న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏడోరోజు ఉభయ సభలు మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తమ రాజవంశానికి మించి ఎక్కువ ఆలోచించకపోవడం కాంగ్రెస్ సమస్య అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలే భారత్ కు ప్రధాన శత్రువన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రభుత్వం తరపున సమాధానమిస్తూ ప్రధాని మంగళవారం రాజ్యసభలో మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ముప్పు ఈ వంశపారంపర్య పార్టీలేనని నిప్పులు చెరిగారు.
మహాత్మాగాంధీ కాంగ్రెస్‌ని రద్దు చేయాలని కోరారని, గాంధీ కోరికను అనుసరించినట్లయితే భారతదేశం ఈ బంధుప్రీతి నుంచి విముక్తి పొంది ఉండేదని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ లేకపోయి ఉంటే దేశంలో ఎమర్జెన్సీ మరక ఉండేది కాదు. దశాబ్దాలుగా అవినీతి సంస్థాగతంగా ఉండేది కాదు. కులతత్వం లేదా ప్రాంతీయత వంటివి ఉండేవి కావు. సిక్కుల ఊచకోత జరిగి ఉండేది కాదు. కశ్మీర్ నుంచి వలసలు ఉండేవి కావు. మహిళలను తాండూరులో కాల్చిచంపేవారు కాదు. సామాన్యులు కనీస సౌకర్యాల కోసం చాలా కాలం వేచి ఉండాల్సిన అగత్యం ఉండేది కాదు’ అంటూ విమర్శలు గుప్పించారు.
చదవండి: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం
అయితే రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసిన చరిత్ర కూడా ఆ పార్టీకే ఉందన్నారు. పైగా వారు అపఖ్యాతి, అస్థిరత, తొలగింపులను విశ్వసించారని మోదీ చెప్పుకొచ్చారు. అంతేకాదు అర్బన్ నక్సల్స్ భావజాలంలో కాంగ్రెస్ ఇరుక్కుపోయిందని అందుకే వారి మనసులు విధ్వంసకరం అంటూ ప్రధాని విమర్శించారు. తాను రాష్ట్రాల ప్రగతికి వ్యతిరేకం కాదని, అయితే ప్రాంతీయ ఆకాంక్షలు దేశ ప్రగతికి విరుద్ధంగా ఉండొద్దని ప్రధాని అన్నారు. దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ ఆకాంక్షలను పరిష్కరించినప్పుడే భారతదేశ పురోగతి మరింత బలంగా ఉంటుందని, రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుంది అని ప్రధాని మోదీ రాజ్యసభలో నొక్కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment