సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో బుల్డోజర్ల ప్రభుత్వం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. ఇచ్చిన హామీల అమలుపై లేని శ్రద్ధ.. ఏ ఇల్లు కూల్చాలి? ఏ కార్యాలయం కూల్చాలనే దానిపై మాత్రమే పెట్టారంటూ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే కొలికపూడి స్థాయికి దిగజారి వ్యవహరించారు. బుల్డోజర్‌తో ఎమ్మెల్యే వెళ్లి ప్రత్యర్థుల ఇంటిని కూల్చడం ఏంటి? అని ప్రశ్నించారు.
‘‘తిరువూరులో కొలికపూడి చెలరేగిపోయారు. చంద్రబాబు తిరువూరు ఎమ్మెల్యే వ్యవహార శైలిపై సమాధానం చెప్పాలి. అధికార మదంతోనే కొలకపూడి వెళ్లి ఎంపీపీ ఇంటిని కూల్చారు. ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో లేకుండా చేస్తున్నారు. కొలికపూడి శ్రీనివాస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారు. మంచి పాలన అందిస్తారని కూటమికి ప్రజలు ఓటేశారు. పెన్షన్ల పంపిణీలో కూడా ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఇచ్చారు. సర్పంచ్‌లు, ఎంపీపీలను కూడా పిలవకుండా పెన్షన్లు ఇచ్చారు’’ అంటూ కైలే అనిల్ కుమార్ నిప్పులు చెరిగారు.
టీడీపీ డైరెక్షన్‌లో అరాచకాలు: నందిగం సురేష్
మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చాక దారుణాలు జరుగుతున్నాయని.. టీడీపీ డైరెక్షన్‌లో అరాచకాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనన్ని దారుణాలు ఏపీలో జరుగుతున్నాయి. ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవటానికే తాము అధికారంలోకి వచ్చినట్టుగా పరిస్థితి ఉంది.. వైఎస్సార్‌సీపీ కంటే మంచి పాలన ఇస్తామని అందరినీ నమ్మించారు. నిజమేనేమో అని ఓట్లేస్తే జరుగుతున్నది దారుణంగా ఉంది. కళ్లకు గంతలు కట్టుకున్నట్టుగా ప్రభుత్వం ఉంది’’ అంటూ మండిపడ్డారు.
‘‘తిరువూరులో ఎమ్మెల్యే చేసిన అరాచకాన్ని ఏం అనాలి?. వైఎస్సార్‌సీపీ నేత అక్రమంగా బిల్డింగ్ కడితే అధికారులు చర్యలు తీసుకుంటారు.. కానీ ఎమ్మెల్యే కొలకపూడి బుల్డోజర్ తీసుకుని బిల్డింగ్‌లను పడేయటం ఏంటి?. పెన్షన్ల పంపిణీలో కూడా లంచాలు తీసుకున్నారు. ఇవన్నీ జనం చూస్తూనే ఉన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు ఎప్పుడూ జరగలేదు. వైఎస్సార్‌సీపీ వారి అంతు చూస్తామంటూ టీడీపీ నేతలు మాట్లాడుతున్న తీరు దారుణంగా ఉంది’’ అని సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఒక మంత్రి భార్య సైతం పోలీసులను బెదిరించారు. వైఎస్ జగన్ పాలనలో ఇలాంటివి ఎప్పుడైనా జరిగిందా?. తిరువూరులో పోలీసులు అడ్డుకుంటున్నా వారిని పక్కకు నెట్టేశారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా చేయొచ్చనుకుంటున్నారు. అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. ఈలోపే జనానికి కూటమి ప్రభుత్వం మీద చిరాకు వచ్చింది. రౌడీరాజ్యంలాగ కాకుండా ప్రజా పాలన చేయాలని కోరుకుంటున్నాం. లేకపోతే ప్రజలే తగిన బుద్ది చెప్తారు’’ అంటూ నందిగం సురేష్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment