ఈనెల 25 నుంచే పార్లమెంట్
కేంద్రమంత్రి వెంకయ్య వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు ఈనెల 25 నుంచే ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం తెలిపారు. వాస్తవానికి ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం మలి విడత సమావేశాలు ఈనెల 25 నుంచి మే 13 వరకు కొనసాగుతాయి. అయితే ఉత్తరాఖండ్ బడ్జెట్‌కు సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేయడానికి వీలుగా పార్లమెంట్ ఉభయసభలను గత వారంలో ప్రొరోగ్ చేశారు. దాంతో బడ్జెట్ మలి విడత తేదీలపై సందిగ్ధత ఏర్పడింది.
అయితే ఐడబ్ల్యూపీసీ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య పార్లమెంట్ సమావేశాల తేదీలపై స్పష్టత ఇచ్చారు. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారమే సమావేశాలు ఏప్రిల్ 25 నుంచి మే 13 వరకు కొనసాగుతాయన్నారు. చట్టాలు రూపొందించే అత్యున్నత సంస్థ పార్లమెంట్ అని చెబుతూ, 2014 నుంచి పార్లమెంట్ పనితీరులో మిశ్రమ అనుభవాలున్నాయన్నారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలంటూ పార్లమెంటరీ కమిటీ సిఫారసులపై ఆలోచన చేస్తున్నామన్నారు. ‘అది మంచి ఆలోచనే కానీ ఆచరణ సాధ్యం కాద’ంటూ పార్టీలు ఆ సిఫారసులపై స్పందించాయన్నారు.