
సాక్షి, విజయవాడ: పిల్లి కళ్లుమూసుకుని పాలుతాగుతూ ఎవరూ చూడటం లేదనుకునే రకం చంద్రబాబు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఏపీని శ్రీలంక చేసేశాడని చంద్రబాబు ప్రచారం చేశారు.. అధికారంలోకి వచ్చి 10 నెలల కాలంలో మీ ప్రభుత్వ ట్రాక్ రికార్డ్ ఏంటో చెప్పాలి’’ అంటూ చంద్రబాబును నిలదీశారు.
‘‘గతేడాది 90 వేల కోట్లు అప్పులు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలు కాగానే 5750 కోట్లు అప్పుతెచ్చారు. అన్ని కార్పొరేషన్ల పేరుమీద అప్పులు తెచ్చి ఏపీని అప్పులు పాలు చేస్తున్నావ్. అమరావతి రాజధాని పేరుతో 31 వేల కోట్లు అప్పు తెచ్చావ్. ఒక్క అమరావతి రాజధాని కోసమే 62 వేల కోట్లు అప్పు తేవాలని చూస్తున్నారు. అమరావతికి కేంద్రం గ్రాంట్ ఇస్తుందని జబ్బలు చరిచారు. గ్రాంట్ ఎక్కడిచ్చారో సమాధానం చెప్పాలి’’ అంటూ రామకృష్ణ దుయ్యబట్టారు.
అప్పులపై సీఎం చంద్రబాబు తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలి. బీజేపీ అధికారంలోకి వచ్చి పదకొండేళ్లయ్యింది. ఈ పాలనలో ఒక్క సమస్యనైనా పరిష్కరించారా?. హిందువుల గురించి మాట్లాడే మీరు వారికి ఏం మేలు చేశారో సమాధానం చెప్పాలి. 2014 ఎన్నికల్లో ప్రస్తావించిన అంశాల్లో ఒక్కటైనా చేశారా?. ఈ దేశంలో రైతులకు ఏమైనా మేలు చేశారా?. 2014 నుంచి 2022 వరకూ మోదీ పాలనలో లక్షా 474 మంది రైతులు, కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు, కూలీలు ఆత్మహత్యలపై మీ దగ్గర సమాధానం లేదు’’ అని రామకృష్ణ ధ్వజమెత్తారు.
‘‘పేదరికం తగ్గించలేక పోయారు. ధరలు తగ్గించలేకపోయారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఇవ్వలేకపోయారు. విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తెప్పిస్తామని వారితో లాలూచీ పడ్డారు. ముస్లింలకు వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడమే అజెండాగా పెట్టుకున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు ఓటేసి ముస్లింలకు టీడీపీ ద్రోహం చేసింది. పేద ముస్లింల అభివృద్ధి కోసం వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చారని పవన్ మాట్లాడుతున్నాడు. ఆయనకు స్క్రిప్ట్ రాసిచ్చినోడు ఎవడో తెలియడం లేదు?. పవన్‌ను ఢిల్లీ తీసుకెళ్లి వక్ఫ్ సవరణ బిల్లుపై స్పీచ్ ఇప్పించాలి’’ అంటూ రామకృష్ణ ఎద్దేవా చేశారు.
‘‘ఇప్పుడు ముస్లింలపై దాడి చేశారు. తర్వాత క్రిస్టియన్లు, దేవాలయాల స్థలాలపై పెత్తనం చేస్తారు. భారతదేశంలోని అన్ని మత సంస్థలపై పెత్తనం కోసమే ఈ వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సీపీఐ పెద్ద ఎత్తున పోరాటం చేపడుతోంది. ఈనెల 13వ తేదీన విజయవాడలో భారీ సదస్సు నిర్వహిస్తున్నాం’ అని రామకృష్ణ వెల్లడించారు.