
జన సంచారం లేక వెలవెలబోతున్న ముప్పాళ్లలో ప్రజావేదిక సభకు వెళ్లే రోడ్డు
ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలి
జనాభా పెరుగుదల ముఖ్యం
సీఎం చంద్రబాబు
కంచికచర్ల/నందిగామ టౌన్: సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇందుకోసం అందరి ఆలోచనా విధానంలో మార్పు రావాలని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో శనివారం జరిగిన ప్రజావేదికలో పీ–4లో భాగంగా మార్గదర్శి, బంగారు కుటుంబం కింద ఎంపికైన వారిని సీఎం సన్మానించి ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఆర్థికంగా ఉన్నతంగా ఎదిగినవారు వెనుకబడినవారికి సహాయపడాలని పిలుపునిచ్చారు.
మహిళల కోసం తాను 30 ఏళ్ల కిందటే డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చానని, ఇప్పుడు దీపం–2 పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ‘తల్లికి వందనం’ కింద ఆర్థిక సాయం అందిస్తామన్నారు. జనాభా పెరుగుదల అత్యంత ముఖ్యమని అన్నారు.
అనంతరం ప్రజల నుంచి సీఎం అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), కలెక్టర్ జి.లక్ష్మీశ, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), వసంత కృష్ణప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ముప్పాళ్ల గ్రామంలో ఉన్న ఆయన విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు.
దళిత ఎమ్మెల్యేకు అవమానం
ఎన్టీఆర్ జిల్లాలో శనివారం చంద్రబాబు పర్యటన సందర్భంగా దళిత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు తీవ్ర అవమానం జరిగింది. ముప్పాళ్ల గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు కొలికపూడి శ్రీనివాసరావు హెలిప్యాడ్ వద్ద వేచి ఉన్నారు. చంద్రబాబు హెలికాప్టర్ దిగి వస్తుండగా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎదురుగా వెళ్లి కరచాలనం చేసి స్వాగతం పలికారు.
కొలికపూడి శ్రీనివాసరావు కూడా చంద్రబాబుకు నమస్కారం చెప్పి కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా... చంద్రబాబు అసలు ఆయనను పట్టించుకోకుండా పక్కన ఉన్నవారిని పిలిచారు. దీంతో కొలికపూడి చిన్నబుచ్చుకుని చివరకు వెళ్లి నిలుచున్నారు.
ప్రజావేదిక వెలవెల
నందిగామటౌన్: ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన ప్రజావేదిక బహిరంగసభకు ప్రజలు ఆసక్తి చూపలేదు. దీంతో ప్రజావేదిక సభకు వెళ్లే రోడ్డు వెలవెలబోయింది. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం ముఖ్యమంత్రి పర్యటనపై ఆసక్తి చూపలేదు. ముప్పాళ్ల గ్రామ ప్రజలు కూడా తక్కువగానే రావటంతో సభా ప్రాంగణానికి వెళ్లే రోడ్డు జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపించింది. సభా ప్రాంగణంలో కూడా తక్కువగా కనిపించారు.