కేంద్రీయ విద్యాలయ భవనానికి మోక్షం
► రేపు కేంద్ర మంత్రి వెంకయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం
► శనివారం నుంచి నూతన భవనంలోనే తరగతులు
► విద్యార్థులకు తప్పని రవాణా కష్టాలు
► రవాణా సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రుల వేడుకోలు
నెల్లూరు (టౌన్) : కేంద్రీయ విద్యాలయ భవనానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన భవనాన్ని కేంద్ర మంత్రి వెంక య్యనాయుడి చేతుల మీదుగా శనివారం ప్రారంభించనున్నారు. భవన నిర్మాణం ఏడాది క్రితం పూర్తయిన విద్యుత్, రహదారి, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. కలెక్టర్ జానకి ప్రత్యేక చొరవ తీసుకుని సదుపాయాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో వెంకటగిరిలో కేంద్రీయ విద్యాలయం ఉండగా, నెల్లూరులో రెండో విద్యాలయం ఏర్పాటు చేయడంలో కేంద్ర మంతి వెంకయ్యనాయుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కృషి ఉంది. అయితే నెల్లూరులో ఆరేళ్లుగా ఆర్‌ఎస్‌ఆర్ మున్సిపల్ హైస్కూల్లో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు.
రూ.8.79 కోట్లతో భవన నిర్మాణం
నెల్లూరులో కేంద్రీయ విద్యాలయం 2010లో మంజూరు కాగా, తొలుత 1 నుంచి 5వ తరగతి వరకు మాత్రమే క్లాసులు నిర్వహించారు. అనంతరం ఏటా ఒక్కో క్లాసును పెంచుతూ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 10వ తరగతి వరకు ఉండగా, 480మందికిపైగా విద్యను అభ్యసిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఆర్ మున్సిపల్ హైస్కూల్లో తాత్కాలికంగా తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శాశ్వత భవనాన్ని రూ.8.79 కోట్ల వ్యయంతో పొదలకూరు రోడ్డులో జర్నలిస్టు కాలనీ వెనుక వైపునున్న 7.43 ఎకరాల్లో రెండు ఫ్లోర్లతో నిర్మించారు. భవనంలో మొత్తం 51 గదులను నిర్మించారు. ఇందులో 40 తరగతి గదులకు కేటాయించగా, మిగిలినవి ఆఫీసు, ఉపాధ్యాయులు, టాయ్‌లెట్స్, తదితర వాటికి వినియోగించనున్నారు.
భవనం మధ్య భాగంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వేదికను ఏర్పాటు చేశారు. క్రీడల కోసం బాస్కెట్‌బాల్, వాలీబాల్, కోకో, తదితర కోర్టులను నిర్మించారు. పొదలకూరు రోడ్డు నుంచి కేంద్రీయ విద్యాలయానికి వెళ్లేందుకు జర్నలిస్టులకు కేటాయించిన 40అడుగుల రోడ్డును అనుమతించారు.
శనివారం నుంచి నూతన భవనంలోనే తరగతులు
కేంద్రీయ విద్యాలయం తరగతులను శనివారం నుంచి నూతన భవనంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్లో ఉన్న ఫర్నిచర్‌ను అక్కడకి తరలించనున్నారు. నూతన భవనంలో మార్చిన తరువాత ఒక్కో తరగతిని రెండు సెక్షన్లుగా విభజించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం 1నుంచి 5వ తరగతి వరకు రెండు సెక్షన్లను ఏర్పాటు చేయునున్నట్లు తెలిసింది. మిగిలిన తరగతులను రెండు సెక్షన్లుగా ఏర్పాటు చేస్తే మరికొంత మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది.
విద్యార్థులకు తప్పని రవాణా కష్టాలు
నూతన భవనంలోకి కేంద్రీయ విద్యాలయాన్ని మార్చడం వల్ల విద్యార్థులకు రవాణా ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రస్తుతం విద్యాలయం తరఫున ఎలాంటి వాహనాలు లేవు. విద్యార్థులు సొంత వాహనాల్లో స్కూలుకు వెళ్తున్నారు. నగరం నుంచి నూతన భవనం సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. నగర శివారులో నిర్మించిన భవనం వద్దకు వెళ్లేందుకు ఎలాంటి వాహన సౌకర్యం లేదు. సిటీ బస్సులు కొత్తూరు వరకు మాత్రమే ఉన్నాయి. సిటీ బస్సులను కేంద్రీయ విద్యాలయం వరకు పొడిగించాలని విద్యార్థుల తల్లి, దండ్రులు కోరుతున్నారు. వీటితో పాటు పొదలకూరు వైపు వెళ్లే తెలుగు- వెలుగు బస్సులకు కేంద్రీయ విద్యాలయం రహదారి వద్ద స్టాఫింగ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.