అభివృద్ధికి రహదారి.. చెన్నై, కోల్‌కతా మధ్య మరింత వేగంగా ప్రయాణం  | NH 216 works Near to Complete Boost To Coastal Transport | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి రహదారి.. చెన్నై, కోల్‌కతా మధ్య మరింత వేగంగా ప్రయాణం 

Published Sat, Apr 16 2022 4:16 PM | Last Updated on Sat, Apr 16 2022 4:26 PM

NH 216 works Near to Complete Boost To Coastal Transport - Sakshi

సాక్షి, కృష్ణాజిల్లా: కోస్తా తీరం అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచేందుకు చేపట్టిన 216 నంబరు జాతీయ రహదారి నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తీరప్రాంతం పారిశ్రామిక, వర్తక, వాణిజ్య రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల అభివృద్ధికి చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణం ఎప్పుడో పూర్తికావాల్సి ఉంది. టీడీపీ పాలకుల కమీషన్ల కక్కుర్తి కారణంగా పనుల్లో జాప్యం నెలకొంది.

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు వరకు జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే మచిలీపట్నం పోర్టు ద్వారా చెన్నై, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు రవాణా మార్గం సులభతరం అవుతుంది. బందరు పోర్టు అనుబంధ పరిశ్రమలకు రోడ్డు రవాణా మార్గం అందుబాటులోకి వస్తుంది. బాపట్ల, రేపల్లెతో పాటు కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల నుంచి ఏటా రూ.1150 కోట్ల ఎగుమతులు సాధిస్తున్న ఆక్వా రంగం మరింతగా పుంజుకుంటుంది.  

తగ్గనున్న 150 కి.మీ. దూరం 
తమ ప్రాంతం అభివృద్ధి కోసం జాతీయ రహదారి నిర్మాణాన్ని చేపట్టాలంటూ 2002లో కృష్ణా జిల్లా లోని పలు మండలాలకు చెందిన మత్స్యకారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. నెలల తరబడి దీక్షలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ ఉద్యమ ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం 216 జాతీయ రహదారిని నిర్మిస్తామని ప్రకటించింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే చెన్నై – కోల్‌కతా మధ్య 150 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కోల్‌కతా, చెన్నై మధ్య రాకపోకలు సాగించే వాహనాలు ఏలూరు, విజయవాడ, గుంటూరు వెళ్లకుండానే నేరుగా ఒంగోలు చేరుకుంటాయి. ఫలితంగా ఇంధనం, సమయం ఆదా అవుతాయి.  

కోస్తా తీర ప్రగతికి రాచమార్గం 
216 జాతీయ రహదారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృత్తివెన్ను మండలం పల్లెపాలెం నుంచి పులిగడ్డ వరకు 120 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఈ రహదారిని నాలుగు వరసలుగా  విస్తరిస్తున్నారు. 16 నంబరు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా ఒంగోలు నుంచి 216వ నంబరు జాతీయ రహదారి ప్రారంభమవుతుంది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ కత్తిపూడి వద్ద తిరిగి 16 నంబరు జాతీయ రహదారిలో కలుస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 260.5 హెక్టార్లు, పశ్చిమ గోదావరిలో 30, కృష్ణాలో 138, గుంటూరులో 48, ప్రకాశంలో 123.48 హెక్టార్ల భూములు సేకరించారు. ఇందు కోసం నిర్వాసితులకు రూ.320 కోట్లు చెల్లించారు.  

పొడవైన వంతెనలు.. పెద్ద ఎత్తున కల్వర్టులు 
ప్రాజెక్టులో భాగంగా రైల్వే క్రాసింగ్‌ ఉన్న చోట్ల ఆరు ప్రాంతాల్లో రైల్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ)లు నిర్మిస్తున్నారు. పిఠాపురం, సామర్లకోట, రావులపాలెం, పెడన, భట్టిప్రోలు, చినగంజాం వద్ద ఆర్వోబీలు నిర్మిస్తున్నారు. కాకినాడ వద్ద 19 కిలోమీటర్ల పొడవున బైపాస్‌ నిర్మించారు. గతంలో ఉన్న వంతెనల స్థానంలో 164 కొత్త వంతెనలను నిర్మిస్తున్నారు. ఈపూరుపాలెం – ఒంగోలు మధ్య 25, కత్తిపూడి – కాకినాడ మధ్య 23 వంతెనలు నిర్మిస్తున్నారు. 731 కల్వర్టులు అందుబాటులోకి రానున్నాయి. కృష్ణా జిల్లాలో పెడన వద్ద ఇప్పటికే బైపాస్‌ ఉండగా, బంటుమిల్లి సమీపంలో మరో బైపాస్‌ నిర్మిస్తున్నారు. చల్లపల్లి, మోపిదేవి, మచిలీపట్నం వద్ద బైపాస్‌లు నిర్మిస్తున్నారు.  

ఏడు టోల్‌ ప్లాజాలు 
ఈ రహదారిపై ఏడు టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేస్తారని సమాచారం. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు, అన్నంపల్లి, పశ్చిమగోదావరి జిల్లా సీతారాంపురం, కృష్ణా జిల్లా బాసినపాడు, మోపిదేవి, గుంటూరు జిల్లా రెడ్డిపాలెం, ప్రకాశం జిల్లా పెదగంజాం వద్ద టోల్‌ప్లాజాలు ఏర్పాటవు తాయని తెలుస్తోంది. ఈ జాతీయ రహదారిపై సాధారణ వేగం 80, గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. ఈ రహదారిని ఒకే దిశలో మలుపులు లేకుండా డిజైన్‌ చేశారు. వంతెనల వద్ద అప్రోచ్‌రోడ్ల నిర్మాణం పనులు సాగుతున్నాయి. తీర ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఈ రహదారిని మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి.

మోపిదేవి మండలం పెదప్రోలు వద్ద నిర్మాణంలో ఉన్న 216 జాతీయ రహదారి

పెడన వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement