితోట (రాజమహేంద్రవరం): న్యాయ వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. జనం కోసం జేపీ సురాజ్య యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ హాల్‌లో ‘న్యాయవాదులతో జేపీ’ కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేపీ మాట్లాడుతూ ప్రపంచ న్యాయ వ్యవస్థలో మన దేశం వెనుకబడి ఉందన్నారు. ఈ విషయంలో యువ న్యాయవాదులు సీనియర్ న్యాయవాదుల సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు.
ఎగువ కోర్టుల తీర్పులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని, తమకు న్యాయం జరిగిందని ఫిర్యాదీ సంతృప్తి చెందే విధంగా ఉండాలన్నారు. రాజకీయ నాయకుల వత్తిళ్ళతో న్యాయం జరగదనే అసంతృప్తి ప్రజల్లో ఉండకూడదని అన్నారు. ప్రతీపనికీ కాలపరిమితి హక్కు ఉండాలన్నారు. పట్టణీకరణ నేపథ్యంలో మహిళల పై శారీరకంగాను, మానసికంగాను దాడులు జరుగుతున్నాయని, వీటికి తక్షణ శిక్షలు అమలు జరిగేలా వ్యవస్థలో మార్పులు రావాలన్నారు. రిజర్వేషన్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ల పిల్లలకు అవసరం లేదన్నారు. నిజమైన నిరుపేదలకు రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడే రిజర్వేషన్లకు సార్థకత ఉంటుందన్నారు.
కొన్ని రాష్ట్రాలలో అభివృద్ధి చెందిన కులాలు కూడా రిజర్వేషన్లు కోరుతున్నాయన్నారు. విద్య, ఆరోగ్యం, నిరుద్యోగం, కుల వివక్ష, రిజర్వేషన్ల ఘర్షణ, స్థానికసంస్థలకు అధికారాలు లేకపోవడం, లంచాలు, మహిళలపై వేధింపులు, అప్పుల వ్యవసాయం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలనే జరుగుతున్నాయన్నారు. ముమ్మారు తలాక్ అనే ఇస్లామ్ మతాచారం చెల్లదని షరియా చట్టాలను పరిగణనలోకి తీసుకుంటూ దీని పై పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మానవ హక్కులు, మహిళా స్వేచ్ఛ, హేతుబద్ధ భావాలకు లభించిన పెద్ద విజయమని పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది మద్దూరి శివ సుబ్బారావు, తవ్వల వీరేంద్రనాథ్ తదితరులు ప్రసంగించారు.
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి
దివాన్‌చెరువు (రాజానగరం):గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. దివాన్‌చెరువులోని శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని సీబీఎ‹స్‌ఈ పాఠశాలలకు మూడు రోజులపాటు జరిగే క్లస్టర్ మీట్ – 7 ఖోఖో పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. పై రెండు రాష్ట్రాలకు చెందిన 38 సీబీఎస్‌ఈ పాఠశాలల నుంచి 754 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సీహెచ్ విజయప్రకాష్, ప్రిన్సిపాల్ మూర్తి, లోక్‌సత్తా ఉద్యమ జిల్లా అధ్యక్షుడు యు.మాచిరాజు, సురాజ్యయాత్ర రాష్ట్ర సమన్వయకర్త బండారు రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.