న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ఆయన లోక్‌సభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలందరికీ మార్గ నిర్దేశం చేసిందని అన్నారు.
మంగళవారం సభలో కొందరు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ అన్నారు. అవి చూసి చాలా మంది థ్రిల్ అయ్యారని సెటైర్లు వేశారు. ఆ వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయని కౌంటర్ ఇచ్చారు. భారత్ తన సమస్యల పరిష్కారం కోసం ఒకప్పుడు ఇతరులపై ఆధారపడేదని, ఇప్పుడు భారతే ఇతరుల సమస్యలను పరిష్కరించే స్థాయికి చేరుకుందని రాష్ట్రపతి అన్నారని గుర్తు చేశారు. తాము దేశంలో అవినీతిని నిర్మూలించామని మోదీ అన్నారు. ఈ క్షణం కోసం దేశం చాలా ఏళ్లుగా ఎదురుచూసిందని పేర్కొన్నారు.
'ఇవాళ జీ-30 నిర్వహించే స్థాయికే భారత్ ఎదగడం గర్వకారణం. ఇది కొంతమందికి కంటగింపు కావచ్చు. నాకైతే గర్వకారణమే. నిరాశలో ఉన్న కొందరు దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారు. చాలా దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయి. భారత్ మాత్రం బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. దేశ విజయాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.
మొబైళ్ల తయారీలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇంధన వినియోగంలో మూడో స్థానంలో ఉంది. 104 యూనికార్న్స్ ఈ మధ్య ఏర్పడ్డాయి. 150 దేశాలకు వ్యాక్సిన్లు పంపించాం. వ్యాక్సిన్ సర్టిఫికేట్లు క్షణాల్లో మొబైల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ప్రతి రంగంలో భారత్ చరిత్ర సృష్టిస్తోంది. ఇవన్నీ కొందరికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మా విజయాలు చూసి నిరాశవాదులకు నిద్రపట్టడంలేదు. వారు ప్రశాంతంగా పడుకోలేక పోతున్నారు.
2014 నుంచి ఇప్పటిదాకా మా ప్రభుత్వం ఏం చేసిందో దేశ ప్రజలకు తెలుసు. ప్రజలు పదే పదే మాకు మద్దతు ఇస్తున్నారు. 2004-14 వరకు దేశంలో అవినీతి రాజ్యమేలింది. భారీ కుంభకోణాలు జరిగాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం రాజ్యమేలింది. 2జీ, బొగ్గు స్కాం, కామన్‌వెల్త్ క్రీడల్లో అవినీతి జరిగింది. 2004-14 అనేది దేశంలో అవినీతి దశాబ్దమైంది. దేశంలో ఆ పదేళ్లు రక్తపుటేరుల పారాయి.
టెలికాం మూమెంట్ 2జీ స్కామ్ అయింది. న్యూక్లియర్ మూమెంట్ ఓటుకు నోటు అయ్యింది. కామన్‌వెల్త్ గేమ్స్ మూమెంట్ సీడబ్ల్యూసీ స్కామ్ అయింది. ఆ దశాబ్ద కాలం భారత్ తీవ్రంగా నష్టపోయింది. అవినీతిపై కొరడా ఝుళిపిస్తే దర్యాప్తు సంస్థలను తప్పుబడుతున్నారు.' అని కాంగ్రెస్‌కు మోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు.
'అవినీతిపై చర్యలు తీసుకుంటున్న దర్యాప్తు సంస్థలపై విపక్షాలన్నీ విమర్శలు గుప్పిస్తాయి. విపక్షాలన్నింటినీ ఈడీ ఏకతాటిపైకి తెచ్చింది. అందుకు ఈడీకీ థ్యాంక్స్ చెప్పాలి. కరోనా టైంలో విపక్షాలు విచిత్రంగా మాట్లాడాయి. కరోనా వల్ల భారత్ పతనంపై హార్వర్డ్ యూనివర్సిటీలో పరిశోధనలగు జరుగుతున్నాయన్నాయి. కానీ కాంగ్రెస్ పతనంపై హార్వర్డ్‌లో పరిశోధన జరిగింది. మిగతా వర్సిటీలు కూడా దీనిపై పరిశోధలను జరిపాయి.
మోదీపై బురదజల్లి లబ్ధి పొందాలని విపక్షాలు అనుకుంటున్నాయి. టీవీలు, పేపర్లలో నాపై వివర్శలు చేసి లబ్ధి పొందలేరు. దేశ ప్రజలకు నాపై విశ్వాసం ఉంది. వన్ నేషన్ వన్ రేషన్‌తో లబ్ధి పొందిన పేదలు మీ మాటలు నమ్ముతారా? ప్రధాన మంత్రి ఆవాస్ యోజనతో సొంతింటి కల సాకారం చేసుకున్న సామాన్యులు మీ విమర్శలు నమ్ముతారా? కొందరు ఒకే కుటుంబానికి సేవ చేస్తారు. కానీ 25 కోట్ల కుటుంబాల్లో నేను సభ్యుడిని. 140 కోట్ల మంది ప్రజలే నాకు రక్షణ కవచం. దాన్ని మీరు ఛేదించలేరు' అని మోదీ విపక్షాలను ఏకిపారేశారు.
బీఆర్‌ఎస్ వాకౌట్...
మరోవైపు మోదీ ప్రసంగానికి ముందే బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని వారు డిమాండ్ చేయగా.. స్పీకర్ దీన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో బీఎర్‌ఎస్ ఎంపీలు సభను వీడారు.
చదవండి: 2014 తర్వాతే ‘అదానీ మ్యాజిక్’
Comments
Please login to add a commentAdd a comment