Transport Facility
-
అభివృద్ధికి రహదారి.. చెన్నై, కోల్‌కతా మధ్య మరింత వేగంగా ప్రయాణం
సాక్షి, కృష్ణాజిల్లా: కోస్తా తీరం అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచేందుకు చేపట్టిన 216 నంబరు జాతీయ రహదారి నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తీరప్రాంతం పారిశ్రామిక, వర్తక, వాణిజ్య రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల అభివృద్ధికి చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణం ఎప్పుడో పూర్తికావాల్సి ఉంది. టీడీపీ పాలకుల కమీషన్ల కక్కుర్తి కారణంగా పనుల్లో జాప్యం నెలకొంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు వరకు జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే మచిలీపట్నం పోర్టు ద్వారా చెన్నై, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు రవాణా మార్గం సులభతరం అవుతుంది. బందరు పోర్టు అనుబంధ పరిశ్రమలకు రోడ్డు రవాణా మార్గం అందుబాటులోకి వస్తుంది. బాపట్ల, రేపల్లెతో పాటు కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల నుంచి ఏటా రూ.1150 కోట్ల ఎగుమతులు సాధిస్తున్న ఆక్వా రంగం మరింతగా పుంజుకుంటుంది. తగ్గనున్న 150 కి.మీ. దూరం తమ ప్రాంతం అభివృద్ధి కోసం జాతీయ రహదారి నిర్మాణాన్ని చేపట్టాలంటూ 2002లో కృష్ణా జిల్లా లోని పలు మండలాలకు చెందిన మత్స్యకారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. నెలల తరబడి దీక్షలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ ఉద్యమ ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం 216 జాతీయ రహదారిని నిర్మిస్తామని ప్రకటించింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే చెన్నై – కోల్‌కతా మధ్య 150 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కోల్‌కతా, చెన్నై మధ్య రాకపోకలు సాగించే వాహనాలు ఏలూరు, విజయవాడ, గుంటూరు వెళ్లకుండానే నేరుగా ఒంగోలు చేరుకుంటాయి. ఫలితంగా ఇంధనం, సమయం ఆదా అవుతాయి. కోస్తా తీర ప్రగతికి రాచమార్గం 216 జాతీయ రహదారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృత్తివెన్ను మండలం పల్లెపాలెం నుంచి పులిగడ్డ వరకు 120 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఈ రహదారిని నాలుగు వరసలుగా విస్తరిస్తున్నారు. 16 నంబరు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా ఒంగోలు నుంచి 216వ నంబరు జాతీయ రహదారి ప్రారంభమవుతుంది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ కత్తిపూడి వద్ద తిరిగి 16 నంబరు జాతీయ రహదారిలో కలుస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 260.5 హెక్టార్లు, పశ్చిమ గోదావరిలో 30, కృష్ణాలో 138, గుంటూరులో 48, ప్రకాశంలో 123.48 హెక్టార్ల భూములు సేకరించారు. ఇందు కోసం నిర్వాసితులకు రూ.320 కోట్లు చెల్లించారు. పొడవైన వంతెనలు.. పెద్ద ఎత్తున కల్వర్టులు ప్రాజెక్టులో భాగంగా రైల్వే క్రాసింగ్ ఉన్న చోట్ల ఆరు ప్రాంతాల్లో రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)లు నిర్మిస్తున్నారు. పిఠాపురం, సామర్లకోట, రావులపాలెం, పెడన, భట్టిప్రోలు, చినగంజాం వద్ద ఆర్వోబీలు నిర్మిస్తున్నారు. కాకినాడ వద్ద 19 కిలోమీటర్ల పొడవున బైపాస్ నిర్మించారు. గతంలో ఉన్న వంతెనల స్థానంలో 164 కొత్త వంతెనలను నిర్మిస్తున్నారు. ఈపూరుపాలెం – ఒంగోలు మధ్య 25, కత్తిపూడి – కాకినాడ మధ్య 23 వంతెనలు నిర్మిస్తున్నారు. 731 కల్వర్టులు అందుబాటులోకి రానున్నాయి. కృష్ణా జిల్లాలో పెడన వద్ద ఇప్పటికే బైపాస్ ఉండగా, బంటుమిల్లి సమీపంలో మరో బైపాస్ నిర్మిస్తున్నారు. చల్లపల్లి, మోపిదేవి, మచిలీపట్నం వద్ద బైపాస్‌లు నిర్మిస్తున్నారు. ఏడు టోల్ ప్లాజాలు ఈ రహదారిపై ఏడు టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేస్తారని సమాచారం. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు, అన్నంపల్లి, పశ్చిమగోదావరి జిల్లా సీతారాంపురం, కృష్ణా జిల్లా బాసినపాడు, మోపిదేవి, గుంటూరు జిల్లా రెడ్డిపాలెం, ప్రకాశం జిల్లా పెదగంజాం వద్ద టోల్‌ప్లాజాలు ఏర్పాటవు తాయని తెలుస్తోంది. ఈ జాతీయ రహదారిపై సాధారణ వేగం 80, గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. ఈ రహదారిని ఒకే దిశలో మలుపులు లేకుండా డిజైన్ చేశారు. వంతెనల వద్ద అప్రోచ్‌రోడ్ల నిర్మాణం పనులు సాగుతున్నాయి. తీర ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఈ రహదారిని మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. మోపిదేవి మండలం పెదప్రోలు వద్ద నిర్మాణంలో ఉన్న 216 జాతీయ రహదారి పెడన వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ -
‘మోడల్’ కష్టాలు!
నారాయణఖేడ్: జిల్లాలోనే వెనుకబడిన మండలమైన నాగల్గిద్ద మండల పరిధిలోని మోర్గి మాడల్ స్కూల్ విద్యార్థులు నిత్యం సమస్యలతో సమతమతం అవుతున్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దున మోర్గి గ్రామంలో మోడల్ పాఠశాల నిర్మించిన నాటి నుంచి విద్యార్థులు నిత్యం నరకమే అనుభవిస్తున్నారు. మోర్గి మోడల్ స్కూల్, మరియు కళాశాలల్లో కలిపి మొత్తం 600మంది విద్యార్థుల వరకు నిత్యం విద్యాభ్యాసం చేస్తారు. దీంతో వివిధ ప్రాంతా నుంచి విద్యార్థులు పాఠశాలకు రావాలంటే వాహన సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులుల ఎదుర్కొంటున్నారు. నాగల్గిద్ద మండలానికి మోర్గి మాడల్ పాఠశాల వచ్చిన కాడినుండి ఇబ్బందులు తప్పడంలేదు. గత పాలకుల తప్పిదమే.. మెర్గి మాడల్ స్కూల్‌ను నాగల్గిద్ద నుంచి మోర్గికి మార్చడంతో ఈ ఇబ్బందులు విద్యార్థులుకు శాపంగా మారినాయి. రూ కోట్లు వెచ్చింది మారుమూల గ్రామంలో భవనం నిర్మించడంతో ఇలాంటి పిరిస్థతులు నెలకొన్నాయి. నాటి పాలకుల తప్పిదం నిర్ణయంవల్లె నాగల్గిద్ద నుంచి పాఠశాలను మోర్గికి మార్చారు. అక్కడ అయిదు ఎకరాల ప్రభుత్వ భూమిని కెటాయించారు. రూ.కోట్లు వెచ్చించి భవనం నిర్మాణం చేపట్టారు. కాని విద్యార్థులకు మాత్రం సమస్యలు తీరండలేదు. కలెక్టర్ హామీ ఇచ్చినా తీరని రోడ్డు సమస్య.. గత ఏడాది ప్రారంభంలో విద్యార్థులు తమ పాఠశాలకు నాగల్గిద్ద పీడబ్యూడీ రోడ్డునుండి మోర్గి వరకు నాలుగు కిలోమీటర్ల బీటి రోడ్డు అవసరం ఉంది. గతంలో వేసిన పీఎంజీఎస్‌వై రోడ్డు పూర్తిగా చిద్రం కాగా గోతులు ఏర్పడినాయి. రోడ్డుకు మద్యన ఉన్న భారి కల్వర్టు సైతం శిథిలమై కూలిపోయింది. దీంతో వాహనాలు సైతం సక్రమంగా వెళ్లడం లేదు. విద్యార్థులకు తప్పని ఇబ్బందులు.. మోర్గి మాడల్ పాఠశాలకు నాగల్గిద్ద మండలంలోని కరస్‌గుత్తి, కారముంగి, ఔదత్పూర్, శేరిదామర్‌గిద్ద, గుడూర్, నారాయణఖేడ్, తదితర గ్రామాలనుండి నిత్యం వందాలాది విద్యార్థులు పాఠశాలకు చేరుకోవాల్సిన పరిస్థితి, దీంతో వారు వివిద ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పడంలేదు. ఇక నారాయణఖేడ్నుండి ఆర్టీ అధికారులు ఒక్క పూట బస్సును రెండు ట్రిప్పులుగా ఎమ్మెల్యే చొరవతో వేసిన ఫలితం అగుపించడంలేదు. దీంతో విద్యార్థుల ఇబ్బందులు సైతం తీరడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం’
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో...కాలుష్య నియంత్రణపై అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సరి, బేసి విధానం అమలు కాలంలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13 నుంచి అయిదు రోజుల పాటు అనగా నవంబర్ 17 వరకూ ఈ విధానం అమల్లో ఉండనుంది. ఉచిత ప్రయాణం విషయాన్ని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ ధ్రువీకరించారు. ఈ విధానం వల్ల పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించినట్లు అవుతుందని ట్విట్ చేశారు. కాగా ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు అదనంగా మరో 600 బస్సులను అద్దెకు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా అధికారిక ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో సరి-బేసి విధానాన్ని అమలు చేయడం ఇది మూడో సారి. అంతకముందు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కాలుష్య స్థాయిలు కొంతమేర తగ్గిన సంగతి తెలిసిందే. అలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వాడుకునేలా కారు పార్కింగ్ ఛార్జీలను నాలుగు రెట్లు పెంచింది. To encourage use of public transport during Odd- Even, Delhi govt to allow free travel for commuters in all DTC and Cluster buses from 13-17 November. — Kailash Gahlot (@kgahlot) November 10, 2017 మరోవైపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ...కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పలేదని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. సరి-బేసి విధానాన్ని పిక్నిక్లా వాడుకుంటున్నారని మండిపడింది. ఈ విధానం అమలు వల్ల పెద్దగా ప్రయోజనం లేదని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నివారణ మండళ్లు నివేదిక ఇచ్చిందని, అయినా ఎందుకు అమలు చేస్తున్నారంటూ ఎన్టీజీ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేంద్రీయ విద్యాలయ భవనానికి మోక్షం
► రేపు కేంద్ర మంత్రి వెంకయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం ► శనివారం నుంచి నూతన భవనంలోనే తరగతులు ► విద్యార్థులకు తప్పని రవాణా కష్టాలు ► రవాణా సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రుల వేడుకోలు నెల్లూరు (టౌన్) : కేంద్రీయ విద్యాలయ భవనానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన భవనాన్ని కేంద్ర మంత్రి వెంక య్యనాయుడి చేతుల మీదుగా శనివారం ప్రారంభించనున్నారు. భవన నిర్మాణం ఏడాది క్రితం పూర్తయిన విద్యుత్, రహదారి, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. కలెక్టర్ జానకి ప్రత్యేక చొరవ తీసుకుని సదుపాయాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో వెంకటగిరిలో కేంద్రీయ విద్యాలయం ఉండగా, నెల్లూరులో రెండో విద్యాలయం ఏర్పాటు చేయడంలో కేంద్ర మంతి వెంకయ్యనాయుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కృషి ఉంది. అయితే నెల్లూరులో ఆరేళ్లుగా ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. రూ.8.79 కోట్లతో భవన నిర్మాణం నెల్లూరులో కేంద్రీయ విద్యాలయం 2010లో మంజూరు కాగా, తొలుత 1 నుంచి 5వ తరగతి వరకు మాత్రమే క్లాసులు నిర్వహించారు. అనంతరం ఏటా ఒక్కో క్లాసును పెంచుతూ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 10వ తరగతి వరకు ఉండగా, 480మందికిపైగా విద్యను అభ్యసిస్తున్నారు. ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో తాత్కాలికంగా తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శాశ్వత భవనాన్ని రూ.8.79 కోట్ల వ్యయంతో పొదలకూరు రోడ్డులో జర్నలిస్టు కాలనీ వెనుక వైపునున్న 7.43 ఎకరాల్లో రెండు ఫ్లోర్లతో నిర్మించారు. భవనంలో మొత్తం 51 గదులను నిర్మించారు. ఇందులో 40 తరగతి గదులకు కేటాయించగా, మిగిలినవి ఆఫీసు, ఉపాధ్యాయులు, టాయ్‌లెట్స్, తదితర వాటికి వినియోగించనున్నారు. భవనం మధ్య భాగంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వేదికను ఏర్పాటు చేశారు. క్రీడల కోసం బాస్కెట్‌బాల్, వాలీబాల్, కోకో, తదితర కోర్టులను నిర్మించారు. పొదలకూరు రోడ్డు నుంచి కేంద్రీయ విద్యాలయానికి వెళ్లేందుకు జర్నలిస్టులకు కేటాయించిన 40అడుగుల రోడ్డును అనుమతించారు. శనివారం నుంచి నూతన భవనంలోనే తరగతులు కేంద్రీయ విద్యాలయం తరగతులను శనివారం నుంచి నూతన భవనంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆర్ఎస్ఆర్ స్కూల్లో ఉన్న ఫర్నిచర్‌ను అక్కడకి తరలించనున్నారు. నూతన భవనంలో మార్చిన తరువాత ఒక్కో తరగతిని రెండు సెక్షన్లుగా విభజించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం 1నుంచి 5వ తరగతి వరకు రెండు సెక్షన్లను ఏర్పాటు చేయునున్నట్లు తెలిసింది. మిగిలిన తరగతులను రెండు సెక్షన్లుగా ఏర్పాటు చేస్తే మరికొంత మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు తప్పని రవాణా కష్టాలు నూతన భవనంలోకి కేంద్రీయ విద్యాలయాన్ని మార్చడం వల్ల విద్యార్థులకు రవాణా ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రస్తుతం విద్యాలయం తరఫున ఎలాంటి వాహనాలు లేవు. విద్యార్థులు సొంత వాహనాల్లో స్కూలుకు వెళ్తున్నారు. నగరం నుంచి నూతన భవనం సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. నగర శివారులో నిర్మించిన భవనం వద్దకు వెళ్లేందుకు ఎలాంటి వాహన సౌకర్యం లేదు. సిటీ బస్సులు కొత్తూరు వరకు మాత్రమే ఉన్నాయి. సిటీ బస్సులను కేంద్రీయ విద్యాలయం వరకు పొడిగించాలని విద్యార్థుల తల్లి, దండ్రులు కోరుతున్నారు. వీటితో పాటు పొదలకూరు వైపు వెళ్లే తెలుగు- వెలుగు బస్సులకు కేంద్రీయ విద్యాలయం రహదారి వద్ద స్టాఫింగ్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
బాలలు... బాటసారులు
ఈ చిత్రంలోని విద్యార్థులు జుక్కల్ మండలం పెద్దగుల్ల గ్రామానికి చెందిన వారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకన రోజూ 5 కి.మీ దూరంలో ఉన్న పెద్ద ఎడ్గి గ్రామానికి వచ్చి చదువుకుంటున్నారు. మండే ఎండ లోనూ వీరు ఇలా కష్టపడుతూ బడికి వస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 3 కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు విద్యాహక్కుచట్టం కింద రవాణా భత్యం చెల్లించాలి. కానీ నాలుగేళ్లుగా విద్యార్థులకు రవాణా భత్యం అందడం లేదు. రవాణా భత్యం సొమ్ముతో సైకిళ్లు కొనుగోలు చేద్దామని ఉన్నతాధికారులు తెరమీదికి తెచ్చినప్పటికీ.. ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. విద్యార్థులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు అధికారులకు అందడంలో జాప్యం, ఉన్నతాధికారుల ఆదేశాలు లేకపోవడం వల్ల రూ. లక్షలు రాజీవ్ విద్యా మిషన్ ఖాతాలో మూలుగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రాథమిక పాఠశాల నివాసానికి కిలోమీటర్ దూరంలో, ఉన్నత పాఠశాల 3 కిలో మీటర్ల దూరంలో ఉండి రవాణా సౌకర్యం (ఆర్టీసీ బస్సు సౌకర్యం) లేకపోతే విద్యార్థులు రవాణా భత్యం పొందవచ్చు. ఇందుకు విద్యార్థికి నెలకు రూ. 300 చొప్పున 10 నెలల భత్యం చెల్లిస్తారు. జిల్లాలో విద్యాహక్కుచట్టం అమలులోకి వచ్చిన తరువాత 2010-11, 2011-12 సంవత్సరాలకు ఒక్కపైసా విడుదల కాలేదు. 2012-13 సంవత్సరంలో 143 మంది విద్యార్థులకు 9 నెలల భత్యం చెల్లించారు. 2013-14, 2014-15 సంవత్సరాలకు జిల్లాలో 13 పాఠశాలల నుంచి 191 మందికి రవాణా భత్యం చెల్లించారు. కానీ 7 నెలల భత్యం మాత్రమే అందింది. ఈ విద్యా సంవత్సరం.. ఈ విద్యా సంవత్సరం జిల్లాలో దాదాపు 250 పాఠశాలల నుంచి ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు చేరాయి. జిల్లాలో 480 మంది విద్యార్థులకు రవాణా భత్యం అందాల్సి ఉండగా నిధులు మాత్రం 191 మందికి మాత్రమే వచ్చాయి. వచ్చిన నిధులు ఇంకా విద్యార్థుల ఖాతాల్లో జమ కాలేదు. ఇందులో భవిత పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా ఉండడం విశేషం. దీంతో విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తూ ప్రయాణ ఖర్చులతో చదువును కొనుక్కుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. విద్యార్థుల రవాణా భత్యం నిబంధనలకు విరుద్ధంగా మండల విద్యా శాఖాధికారుల(ఎంఈవో)ల బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. అక్కడి నుంచి ఎంఈవో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుని ఖాతాల్లో జమ చేస్తున్నారు. కాని పేద విద్యార్థులకు అందాల్సిన భత్యం కొన్నా చోట్ల పక్కదారి పడుతుందనే విమర్శలు ఉన్నాయి. సక్రమంగా పంపిణీ చేయకపోవడం, విద్యార్థులకు ఆలస్యంగా అందజేయడం వంటి కారణాలతో మారుమూల గ్రామాల తండా ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకు దూరమై బాలకార్మికులుగా మారుతున్నారు. తెరపైకి సైకిళ్ల వ్యవహారం.. రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు ఈ విద్యా సంవత్సరం వి ద్యార్థులకు అందజేయాల్సిన రవాణా భత్యానికి బదులుగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని భావించారు. అయితే ఆ దిశగా ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో జుక్కల్, కమ్మర్పల్లి, బిచ్కుంద, గాంధారి, సిరికొండ భీంగల్ వంటి మారుమూల మండలాల్లో చదువుకునే విద్యార్థు లు ఆర్థిక స్థోమత లేక, కిలో మీటర్ల దూరం నడవలేక బడి మా నేస్తున్నారు. ఈ మండలాల్లో అధికారుల లెక్కల ప్రకారం 1,130మంది బాలకార్మికులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పాఠశాల విద్యార్థులు అర్హులు కారా... * భీమ్‌గల్ మండలం కుప్కల్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఉన్నత చదువు కోసం 4 కి.మీ దూరంలో ఉన్న జాగిర్యాల్ గ్రామానికి వెళ్తుంటారు. వీరికి రవాణా బత్యం అందడం లేదు. * జుక్కల్ మండలం బంగారుపల్లి, దోసుపల్లి, మైబాపూర్,సిద్దాపూర్, లోంగన్ గ్రామాల విద్యార్థులు దాదాపుగా 40 మంది జుక్కల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు చదువుకోవడానికి వస్తుంటారు. వీరికి రవాణా భత్యం అందనిద్రాక్షగా మారింది. * గాంధారి మండలం కరక్‌వాడి గ్రామానికి చెందిన ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు పై చదువుల కోసం ఉత్తునూర్ వెళ్తుంటారు. వీరికి రవాణా భత్యం గత ఆరేళ్లుగా ఒక్కసారి కూడా అందకపోవడం గమనార్హం. * మోర్తాడ్ మండలం బట్టాపూర్ విద్యార్థులు చదువుకోవడానికి తడపాకల్ వెళ్తుంటారు. వీరిని రవాణా భత్యం పథకం కింద ఇంత వరకు చేర్చలేదు. * ధర్పల్లి మండలం దన్బండాతండా ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు పై చదువుల కోసం దుబ్బాక ఉన్నత పాఠశాలకు వెళ్తుంటారు. వీరికి ఒక్కసారి కూడా రవాణా భత్యం అందలేదు. -
మెట్ట ఆశలపై నీళ్లు
నడికుడి-శ్రీకాళహస్తికి అరకొరగా నిధులు కేటాయింపు కనుచూపులో కనిపించని ఆశలు ఉదయగిరి: మెట్ట ప్రాంతాల ఆశాదీపంగా భావిస్తున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గం నిర్మాణానికి ప్రస్తుత బడ్జెట్లో నిధుల కేటాయింపు అరకొరగా ఉంది. ఐదేళ్లలో రైలు పట్టాలెక్కుతుందని ఆశపడిన మెట్ట ప్రజలకు ఈ బడ్జెట్ చూస్తే కనుచూపు మేరలో తమ ఆశలు నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. ఐదేళ్లలో ఈ మార్గం నిర్మాణం పూర్తవుతుందని ఊదరగొడుతున్న రాష్ర్ట, కేంద్ర మంత్రుల మాటలపై ఆశలు సన్నగిల్లాయి. ఈ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయింపు ఉంటుందని భావించారు. తీరా చూస్తే ఈ కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. 2019 నాటికల్లా ఈ రైల్వే మార్గం పూర్తయి ఈప్రాంత ప్రజల రవాణా సౌకర్యంతో పాటు జీవన స్థితిగతులు మెరుగుపడతాయని భావించినప్పటికీ ఆ ఆశలు నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. 309 కి.మీ నిడివిగల ఈ రైల్వే మార్గం పూర్తికావాలంటే ప్రస్తుత అంచనాల ప్రకారం రూ.2450 కోట్లు నిధులు అవసరం. మరో ఐదేళ్లకు ఇది పూర్తవుతుందని భావిస్తే మరో రూ.500 కోట్ల వరకు అంచనాలు పెరిగే అవకాశముంది. ప్రతి బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయిస్తేనే అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. ప్రస్తుత బడ్జెట్లో ఈ మార్గకు కేవలం రూ.180 కోట్లు కేటాయించారు. ఇదేవిధంగా కేటాయింపులు కొనసాగితే 20 సంవత్సరాలకు గాని ఈ రైల్వే లైను పూర్తికాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జరిగే ఈ రైల్వే లైను నిర్మాణంకు భూసేకరణ దాదాపు పూర్తి కావస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.271 కోట్లు విడుదల చేసింది. పనులు శరవేగంగా జరగడమే తరువాయి. ఈ పరిస్థితుల్లో ఈ బడ్జెట్లో కేంద్రం రూ.200 కోట్లు పైగా కేటాయిస్తుందని భావించారు. రాష్ట్ర వాటా కలుపుకుంటే రూ.400 కోట్లు అవుతుంది. అయితే అలా జరగలేదు. కేంద్రం రూ.90 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర వాటా కలుపుకొని రూ.180 కోట్లు అయింది. ఈ విధంగా కేటాయింపులు ఉండటంతో ఇది ఎప్పుడు పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. నిధుల కేటాయింపు అరకొరే: బసిరెడ్డి మాలకొండయ్య, నాగార్జునసాగర్ ఎడమ కాలువ సాధన కమిటీ చైర్మన్ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని మెట్ట మండలాలకు ఉపయోగకరంగా ఉండే ఈ రైల్వే మార్గం కొన్నేళ్లనుంచి కాగితాలకే పరిమితమైంది. ఈ రైల్వే లైనుకు నిధులు కేటాయింపులు భారీగా ఉంటాయని భావించారు. ఆ పరిస్థితి కనపడలేదు. వచ్చే బడ్జెట్లోనైనా నిధుల కేటాయింపు భారీగా ఉండాలి. -
అక్షరాలా అరకోటి
ఆదివారమూ పోటెత్తిన పుష్కర భక్తులు గంటల తరబడి క్యూలు, రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు సాక్షి నెట్వర్క్: పుష్కర భక్తులకు ఆదివారం కూడా ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. ఆదివారం ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 52.39 లక్షల మంది భక్తులు పుష్కర క్షేత్రాలను సందర్శించారు! దాంతో ప్రధాన పుష్కర ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. భద్రాచలం, కాళేశ్వరం, బాసర ప్రాంతాల్లో వేలాది వాహనాలు ట్రాఫిక్ రద్దీతో చిక్కి భక్తులు అల్లాడిపోయారు. భద్రాచలంలో ఐదారు గంటల పాటు వాహనాలు కదిలే పరిస్థితి లేకపోవడంతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి కాలినడకన వెళ్లి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. కాళేశ్వరంలోనూ 20 కిలోమీటర్ల వర కు ట్రాఫిక్ స్తంభించడంతో మంత్రి ల క్ష్మారెడ్డి, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు రద్దీ తగ్గించే చర్యలు చేపట్టారు. వాహనాల్లోని భక్తులకు నీళ్లు, ఆహార ప్యాకెట్లను అందించారు. బస్సు లు ఏ మూలకూ చాలక భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వర్షం కురవడం వారి కష్టాలను మరిం త పెంచింది. గూడెం ఘాట్‌లో సౌకర్యాల గురించి మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ భక్తులను అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల మంత్రులు పుష్కర స్నానం చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు 2.5 కోట్ల మంది భక్తులు పుణ్యసాన్నాలు చేశారని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. భక్తులు అంచనాలకు మించి తరలి వస్తున్నారన్నారు. విషాదం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వాసి గాదంశెట్టి శ్యాం సుందర్(66) భద్రాచలంలో పుణ్యస్నానం అనంతరం స్వామి దర్శనానికి క్యూలో ఉండగా సృహ తప్పి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఖమ్మం అశ్వాపురం మండలం నెల్లిపాకబంజర వద్ద పుష్కరస్నానానికి వచ్చిన దిలిశాల సత్యనారాయణ అనే పశువైద్యుడు నెల్లిపాక వద్ద పడవ ఎక్కి అవతలి ఒడ్డుకు వెళ్తూ గల్లంతయ్యాడు. నర్సాపూర్ వద్ద ఆయన మృతదేహం లభ్యమైంది. తగినన్ని బస్సులు నడపండి * పుష్కరాలపై సమీక్షలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రెండ్రోజులుగా భక్తుల రద్దీ పెరిగినందున పుష్కరాల్లో ట్రాఫిక్ జామ్ లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే ఎక్కడ ఎన్ని బస్సులు అవసరముంటే అన్ని పంపాలని ఆర్టీసీ ఎండీ రమణారావును ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లను తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం ప్రతినిత్యం సమీక్షిస్తున్నారు. వివిధ జిల్లాల్లోని పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రులు హరీష్‌రావు, తుమ్మల, జగదీష్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న తదితరులతో ఆదివారం మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ అనురాగ్‌శర్మ, ఇతర పోలీసు అధికారులు బాసర నుంచి భద్రాచలం వరకు హెలికాప్టర్లో తిరుగుతూ పరిస్థితిని సమీక్షించారు. -
నత్తనడక
తుపాను బీభత్సం సృష్టించి ఐదు రోజులు అయింది. జిల్లావాసులను ఇంకా ఆ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రకృతి చేసింది కొంతైతే...పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం మరీ ఎక్కువగా ప్రజలను బాధిస్తోంది. ఆకలి మంటలతో అలమటిస్తున్న వారు కొందరైతే... గుక్కెడు నీటి కోసం రాత్రీ పగలు తేడాలేకుండా బోర్ల వద్ద పడిగాపులు కాస్తున్నవారు మరికొందరు. రోడ్డుకు అడ్డం గా పడిన చెట్లను ఇంకా తొలగించకపోవడంతో రవాణా సౌకర్యం లేక అనారోగ్యం ఉన్నా ఇంట్లో మగ్గుతున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే వీరి ఆక్రందనలు అధికారుల చెవులకు చేరడం లేదు. అట్టడుగు వర్గాల ప్రజలను పట్టించుకునే నాథుడే కరువ య్యాడు. మంత్రుల వద్ద మార్కులు కొట్టేయడానికో... వారి ఆగ్రహానికి గురికాకుండా తప్పించుకోడానికో అన్నట్టుగా మాత్రమే పనులు సాగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీరు లేక, బయటకు వెళ్లే దారి లేక, ఉపాధి లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న బడుగులకు ఆశించిన స్థాయిలో సాయం అందడం లేదు. పునరుద్ధరణ పనులు కూడా అదే బాటలో ఉండడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. తుపాను తీరం దాటి ఐదు రోజులు కావస్తున్నా...ఎక్కడికక్కడ పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్ల శిథిలాలతో వాతావరణం ఇంకా భీతావహంగా కనిపిస్తోంది. జిల్లా కేంద్రమైన విజయనగరంలోనే ఆశించినంతంగా పునరుద్ధరణ పనులు సాగడం లేదు. ఇక మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటోఅర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే పూసపాటిరేగ, భోగాపురం, నెల్లిమర్ల, డెంకాడ, గంట్యాడ, జామి, ఎస్.కోట, కొత్తవలస మండలాలు మరో వారం రోజులైనా తేరుకునే పరి స్థితి లేదు. జిల్లా యంత్రాంగమంతా ఉన్న విజయనగరం పట్టణంలోనే ఇప్పటికీ ఎక్కడికక్కడ నేల కూ లిన చెట్లు దర్శనమిస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన వాటిని తొలగించవలసి ఉండగా పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. మున్సిపాలిటీ పరిధిలో ఒక జేసీబీ మూడు రోజులుగా ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఏరియా లో మూలన పడి ఉన్నా.. దాని జోలికెళ్లలేదు. ఇంత విపత్తు సంభవించిన సమయంలో కూడా ఉన్న జేసీబీని కూడా వినియోగించ లేదంటే పునరుద్ధరణ పనులపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పేరుకుపోయిన చెత్త, చెట్ల ఆకులను తొల గిస్తే పునరుద్ధరణ అయిపోయిందనే ధోరణిలో ఉన్నా రు. అధికారులు వచ్చేంత వరకు వేచి చూస్తే తమకు ఇక్కట్లు తప్పవని స్థానికులే సొంత ఖర్చులతో తొల గించుకునేందుకు సిద్ధమవుతున్నారు. పట్టణంలో చాలాచోట్ల స్థానికులే చెట్లను తొలగించారు. ఇలాంటి విమర్శలు వెల్లువెత్తుతున్న దృష్ట్యా గురువారం మా త్రం అధికారులు కాస్త హడావుడి చేశారు. కట్టర్లతో చెట్లు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక పారిశుద్ధ్యం నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. వర్షాలు పడిన తరువాత వ్యాధులు ప్రబలుతాయని తెలిసినా.. వాటి నివారణ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికీ చాలా వీధుల్లో చెత్త పేరుకుపోయి అధ్వానంగా ఉంది. దీంతో రోగాలు ప్రబలుతాయన్న భయాందోళన నెలకొంది. శివారు కాలనీల గురించి అధికారులు అసలు పట్టించుకోవ డం లేదు. ఇక, జిల్లాలో మిగతా ప్రభావిత ప్రాంతాల విషయానికొస్తే ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటించే గ్రామాల్లోనే పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. మిగతా చోట్ల చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే రహదారుల్లో అడ్డంగా పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారు. వాహనాల రద్దీ తక్కువ ప్రాం తాల వైపు కన్నెత్తి చూడటం లేదు. పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, గంట్యాడ, నెల్లిమర్ల, జామి, ఎస్‌కోట తదితర మండలాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. గ్రామాల్లోనైతే విద్యుత్ స్తంబాలను ఎక్కడా తొలగించలేదు. దీంతో విజయనగరం తప్ప మిగతా మండలాల్లోని ప్రభావిత గ్రామాలకు విద్యుత్ సరఫరా పది రోజులకైనా జరుగుతుందా అనే అనుమానం తలెత్తుతోంది. మంచినీటి ఇక్కట్లైతే చెప్పనక్కర్లేదు. జిల్లా కేంద్రంలోనే తాగునీరును సరఫరా చేయడం లేదు. దీంతో చాలామంది చేతిపంపులను ఆశ్రయిస్తున్నారు. పగలురేయి లేకుండా బోరుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బిందె నీళ్లు దొరికితే చాల న్నట్టుగా చాలా ప్రాంతాల ప్రజలు నీటి కోసం వెంపర్లాడుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు తీసుకొచ్చే వాటర్ ట్యాంకులపై ఎగబడుతున్నారు. జిల్లాలోని మిగతా చోట్లైతే తాగునీటి ఇబ్బందులు వర్ణా తీతం. మంచినీటి పథకాలు పని చేయకపోవడం, ట్యాంకర్ల ద్వారా సరఫరా లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. స్నానాలు చేయడం మానేసే పరిస్థితి నెలకొంది. రహదారులు తెగిపడటం, కల్వర్టులు కొట్టుకుపోవడంతో చాలా గ్రామాలు దిగ్బంధంలో ఉన్నాయి. అధికారులు ఎంతసేపూ జిల్లా కేంద్రంపైనే దృష్టి పెడుతున్నారే తప్ప గ్రామీణ ప్రాంతాల వైపు చూడ డం లేదు. నెల్లిమర్ల, గంట్యాడ, జామి, భోగాపురం మండలాల్లో ఇప్పటికీ పలు గ్రామాలకు రాకపోకలు జరగడం లేదు. ఫోన్లు పనిచేయకపోవడంతో తమ ఇబ్బందులను ఇతరులకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సహాయక చర్యలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. తుపాను ప్రకటన నేపథ్యంలో డీలర్ల వద్ద ముందస్తుగానే నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలి. కానీ ఆ దిశగా ఏర్పాట్లు చేయలేదు. దీంతో దాదాపు గ్రామీణ ప్రాంతంలో నిత్యావసర సరుకుల కోసం నానా అగచాట్లు పడుతున్నారు. ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఐఏఎస్‌లు, ప్రత్యేక అధికారుల హడావుడి తప్ప జిల్లాలో ఇంకేమీ కన్పించడం లేదు. యుద్ధ ప్రాతిపదిక చర్యలనేవి కానరావడం లేదు. హైరానా తప్ప మరేది సహాయక చర్యలు వేగవంతం కావడంలేదు. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క మండలం చొప్పున దత్తత తీసుకుని పనిచేసినా ఈపాటికి పునరుద్ధరణ,సహాయ కార్యక్రమాలు జరిగిపోయేవి. విశేషమేమిటంటే ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఎన్యుమరేషన్ బృందాలు చురుగ్గా నష్టాల అంచనా వేస్తున్నాయి. కానీ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాల్సిన జిల్లా అధికారులు, సిబ్బందిలో ఆ చొరవ కన్పించడం లేదు. వెలుగు చూడని నష్టమెంతో... అధికారులకు ప్రాథమిక అంచనాకు రాని నష్టాలు ఎన్నో ఉన్నాయి...వ్యవసాయం, ఇళ్లు , రోడ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు, చెరువు లకే నష్టం జరిగిందనుకుంటున్న అధికారులకు లోతుగా పరిశీలించే కొలదీ అనేక ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హుదూద్ తుపాను ప్రభావం 11 మండలాలపైనే త్రీవంగా ఉందని, 385 గ్రామాల్లోనే తీవ్రనష్టం సంభవించిందని అధికారులు ప్రాథమిక లెక్కలు వేస్తున్నా క్షేత్రస్థాయికి వెళ్లే సరికి ఆ గ్రామాల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. వ్యక్తిగత నష్టం ఎక్కువగా ఉం ది. వాహనాలు, షాపులు నష్టపోయిన వారెంతో మంది ఉన్నారు. వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, షోరూమ్‌లు చాలా వరకు ధ్వంసమయ్యాయి. వాటిపై ఆధారపడ్డ ఉద్యోగ, కార్మికులు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇవన్నీ ఎన్యుమరేషన్ అధికారుల దృష్టికొస్తున్నాయి. ఈ లెక్కలు చూసి సదరు బృందాలు నష్టం వేయి కోట్లు కాదు కదా రెండు వేల కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. కాకపోతే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవన్నీ రికార్డు చేయలేమని మనసులో మాటను చెబుతున్నారు. -
కోల్ కారిడార్‌కు మోక్షం కలిగేనా?
కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్న అన్ని బొగ్గుగనుల మీదుగా రామగుండం నుంచి మంథని, భూపాలపల్లి, చెల్పూరు(ఘన్పూర్), గోవిందరావుపేట (ములుగు), మణుగూరు వరకు రైల్వేలైన్ నిర్మాణం కోసం 1982లోనే రూ.650 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. అధికారులు దీనికి ‘కోల్ కారిడార్’ అని నామకరణం చేశారు. ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. 2010లో అప్పటి పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ ప్రతిపాదనను మరోసారి అప్పటి రైల్వేమంత్రి దృష్టికి తీసుకుపోగా.. సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అయినా ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతం ఈ లైన్ నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. దీంతో రూ.10వేల కోట్లతో ప్రణాళిక సిద్దం చేశారు. కోల్ కారిడార్ నిర్మాణం పూర్తయితే అటవీ ప్రాంతాలైన మంథని, భూపాలపల్లికి రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ఆ రెండు లైన్లకు ఆమోదం లభించేనా? జిల్లావాసులకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపడే విధంగా కరీంనగర్-హైదరాబాద్, కరీంనగర్ -హసన్‌పర్తి వరకు కొత్త లై న్ వేయాలని అప్పటి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పలుమార్లు ప్రతిపాదనలు సమర్పించారు. కానీ అవి ఇంతవరకు ఆమోదానికి నోచుకోలేదు. కనీస సౌకర్యాలు కలిగేనా? జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారు. సౌకర్యాలపై అధికారులు సైతం శ్రద్ధ చూపడంలేదు. రామగుండం రైల్వేస్టేషన్లో రెండో వైపు కూడా టికె ట్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి వద్ద, కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం అత్యవసరం. గత డిసెంబర్లో రామగుండం రైల్వే ప్రధాన గేటు వద్ద కుప్పకూలిన బ్రిడ్జి నిర్మా ణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో పలు మార్గాల నిర్మాణం సగం వర కు పూర్తికావడంతో ఆయా ప్రాంతాల నుం చి సమీప ప్రాంతాలకు పుష్పుల్ రైలు నడపాలనే డిమాండ్ వస్తోంది. ప్రజా విజ్ఞప్తుల పై గత ఎంపీలు సైతం ఏకీభవించారు. కరీంనగర్ నుంచి మోర్తాడ్ వరకు రైలు మార్గం పూర్తయినందున కరీంనగర్, మెట్పల్లి మధ్య పుష్పుల్ రైలు నడపాలని కోరుతున్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ వర కు మరో రైలు నడపాల్సిన అవసరముంది. సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఆగేనా? చెన్నయ్ నుంచి ఢిల్లీ వెళ్లే గరీబ్థ్ ్రసూపర్ఫాస్ట్ రైలు నెల్లూరు (ఆంధ్రప్రదేశ్), చంద్రాపూర్ (మహారాష్ట్ర) మినహా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ఆగదు. కనీసం రామగుండం, మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ సూపర్‌ఫాస్ట్ రైలును పెద్దపల్లిలో నిలుపాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. రామగుండంలో రైల్వేస్టేషన్లో నవ్‌జీవన్, జైపూర్, స్వర్ణజయంతి రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని ప్రయాణికులు ఏళ్ల నుంచి కోరుతున్నారు. -
రోడ్డు విస్తరణతో రవాణా సౌకర్యం మెరుగు
గుర్రంపోడు, న్యూస్‌లైన్: గుర్రంపోడు-మల్లేపల్లిల మధ్య రోడ్డు విస్తరణతో రవాణా సౌకర్యం మరింతగా మెరుగుపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. గుర్రంపోడులో *19 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఆయన ఆది వారం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నల్లగొండ- దేవరకొండల మధ్య రవాణా సౌకర్యం పెరిగి ఈ ప్రాంత అభివృద్దికి దోహదపడుతుందన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్డు విస్తరణ మల్లేపల్లి వరకే కాకుండా జడ్చర్ల వరకు క్రమంగా విస్తరించనున్నట్ట పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, ఆర్డీఓ రవినాయక్, ఆర్అండ్బీ ఎస్ఈ లింగయ్య, ఈఈ రఘునందన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాల చినసత్తయ్యయాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కుప్ప రాములు, చనమల్ల జగదీశ్వర్‌రెడ్డి, కె.వెంకటేశ్వర్‌రెడ్డి, తగుళ్ల యాదయ్య, రంగినేని నర్సింహారావు, వెలుగు రవి, రాధాకృష్ణ, మంచికంటి వెంకటేశ్వర్లు, రాజ్యరమేష్ యాదవ్, ఎంపీడీఓ రాంపర్తి భాస్కర్, తహసీల్ధార్ తిరందాసు వెంకటేశం, సర్పంచ్ రేపాక ప్రమీల పాల్గొన్నారు. 14 స్థానాలను సోనియాకు కానుకగా ఇవ్వాలి దేవరకొండ : తెలంగాణ ప్రజల ఆకాం క్షను నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికి రానున్న ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలి పించి ఆమెకు కానుకగా అందించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కుం దూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని దేవరకొండ మం డలం పెండ్లిపాకలలో మొదటి విడత కృష్ణాజలాల విడుదల, కొండమల్లేపల్లి నుంచి గుర్రంపోడు వరకు రోడ్డు విస్తరణ, దేవరకొండ పట్టణంలోని నాలుగు లేన్ల రహదారి విస్తరణ, దేవరకొండ నుంచి బొల్లిగుట్ట వరకు రహదారి విస్తరణ వంటి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం దేవరకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. చందంపేట మండలంలోని కృష్ణాజలాలు అందని 12గ్రామాల కోసం *12కోట్లను మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ వర్షం వచ్చే ముందు వచ్చే ఆరుద్ర పురుగుల్లా ఎన్నికలకు ముందు అభివృద్ధి చేస్తామంటూ వచ్చేవారిని కాకుండా నియోజకవర్గ అభివృద్దికి ఎంతగానో కృషిచేసిన వారిని ఆదరించాలని కోరారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ నేడు ప్రారంభించిన *100 కోట్ల విలువైన కృష్ణాజలాల మంచినీటి పథకాన్ని ప్రకటించి, పూర్తిచేసి దేవరకొండ ప్రజల ముందుకు వచ్చిన జానారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. సమావేశంలో ఆర్డీఓ రవి నాయక్, ఎంపీడీఓ విజయలక్ష్మీ, తహసీల్దార్ వెంకన్న, కాంగ్రెస్ నాయకులు సురేశ్‌రెడ్డి, ఆలంపల్లి నర్సింహ, పున్న వెంకటేశ్వర్లు, ముక్కమాల వెంకటయ్య, గోవిందు పాల్గొన్నారు. -
విద్యార్థులకు రవాణా భత్యం
బి.కొత్తకోట, న్యూస్‌లైన్ : జిల్లాలో కిలోమీటరు దూరంలో ఉండి, రవాణా సౌకర్యంలేని పాఠశాలల విద్యార్థులకు రవాణా భత్యం అందిస్తున్నామని రాజీవ్ విద్యామిషన్ జిల్లా ప్రాజెక్టు అధికారి ఎస్.లక్ష్మి తెలిపారు. గురువారం బి.కొత్తకోట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆమె జీసీడీవో రమాదేవితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులకు రవాణాఖర్చులు చెల్లించేం దుకు తొలి ఆరు నెలలకు రూ.49 లక్షలు మంజూరు చేసినట్టు చెప్పారు. జిల్లాకు సంబంధించిన విద్యాసమాచారం, యూ-డైస్ వివరాలను పూర్తిస్థాయిలో అందించి రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచామన్నారు. విద్యార్థుల ఆధార్ నంబర్లను ఆన్లైన్లో నమోదుచేయడం ద్వారా ప్రతి విద్యార్థి వివరాలూ అందుబాటులోకి వచ్చాయన్నారు. సీఆర్పీలు పాఠశాలలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, పనితీరు వివరాలను తెలియజేయాలని కోరారు. త్వరలో కేజీబీవీల్లోనూ సలహా కమిటీల ఎన్నికకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఆర్వీఎంకు రూ.149 కోట్లు మంజూరుకాగా అందులో రూ.99 కోట్లు ఉపాధ్యాయుల వేతనాలకు పోతుందని, మిగిలిన రూ.50 కోట్లతో వివిధ కార్యక్రమాలను అమలుచేస్తున్నట్టు వెల్లడించారు. గతంలో ఫిజియోథెరపీ కోసం వచ్చే వికలాంగపిల్లలకు నిలిపివేసిన రూ.100 రవాణాభత్యాన్ని పునరుద్ధరించామన్నారు. వీరి కోసం ఈ డాది రూ.కోటి వ్యయం చేస్తున్నట్టు తెలిపారు. కేజీబీవీలకు ఏడాదికి రూ.50 లక్షలు ఖర్చుచేస్తున్నామని, జిల్లాలో విద్యార్థుల యూనిఫారం కోసం రూ.11.6 కోట్లు ఖర్చుచేశామని చెప్పారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు అకడమిక్ శిక్షకులను నియమించినట్టు తెలిపారు. ఇందులో తెలుగుకు 86 మంది, ఉర్దూకు 86 మందిని నియమించి ఒక్కొక్కరికి నెలకు రూ.5వేల చొప్పున వేతనం చెల్లిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో కేవీ.పల్లె, గుడిపల్లె, శ్రీకాళహస్తి, వీ.కోటల్లో రెసిడెన్షియల్ ట్రైనింగ్ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. మదనపల్లెలో ఇప్పటికే రెసిడెన్సియల్ ట్రైనింగ్ కేంద్రం ప్రారంభమైందని ఆమె వెల్లడించారు. -
మంచమెక్కిన ‘అనంత’
సాక్షి, అనంతపురం : వారం రోజుల పాటు కురిసిన వర్షాల ప్రభావంతో జిల్లాలో వేలాది మంది విష జ్వరాలతో మంచం పట్టారు. జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభించాయి. రోజుల తరబడి జ్వరం తగ్గక పోవడంతో చికిత్స కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రవాణా సౌకర్యం లేని గ్రామాల్లో మాత్రం ఏదో పసరు తాగి ఇంటి వద్దే మంచాలపై మగ్గుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, చికున్ గున్యా, డెంగీ జ్వరాలు విసృ్తతంగా వ్యాపించాయి. వీటి నివారణకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖాధికారులు గొప్పలు చెబుతున్నా.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు సరిగా అందుబాటులో లేక పోవడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. గడిచిన మూడు నెలల్లోనే జిల్లాలో 1,044 జ్వరాల కేసులు నమోదయ్యాయి. ఇందులో మలేరియా కేసులు ఏడు, విషజ్వరం కేసులు 286 తేలాయి. తరిమెల పీహెచ్సీ పరిధిలోని కల్లుమడికి చెందిన రాజేంద్రప్రసాద్, కరకముక్కల పీహెచ్సీ పరిధిలో రాజేష్, గుత్తి మండలం వన్నేదొడ్డికి చెందిన జ్యో త్స్న డెంగీతో బాధపడుతున్నారు. అపరిశుభ్రతే కారణం ఇటీవల కురిసిన జడివాన వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. ఇళ్ల ముందే వర్షపు నీరు నిలిచి.. పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దోమలు విజృంభిస్తూ... ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీనికితోడు ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లు తుప్పుపట్టి రంధ్రాలు పడ్డాయి. దీనివల్ల తాగునీటిలోకి వర్షపు నీరు, మురుగు నీరు కలుషితమవుతోంది. పారిశుద్ధ్యం మెరుగుదలకు పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా... గ్రామాల్లో పరిస్థితి మాత్రం మారడం లేదు. ప్రభుత్వ వైద్యులు తమ సొంత ఆస్పత్రుల్లో శుభ్రతపై చూపిస్తున్న శ్రద్ధ.. ప్రభుత్వ ఆస్పత్రులు, గ్రామాలపై చూపడం లేదు. ప్రైవేటు ప్రాక్టీస్‌పైనే దృష్టి పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యుల్లో 90 శాతం మంది పట్టణాల్లోనే కాపురముంటున్నారు. పీహెచ్‌సీల్లో మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తూ.. సొంత నర్సింగ్ హోమ్‌ల అభివృద్ధిపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. పీహెచ్‌సీలకు వెళ్లే రోగులను సైతం తమ నర్సింగ్ హోమ్‌లకు పిలిపించుకుంటూ జేబులకు చిల్లు పెడుతున్నారు. ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లలో రోగులకు రకరకాల వైద్య పరీక్షలను సిఫారసు చేస్తూ వేలాది రూపాయలు గుంజుతున్నారు. మలేరియా బాధితులకు రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1500, డెంగీ రోగులకైతే రూ.3 వేల వరకు, టైఫాయిడ్ బాధితులకు రూ.800 నుంచి రూ.900 వరకు బిల్లు చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నెల క్రితం అనంతపురంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన పద్మ టైఫాయిడ్‌తో బాధపడుతూ... ఇంటి ఎదురుగా ఉండే నర్సింగ్‌హోమ్‌కు వెళ్లింది. మూడు రోజుల పాటు ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాలని వైద్యులు సూచించారు. రోజుకు ఒక ఫ్లూయిడ్ చొప్పున ఎక్కించారు. మందుల బిల్లు రూ.2,500 కాకుండా..ఫ్లూయిడ్స్ ఎక్కించిన దానికే రూ.5,500 వేశారు. ఈ బిల్లు చూసి పద్మ భర్త విస్తుపోయాడు. ఆందోళన కల్గిస్తున్న విష జ్వరాలు జిల్లా వ్యాప్తంగా విజృంభిస్తున్న విష జ్వరాలు ప్రజలకు ఆందోళన కల్గిస్తున్నాయి. వారం పదిరోజులైనా జ్వరం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదని రోగులు వాపోతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విష జ్వరాలతోనే 18 మంది మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ సంఖ్య 30 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో 3,21,507 మందికి రక్త పరీక్షలు చేశారు. 95 మంది మలేరియా, ముగ్గురు డెంగీ, ఒకరు చికున్ గున్యా, 27 మంది విష జ్వరాలతో బాధపడుతున్నట్లు తేలిందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మలేరియా, విష జ్వరాల పీడితులు వేల సంఖ్యలోనే ఉన్నారు. ఒక్క అనంతపురం సర్వజనాస్పత్రిలో ఆగస్టులో 474 మందికి వైద్య పరీక్షలు చేయగా 103 మందికి విష జ్వరాలు ఉన్నట్లు తేలింది. సెప్టెంబర్‌లో 467 మందికి గాను 97, అక్టోబర్‌లో 292 మందికి గాను 86 మంది విష జ్వరాలతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. అలాగే ఈ మూడు నెలల్లోనే ఏడు మలేరియా కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మలేరియా, టైఫాయిడ్, విషజ్వర పీడితుల సంఖ్యకు లెక్కేలేదు. అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టకపోతే సీజనల్ వ్యాధులు మరింత విజృంభించే ప్రమాదముంది.