మెట్ట ఆశలపై నీళ్లు
నడికుడి-శ్రీకాళహస్తికి
అరకొరగా నిధులు కేటాయింపు
కనుచూపులో కనిపించని ఆశలు
ఉదయగిరి: మెట్ట ప్రాంతాల ఆశాదీపంగా భావిస్తున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గం నిర్మాణానికి ప్రస్తుత బడ్జెట్‌లో నిధుల కేటాయింపు అరకొరగా ఉంది. ఐదేళ్లలో రైలు పట్టాలెక్కుతుందని ఆశపడిన మెట్ట ప్రజలకు ఈ బడ్జెట్ చూస్తే కనుచూపు మేరలో తమ ఆశలు నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. ఐదేళ్లలో ఈ మార్గం నిర్మాణం పూర్తవుతుందని ఊదరగొడుతున్న రాష్ర్ట, కేంద్ర మంత్రుల మాటలపై ఆశలు సన్నగిల్లాయి. ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయింపు ఉంటుందని భావించారు. తీరా చూస్తే ఈ కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. 2019 నాటికల్లా ఈ రైల్వే మార్గం పూర్తయి ఈప్రాంత ప్రజల రవాణా సౌకర్యంతో పాటు జీవన స్థితిగతులు మెరుగుపడతాయని భావించినప్పటికీ ఆ ఆశలు నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. 309 కి.మీ నిడివిగల ఈ రైల్వే మార్గం పూర్తికావాలంటే ప్రస్తుత అంచనాల ప్రకారం రూ.2450 కోట్లు నిధులు అవసరం.
మరో ఐదేళ్లకు ఇది పూర్తవుతుందని భావిస్తే మరో రూ.500 కోట్ల వరకు అంచనాలు పెరిగే అవకాశముంది. ప్రతి బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయిస్తేనే అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ మార్గకు కేవలం రూ.180 కోట్లు కేటాయించారు. ఇదేవిధంగా కేటాయింపులు కొనసాగితే 20 సంవత్సరాలకు గాని ఈ రైల్వే లైను పూర్తికాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జరిగే ఈ రైల్వే లైను నిర్మాణంకు భూసేకరణ దాదాపు పూర్తి కావస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.271 కోట్లు విడుదల చేసింది. పనులు శరవేగంగా జరగడమే తరువాయి. ఈ పరిస్థితుల్లో ఈ బడ్జెట్‌లో కేంద్రం రూ.200 కోట్లు పైగా కేటాయిస్తుందని భావించారు.
రాష్ట్ర వాటా కలుపుకుంటే రూ.400 కోట్లు అవుతుంది. అయితే అలా జరగలేదు. కేంద్రం రూ.90 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర వాటా కలుపుకొని రూ.180 కోట్లు అయింది. ఈ విధంగా కేటాయింపులు ఉండటంతో ఇది ఎప్పుడు పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. నిధుల కేటాయింపు అరకొరే: బసిరెడ్డి మాలకొండయ్య, నాగార్జునసాగర్ ఎడమ కాలువ సాధన కమిటీ చైర్మన్ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని మెట్ట మండలాలకు ఉపయోగకరంగా ఉండే ఈ రైల్వే మార్గం కొన్నేళ్లనుంచి కాగితాలకే పరిమితమైంది. ఈ రైల్వే లైనుకు నిధులు కేటాయింపులు భారీగా ఉంటాయని భావించారు. ఆ పరిస్థితి కనపడలేదు. వచ్చే బడ్జెట్‌లోనైనా నిధుల కేటాయింపు భారీగా ఉండాలి.