
అసెంబ్లీ సీట్ల పెంపునకు చర్యలు
♦ త్వరలో ప్రక్రియను ప్రారంభించనున్న కేంద్రం
♦ కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచే ప్రక్రియను కేంద్రహోంశాఖ త్వరలో చేపట్టనుంది. అసెంబ్లీ స్థానాల పెంపు విషయంపై కూలంకషంగా చర్చించడానికి ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారమిక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎం.వెంకయ్యనాయుడుతోపాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులు, కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ కార్యదర్శి, పార్లమెంటరీ వ్యవహారాల సంయుక్త కార్యదర్శులు పాల్గొన్నారు.
సమావేశానంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. న్యాయమంత్రిత్వశాఖ నుంచి రాతపూర్వక అభిప్రాయాన్ని సేకరించి అసెంబ్లీ స్థానాలసంఖ్యను పెంచడానికి వీలుగా ఏపీ విభజన చట్టంలో మార్పులు తెచ్చేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. న్యాయశాఖ అభిప్రాయం కోరుతూ హోంశాఖ ఒకటి, రెండు రోజుల్లో లేఖ రాస్తుందన్నారు. దీనిపై న్యాయశాఖ.. అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకున్నాక మద్దతు తెలుపుతూ హోంశాఖకు పంపిస్తుందని, అప్పుడు ఏపీ విభజన చట్టాన్ని సవరిస్తూ ముసాయిదా బిల్లును హోంశాఖ రూపొందిస్తుందని వివరించారు.
వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. విభజన చట్టంలో ప్రత్యేకించి సెక్షన్ 26 ప్రకారం ఏపీ అసెంబ్లీలో స్థానాలసంఖ్యను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాలని పేర్కొన్నారని, కానీ అదేచట్టంలో రాజ్యాంగంలోని 175వ అధికరణం ప్రకారం.. అని ఒకమాట చెప్పడంతో దీనిపై రెండురకాల వాదనలు వినిపిస్తున్నాయని చెప్పారు. దీంతో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే కూలంకషంగా చర్చించి, ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అసెంబ్లీ స్థానాలసంఖ్య పెంపుపై రెండు రాష్ట్రాల్లోనూ భిన్నాభిప్రాయం లేదని, చట్టంలో పేర్కొన్న మేరకు సవరించాలని కేంద్రానికి లేఖలు రాశాయని చెప్పారు.
హైకోర్టు విభజనపై న్యాయశాఖ పరిశీలన
హైకోర్టు విభజనను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని తెలంగాణకు చెందినవారు ఆరోపిస్తున్న విషయాన్ని ప్రస్తావించగా.. ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడతారు, దేశంలో స్వేచ్ఛ ఉంది.. ఎమర్జెన్సీ లేదని ఆయన బదులిచ్చారు. ఏదేమైనా ఈ విషయంలో ప్రభుత్వం స్థూలంగా అనుకూలంగా ఉందని న్యాయశాఖ మంత్రి స్పష్టం చేశారని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. పాలనాపరంగా ఉన్న విషయాలను న్యాయశాఖ పరిశీలిస్తోందన్నారు.