బాలలు... బాటసారులు | Childrens ... Pedestrians | Sakshi
Sakshi News home page

బాలలు... బాటసారులు

Published Sun, Apr 10 2016 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

బాలలు... బాటసారులు

బాలలు... బాటసారులు

ఈ చిత్రంలోని విద్యార్థులు జుక్కల్ మండలం పెద్దగుల్ల గ్రామానికి చెందిన వారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకన రోజూ 5 కి.మీ దూరంలో ఉన్న పెద్ద ఎడ్గి గ్రామానికి వచ్చి చదువుకుంటున్నారు. మండే ఎండ లోనూ వీరు ఇలా కష్టపడుతూ బడికి వస్తున్నారు.
 విద్యా హక్కు చట్టం ప్రకారం 3 కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు విద్యాహక్కుచట్టం కింద రవాణా భత్యం చెల్లించాలి. కానీ నాలుగేళ్లుగా విద్యార్థులకు రవాణా భత్యం అందడం లేదు.

రవాణా భత్యం సొమ్ముతో సైకిళ్లు కొనుగోలు చేద్దామని ఉన్నతాధికారులు తెరమీదికి తెచ్చినప్పటికీ.. ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. విద్యార్థులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు అధికారులకు అందడంలో జాప్యం, ఉన్నతాధికారుల ఆదేశాలు లేకపోవడం వల్ల రూ. లక్షలు రాజీవ్ విద్యా మిషన్ ఖాతాలో మూలుగుతున్నాయి.

 
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రాథమిక పాఠశాల నివాసానికి కిలోమీటర్ దూరంలో, ఉన్నత పాఠశాల 3 కిలో మీటర్‌ల దూరంలో ఉండి రవాణా సౌకర్యం (ఆర్టీసీ బస్సు సౌకర్యం) లేకపోతే విద్యార్థులు రవాణా భత్యం పొందవచ్చు. ఇందుకు విద్యార్థికి నెలకు రూ. 300 చొప్పున 10 నెలల భత్యం చెల్లిస్తారు. జిల్లాలో విద్యాహక్కుచట్టం అమలులోకి వచ్చిన తరువాత 2010-11, 2011-12 సంవత్సరాలకు ఒక్కపైసా విడుదల కాలేదు. 2012-13 సంవత్సరంలో 143 మంది విద్యార్థులకు 9 నెలల భత్యం చెల్లించారు. 2013-14, 2014-15 సంవత్సరాలకు జిల్లాలో 13 పాఠశాలల నుంచి 191 మందికి రవాణా భత్యం చెల్లించారు. కానీ 7 నెలల భత్యం మాత్రమే అందింది.
 
ఈ విద్యా సంవత్సరం..
ఈ విద్యా సంవత్సరం జిల్లాలో దాదాపు 250 పాఠశాలల నుంచి ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు చేరాయి. జిల్లాలో 480 మంది విద్యార్థులకు రవాణా భత్యం అందాల్సి ఉండగా నిధులు మాత్రం 191 మందికి మాత్రమే వచ్చాయి. వచ్చిన నిధులు ఇంకా విద్యార్థుల ఖాతాల్లో జమ కాలేదు. ఇందులో భవిత పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా ఉండడం విశేషం. దీంతో విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తూ ప్రయాణ ఖర్చులతో చదువును కొనుక్కుంటున్నారు.
 
నిబంధనలకు విరుద్ధంగా..
విద్యార్థుల రవాణా భత్యం నిబంధనలకు విరుద్ధంగా మండల విద్యా శాఖాధికారుల(ఎంఈవో)ల బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. అక్కడి నుంచి ఎంఈవో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుని ఖాతాల్లో జమ చేస్తున్నారు. కాని పేద విద్యార్థులకు అందాల్సిన భత్యం కొన్నా చోట్ల పక్కదారి పడుతుందనే విమర్శలు ఉన్నాయి. సక్రమంగా పంపిణీ చేయకపోవడం, విద్యార్థులకు ఆలస్యంగా అందజేయడం వంటి కారణాలతో మారుమూల గ్రామాల తండా ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకు దూరమై బాలకార్మికులుగా మారుతున్నారు.
 
తెరపైకి సైకిళ్ల వ్యవహారం..
రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు ఈ విద్యా సంవత్సరం వి ద్యార్థులకు అందజేయాల్సిన రవాణా భత్యానికి బదులుగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని భావించారు. అయితే ఆ దిశగా ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో జుక్కల్, కమ్మర్‌పల్లి, బిచ్కుంద, గాంధారి, సిరికొండ భీంగల్ వంటి మారుమూల మండలాల్లో చదువుకునే విద్యార్థు లు ఆర్థిక స్థోమత లేక, కిలో మీటర్ల దూరం నడవలేక బడి మా నేస్తున్నారు. ఈ మండలాల్లో అధికారుల లెక్కల ప్రకారం 1,130మంది బాలకార్మికులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
 
ఈ పాఠశాల విద్యార్థులు అర్హులు కారా...
* భీమ్‌గల్ మండలం కుప్కల్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఉన్నత చదువు కోసం 4 కి.మీ దూరంలో ఉన్న జాగిర్యాల్ గ్రామానికి వెళ్తుంటారు. వీరికి రవాణా బత్యం అందడం లేదు.
* జుక్కల్  మండలం బంగారుపల్లి, దోసుపల్లి, మైబాపూర్,సిద్దాపూర్, లోంగన్ గ్రామాల విద్యార్థులు దాదాపుగా 40 మంది జుక్కల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు చదువుకోవడానికి వస్తుంటారు. వీరికి రవాణా భత్యం అందనిద్రాక్షగా మారింది.
* గాంధారి  మండలం కరక్‌వాడి గ్రామానికి చెందిన ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు పై చదువుల కోసం ఉత్తునూర్ వెళ్తుంటారు. వీరికి రవాణా భత్యం గత ఆరేళ్లుగా ఒక్కసారి కూడా అందకపోవడం గమనార్హం.
* మోర్తాడ్ మండలం బట్టాపూర్ విద్యార్థులు చదువుకోవడానికి తడపాకల్ వెళ్తుంటారు. వీరిని రవాణా భత్యం పథకం కింద ఇంత వరకు చేర్చలేదు.
* ధర్పల్లి మండలం దన్‌బండాతండా ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు పై చదువుల కోసం దుబ్బాక ఉన్నత పాఠశాలకు వెళ్తుంటారు. వీరికి ఒక్కసారి కూడా రవాణా భత్యం అందలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement