
కౌశల్ భారత్ నిర్మాణమే మోదీ ధ్యేయం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
వెంకటాచలం : యువతలో దాగి ఉన్న తెలివి తేటలను వెలికితీసి కౌశల్ భారతంగా తీర్చిదిద్దడమే ప్రధాని నరేంద్రమోదీ ధ్యేయమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రజామందిరంలో శనివారం జరిగిన ప్రతిభ పుర స్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో లేని సంపద మన దేశంలో ఉందని, అది మరుగునపడిన నేపథ్యంలో మేల్కొల్పేందుకు వృత్తి నైపుణ్య శాఖను ఏర్పాటు చేశారని, దీనికి మంత్రిగా రాజీవ్ ప్రతాప్ రూడీ వ్యవహరిస్తున్నారని చెప్పారు.
భారతదేశ వారసత్వ సంపద యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా ఐక్యరాజసమితిలో 174 దేశాలు ఏకతాటిపైన మోదీకి మద్దతు పలికాయని, ఇందులో ముస్లిం దేశాలూ ఉన్నాయని చెప్పారు. దేశంలో 25 నుంచి 45 ఏళ్లలోపు వారు 60 శాతం మంది ఉన్నారని, వీరిని ఒక శక్తిగా తీర్చిదిద్దేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తెలివి కలిగి ఉంటే ప్రశంసలు అందుతాయని స్వర్ణభారత్ ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్ నిరూపించాయని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ప్రతిభ కనుబర్చిన 87 మంది విద్యార్థులకు రూ.2500, మెమెంటో, జ్ఞాపికలను స్వర్ణభారత్ ట్రస్ట్ అందజేయడం అభినందనీయమని కొనియాడారు. బీవీ రాజు, స్వర్ణభారత్ ట్రస్ట్ సంయుక్తంగా వృతి ్త నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఈ ప్రాంత యువతకు ఉపయోగకరమన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ గుర్తింపుతో ఇకపై సర్టిఫికెట్లను అందజేస్తారని, వీటికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందని చెప్పారు. కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్, కలెక్టర్ జానకీ, స్వర్ణభారత్ ట్రస్టీ హరికుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
దేశప్రగతికి బాటలు
వెంకటాచలం: దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బాటలు వేస్తున్నారని కేంద్ర నైపుణాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ పేర్కొన్నారు. వెంకటాచలం మండల పరిధిలోని సరస్వతీనగర్‌లో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రానికి శనివారం భూమి పూజ చేసిన అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగిన ప్రతిభ పురస్కారాల్లో ఆయన మాట్లాడారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మూడు శాతం మాత్రమే స్వయం ఉపాధితో జీవిస్తున్నారని, మన దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లోనూ వృత్తి విద్యా కోర్సులకు మంచి డిమాండ్ ఉందన్నారు.
దీని కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వృత్తి విద్యను ప్రోత్సహిస్తూ, రాబోయే ఐదేళ్లలో దేశంలో 30 కోట్ల మందికి ఈ విద్యను అందించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. దీనికి కోసం రూ.లక్షల కోట్లను ఖర్చు చేయనుందని వెల్లడించారు. అనంతరం పురపాలక మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యను అందించేందుకు ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్వర్ణభారత్ ట్రస్ట్‌లో పురస్కారం అందుకున్న 87 మంది విద్యార్థులకు తమ నారాయణ సంస్థల ద్వారా ఇంటర్మీడియట్ చదువును ఉచితంగా అందజేస్తానని ప్రకటించారు. మంత్రి నారాయణను వెంకయ్యనాయుడు అభినందించారు.